న్యూరో కౌన్సెలింగ్ | Neuro counseling | Sakshi
Sakshi News home page

న్యూరో కౌన్సెలింగ్

Jul 30 2015 11:12 PM | Updated on Sep 3 2017 6:27 AM

మా అమ్మకు 53 ఏళ్లు. చాలాకాలంగా ఆమె భరించలేనంత తలనొప్పితో బాధపడుతున్నారు.

మెదడులో కణుతుల సర్జరీ ఎలాగంటే..!
 
మా అమ్మకు 53 ఏళ్లు. చాలాకాలంగా ఆమె భరించలేనంత తలనొప్పితో బాధపడుతున్నారు. అన్నిరకాల వైద్యాలు ప్రయత్నించిన తర్వాత ఇటీవల ఎమ్మారై స్కాన్ చేయిస్తే మెదడులో క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు తేలింది. ఇది మాకు షాక్‌లా ఉంది. సర్జరీ, రేడియేషన్‌తో కణుతులను తొలగించవచ్చని ఆయన అంటున్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు.
 - కిరణ్మయి, గుడివాడ

మెదడులో క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు హఠాత్తుగా తెలుసుకోవడం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. ఒకప్పుడు మెదడులో కణుతులకు చికిత్స కష్టమేమోగానీ, ఇప్పుడున్న చికిత్స పద్ధతులతో ఇది మరీ అంతగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. చాలారకాల కణుతులకు సమర్థంగా చికిత్స అందించవచ్చు.

సాధారణ కణుతులను సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ కణుతుల విషయంలో వాటిని తొలగించడంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి అవసరమవుతాయి. మెదడులో వచ్చే కణుతుల్లో నాలుగు గ్రేడులు ఉంటాయి. ఇతర క్యాన్సర్ల మొదటి దశతో మొదలై క్రమేపీ ముదిరి నాలుగో దశకు చేరతాయి. కాబట్టి ఇలాంటి క్యాన్సర్లను ముందుగానే గుర్తిస్తే వాటిని దాదాపుగా నయం చేసే వీలుంటుంది. కానీ మెదడులో వచ్చే క్యాన్సర్ కణుతుల విషయంలో క్రమేపీ ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం ఉండదు.

మొదలవుతూనే అవి మూడు లేదా నాలుగో దశలతో ఉండవచ్చు. కణితి మొదటి రెండు గ్రేడులలో ఉంటే చికిత్సతో రోగి జీవితకాలాన్ని పదేళ్లకు పెంచవచ్చు. కానీ నాలుగో దశలో కణుతులు ఉంటే మాత్రం రోగి ఎక్కువకాలం జీవించడం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగ్‌లో అది మొదటి రెండు గ్రేడ్‌లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన అవసరం లేదు. అది పెరిగి 2 నుంచి 3 సెం.మీ. సైజుకు చేరితే అప్పుడు సర్జరీ అవసరమవుతుంది. అలాగే మెదడులోని నుదురు, చెవుల భాగంలో వచ్చే కణుతులను సర్జరీతో తొలగిస్తే చాలావరకు సాధారణ జీవితం గడపవచ్చు. కానీ మెదడు మధ్యభాగంలో వచ్చే కణుతులను పూర్తిగా తొలగించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు మాటలు వచ్చేలా చేసే కేంద్రం, శరీర కదలికలను నియంత్రించే కేంద్రం వంటి వాటిని గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితిని తొలగించాలి. మిగిలిపోయిన భాగాలను రేడియోథెరపీ, కీమోథెరపీల ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ కణితి మెదడు మధ్యభాగంలో వస్తే మెదడు కణజాలాన్నీ , కణితినీ వేరు చేసి చూడటం కష్టమవుతుంది. పొరబాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం. కాబట్టి ఈ తేడాను గుర్తించేందుకు నిపుణులు మైక్రోస్కోపిక్, నావిగేషన్ వంటి పరిజ్ఞానాలను వినియోగిస్తారు. అంటే భిన్న ప్రక్రియలను ఉపయోగించి మెదడు కణుతులను తొలగించేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా అన్ని సౌకర్యాలతో పాటు నిపుణులైన న్యూరోసర్జన్లు ఉన్న దగ్గర్లోని కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం,
సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్,  సికింద్రాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement