న్యూరో సర్జరీ కౌన్సెలింగ్స్‌

Neuro Surgery Counseling - Sakshi

ట్యూమర్‌కు స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీ చేయాలన్నారు. అంటే ఏమిటి?
మా నాన్నగారి వయసు 65 ఏళ్లు. గత పదేళ్లుగా ఆయనకు డయాబెటిస్‌ ఉంది. ఈమధ్య ఆయనను డాక్టర్‌కు చూపించాం. వారు పరీక్షలు చేసి మెదడులో గడ్డ పెరుగుతున్నట్లు గుర్తించారు. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత అది హానికరం కాని బినైన్‌ గడ్డ అని, క్యాన్సర్‌ గడ్డ కాదని చెప్పారు. అయితే దీనికి స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీ చేయాలన్నారు. ఈ సర్జరీ అంటే ఏమిటి? దీనివల్ల మెదడుపైన ఏదైనా దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందా? దయచేసి వివరంగా చెప్పండి. – కె. వీరరాఘవులు, నెల్లూరు
మెదడులో గడ్డలను తొలగించడానికి ప్రస్తుతం రేడియో సర్జరీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. రేడియో సర్జరీలలో స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీ అత్యాధునికమైనది. చాలా కీలకమైనది కూడా. క్యాన్సర్‌తో సంబంధం లేని, నిరపాయకరమైన 3 సెం.మీ. లోపు బినైన్‌ బ్రెయిన్‌ ట్యూమర్లను తొలగించడానికే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో ఏర్పడ్డ క్యాన్సర్‌ మెదడుకు విస్తరించడం వల్ల ఏర్పడే మెటాస్టాటిక్‌ బ్రెయిడ్‌ డిసీజ్‌కు ఇది అత్యంత ప్రభావవంతమైన శస్త్రచికిత్సగా చెప్పవచ్చు.

స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీలో పేషెంట్ల శరీరంపై ఎలాంటి కోతలు ఉండవు. పుర్రెకు కోత పెట్టకుండా మెదడుకు శస్త్రచికిత్స చేయగలగడం వల్ల ఏమాత్రం రక్తస్రావం లేకుండానే సర్జరీ జరుగుతుంది. కంప్యూటర్‌ సహాయంతో పనిచేసే ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తూ మెదడులోని గడ్డను కచ్చితమైన లక్ష్యంగా చేసుకొని ఈ శస్త్రచికిత్స చేస్తారు. మెదడులోని గడ్డ పరిమాణాన్ని బట్టి స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీని ఒకటి నుంచి ఐదుసార్లు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ చికిత్స చేయించుకున్న రోజునే పేషెంటు ఇంటికి వెళ్లిపోవచ్చు.

కొన్ని మెదడు వ్యాధులకు సంప్రదాయ శస్త్రచికిత్సలతో వైద్యం చేయడం సాధ్యం కావడం లేదు. రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలలో అసాధారణ పరిస్థితి, నాడీకణాలకు నష్టం వాటిల్లే పరిస్థితి లేదా ఇతరత్రా కారణాల వల్ల మెదడులో గడ్డ ఏర్పడ్డ స్థానానికి స్కాల్పెల్‌ (శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తి) వంటి శస్త్రచికిత్స పరికరాలను చేర్చడం సాధ్యం కాదు. అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని పేషెంట్లు శస్త్రచికిత్సను తట్టుకోవడం కష్టం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేడియో సర్జరీ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తున్నది. మీ డాక్టర్‌ సూచించిన స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీ చాలా సురక్షితమైనది. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీ నాన్నగారికి వారు సూచించిన చికిత్స చేయించండి.

పిట్యూటరీ కార్సినోమా కావచ్చు అంటున్నారు...
నా వయసు 38 ఏళ్లు. ఒక నిర్మాణ సంస్థ తాలూకు సైట్‌లో పనిచేస్తుంటాను. ఏడాదికాలంలో నా కంటి చూపు క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. దాంతో ఇదివరకటిలా రంగులు స్పష్టంగా కనిపించడం లేదు. ఒక్కోసారి పూర్తిగా చీకటిగా కూడా అనిపిస్తోంది. ముఖం మొద్దుబారినట్లయి, మైకం కమ్ముతోంది. దాంతో ఉద్యోగంలో బాగా ఇబ్బందిగా అనిపించి, కళ్ల డాక్టరుకు చూపించాను. సైట్‌ ఏమీ లేదని చెప్పి, హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రిలో చూపించమన్నారు. అక్కడికి వెళ్లి చూపించాను. వాళ్లు పిట్యూటరీ కార్సినోమా కావచ్చని అంటున్నారు. అంటే నా కళ్లకు క్యాన్సర్‌ వచ్చినట్లా. పిట్యూటరీ కార్సినోమా అంటే ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – ఆర్‌. డేవిడ్, జనగామ
పిట్యూటరీ కార్సినోమా అన్నది కళ్లకు సంబంధించిన వ్యాధి కాదు. కళ్ల క్యాన్సర్‌ కాదు. పిట్యూటరీ కార్సినోమా అన్నది పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్‌ గడ్డ. పిట్యూటరీ గ్రంథి మెదడులో భాగమైన హైపోథాలమస్‌ దిగువ భాగం నుంచి పొడుచుకువచ్చినట్లుగా బఠాణీగింజ అంత పరిమాణంలో ఉంటుంది. శరీరంలోని ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌ అన్నింటినీ అదుపు చేయగలది కావడం వల్ల దీనికి మాస్టర్‌గ్లాండ్‌ అని పేరు. పిట్యూటరీ గ్రంథి గడ్డలు మనదేశంలో సాధారణంగా కనిపించేవే. ఈ గడ్డల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్‌లు కానటువంటి సాధారణ గడ్డ (పిట్యుటరీ ఎడినోమా)లు.

ఇక రెండో రకానికి చెందినవి పిట్యూటరీ కార్సినోమా (క్యాన్సర్‌) గడ్డలు. ఎండోక్రైన్‌ ట్యూమర్స్‌ అని పేర్కొనే ఈ క్యాన్సర్‌ గడ్డలు అరుదుగా కనిపిస్తాయి. వీటి నుంచి క్యాన్సర్‌ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించగలదు. దీనివల్ల పిట్యూటరీ గ్రంథి పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల మీలో కనిపిస్తున్న లక్షణాలే కాకుండా తీవ్రమైన తలనొప్పి, స్పృహతప్పడం, హైపోథైరాయిడిజం, సెక్స్‌ (పురుషుల్లో టెస్టోస్టెరాన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌)  హార్మోన్ల ఉత్పత్తి మందగించడం, ఎడ్రినల్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

పిట్యూటరీ గడ్డలు ఏర్పడటానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వాతావరణ ప్రభావంగానీ, జీవనళైలి గానీ వీటికి దారితీస్తున్నట్లుగా కూడా ఆధారాలు లేవు. హఠాత్తుగా ఏర్పడే ఈ గడ్డలు వంశపారంపర్యంగా కూడా రావడం లేదు. అయితే ప్రమాదకర స్థాయిలో రేడియేషన్‌కు గురికావడం, క్యాన్సర్‌ కారక రసాయనాల ప్రభావం వల్ల వ్యక్తి శరీరకణాల్లోని జన్యువులు ఉత్పరివర్తనానికి (మ్యూటేషన్స్‌కు) గురికావడం వంటి కారణాల వల్ల పిట్యూటరీ గడ్డలు ఏర్పడుతుండవచ్చునని పరిశోధకులు ఊహిస్తున్నారు.

శరీరంలో హార్మోన్నల హెచ్చుతగ్గుల ఆధారంగా పిట్యూటరీ గ్రంథి గడ్డలను అనుమానించినప్పుడు, దాన్ని నిర్ధారణ చేసేందుకు ఎమ్మారై, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అవి క్యాన్సర్‌ గడ్డలు అవునా, కాదా అని నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో పిట్యూటరీ కార్సినోమా వల్ల క్యాన్సర ఇతర భాగాలకు వ్యాపించిన తర్వాతగా గానీ వాటిని గుర్తించడం సాధ్యపడటం లేదు. ఇది మెదడులోని ఇతర ప్రాంతాలకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం కూడా జరుగుతుంది. మీరు మీ దగ్గర ఉన్న పెద్ద మెడికల్‌ సెంటర్‌లో సంప్రదించగలరు.

