ఎండిపోయిన బోరులో నీరొచ్చింది

No water problem for two and half years - Sakshi

రెండున్నరేళ్లుగా నీటి సమస్య లేదు

హైదరాబాద్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌. పద్మరాగం బీఎన్‌రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపుర్‌మెట్‌ మండలం, మజీద్‌పూర్‌ గ్రామపరిధిలో ఎకరంన్నర సాగు భూమిని కొనుగోలు చేశారు. బోరు 250 అడుగులు తవ్వించారు. తవ్వినప్పుడు నీరు పడింది. విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునేటప్పటికి కొద్ది నెలలు సమయం పట్టింది. అప్పుడు మోటారు బిగించి చూస్తే బోరు ఎండిపోయింది.

సేంద్రియ వ్యవసాయం చేద్దామన్న లక్ష్యంతో ‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’ చదవటం పద్మరాగం అలవాటు చేసుకున్నారు. కందకాల ద్వారా వర్షపు నీటిని పొలంలో ఎక్కడికక్కడే ఇంకింపజేసుకొని ‘చేను కిందే చెరువు’ సృష్టించుకోవచ్చని, భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవచ్చని అప్పటికే తెలుసుకున్నారు. బోరు ఎండిపోయిన వెంటనే ఆమె తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించారు. వారు స్వయంగా పొలానికి వచ్చి చూసి వాలుకు అడ్డంగా మీటరు లోతు మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు.

ఆ తర్వాత పడిన వర్షాలకు కందకాలు నిండి భూగర్భ నీటి మట్టం పెరిగింది. బోరులో తిరిగి నీరు పుష్కలంగా రావటం ప్రారంభమైంది. ఈ రెండున్నరేళ్లలో మళ్లీ బోరు ఎండిపోలేదు. కందకాలు తవ్వుకోవడం వల్లనే తన భూమిలో సాగు నీటికి కొరత లేకుండా పోయిందని పద్మరాగం తెలిపారు. ఆపిల్‌ బెర్‌ తోట నాటారు. అంతర పంటలుగా ఉల్లి, వంగ, బెండ వంటి పంటలు కూడా ఒక సీజన్‌లో సాగు చేశారు. గత ఖరీఫ్‌లో 2,3 వర్షాలు మాత్రమే పడినప్పటికీ నీటి కొరత లేదన్నారు. తమ పొలంలో ఇసుక భూమి కావడంతో బోరు కింది నుంచి కూలిపోతూ వస్తున్నదని, ఇప్పుడు 80 అడుగుల లోతులోనూ బోరుకు నీరు పుష్కలంగా అందుతున్నదని పద్మరాగం(92487 48733) ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top