బ్రెయిన్‌ ట్యూమర్లతో వినికిడి దెబ్బతిన్నది... ఏం చేయాలి?
నా వయసు 40 ఏళ్లు. దాదాపు పదేళ్ల కిందట మెదడులో గడ్డ ఏర్పడిందని గుర్తించి  శస్త్రచికిత్స చేశారు. ఆ ట్యూమర్‌ (గడ్డ) తొలగించాక ఒక చెవి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయింది. పైగా ఆ చెవిలో ఇప్పుడు నిరంతరం శబ్దం వస్తోంది. ఆ తర్వాత మరో ఎనిమిదేళ్లకు మరో గడ్డను గుర్తించి రేడియేషన్‌ ఇచ్చారు. ఇప్పుడు రెండో చెవిలోనూ శబ్దాలు వస్తున్నాయి. సరిగా వినిపించడం లేదు. తలలో ట్యూమర్లు పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని విన్నాను. నిజమేనా? చెవిలో హోరు తగ్గేదెలా? నా వినికిడి శక్తి మెరుగుపడటానికి మార్గం ఉందా? దయచేసి తగిన విధంగా నన్ను గైడ్‌ చేయండి. – డి. రామభూపాల్‌రెడ్డి, కర్నూలు
మెదడులో ట్యూమర్లు... మెదడు, కేంద్రనాడీ మండలంలోని వివిధ రకాల కణాల నుంచి ఏర్పడతాయి. బినైన్, మాలిగ్నెంట్‌ అని వీటిలో రెండు రకాలు ఉంటాయి. బినైన్‌ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకొని ఉండవు. అందువల్ల అవి ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడానికి వీలైతే, వీటిని సులభంగా తొలగించి వేయడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్‌ కారకాలు కావు. అయితే ఒకసారి సర్జరీ చేసి తీసివేసినా... ఇవి మళ్లీ తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ మెదడులో ఏర్పడినవి బినైన్‌ ప్రైమరీ ట్యూమర్లు కావచ్చు. అందువల్ల ఒకవైపు తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడ్డాయి.

మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వహిస్తూ, శరీరంలోని వేర్వేరు అవయవాలను/భాగాలను నియంత్రిస్తూ ఉంటాయి. అందువల్ల ట్యూమర్‌ ఏర్పడిన భాగంలో మెదడు తన విధిలను నిర్వహంచడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి,  శరీరంలోని వివిధ భాగాల్లో / అవయవాల పనితీరులో దాని ప్రభావం కనిపిస్తుంది. పదకొండేళ్ల కిందట మీరు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీతో పోలిస్తే... మెదడు ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు అసాధారణమైన ఠమెదడులో ఏర్పడిన ట్యూమర్లను ఇప్పుడు సమూలంగా తొలగించడంతో పాటు, వారు సాధారణ జీవితం గడిపేందుకు సిద్ధం చేయడం కూడా ఇప్పుడు బ్రెయిన్‌ ట్యూమర్ల చికిత్సలో భాగంగా రూపొందింది.

గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం చేయకుండా, మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమరును తొలగించివేయగల వైద్యసాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల మీరు మరోసారి మీ డాక్టర్‌ను సంప్రదించి, ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సల గురించి అడిగి తెలుసుకోండి. వారు మీ ఆరోగ్యపరిస్థితిని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సరైన విధానాన్ని మీకు సూచించగలుగుతారు. ఇక మీ వినికిడి శక్తిని పునరుద్ధరించే విషయంలో ఈఎన్‌టీ వైద్యనిపుణుడి సాయం అవసరమా అని నిర్ధారణ చేస్తారు.

- డాక్టర్‌ రవి సుమన్‌ రెడ్డి, సీనియర్‌ న్యూరో అండ్‌ స్పైన్‌ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top