సత్య నాయికలు

Movie Actress Played Satyabhama Character On Special Story - Sakshi

స్త్రీ శక్తి

సత్యభామ అంటే.. నిలువెత్తు అహంకారం, పొగరు, మంకుపట్టు.. గారాల భార్యామణి.. ఇవే గుర్తొస్తాయి. వీరోచిత నారీమణిగా ఆమెను దీపావళి నాడు మాత్రమే తలుచుకుంటాం! నిజానికి సత్యభామ నిలువెత్తు ఆత్మస్థయిర్యం, ఆత్మగౌరవం. సడలని పట్టుదల. భర్తతో సమానంగా హోదా తీసుకున్న సహచరి. కష్టాల్లో భర్తకు కొండంత అండగా నిలిచిన  జీవిత భాగస్వామి!

మహిళలకు సంబంధించినంత వరకు నరకాసుర వధ కాదు దీపావళి. పిరికితనాన్ని కాల్చేసి.. ఆత్మ స్థయిర్యాన్ని వెలిగించుకున్న రోజు! మహిళలంతా సత్యభామగా గౌరవం అందుకున్న వేడుక!! ఇలాంటి సత్యభామలు స్క్రీన్‌ మీద కూడా కనిపించి మహిళా ప్రేక్షకుల ఆలోచనా  కోణాన్నే మార్చేశారు. ‘మిష్టర్‌ పెళ్లాం’.. గుర్తుంది కదా? బ్యాంక్‌ ఉద్యోగి అయిన భర్త దొంగతనం నిందతో సస్పెండ్‌ అవుతాడు. అప్పుడు.. అప్పటి దాకా గృహిణిగా ఉన్న భార్య  కుటుంబ పోషణ బాధ్యతను తీసుకొని ఉద్యోగానికి వెళ్తుంది. నైపుణ్యంతో తక్కువ సమయంలోనే పదోన్నతిని, మంచి జీతాన్ని అందుకుంటుంది. ఇంకోవైపు భర్త నిర్దోషి అని రుజువుచేయడానికి తనవంతు ప్రయత్నమూ మొదలుపెట్టి ‘మిష్టర్‌ పెళ్లాం’ అనిపించుకుంటుంది కథానాయిక ఝాన్సీ (ఆమని). రాధాగోపాళం చూసే ఉంటారు. పురుషాహంకారాన్ని మీసానికి అంటించుకున్న గోపాలానికి  చిలిపితనం, సమయస్ఫూర్తి, ప్రజ్ఞాపాటవాలుగల జీవన సహచరి రాధ. గోపాళం (శ్రీకాంత్‌) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. రాధ (స్నేహ) కూడా లాయరే.

ఇంకా చెప్పాలంటే గోపాలం వాదిస్తున్న ఓ కేసులో డిఫెన్స్‌ లాయర్‌. నిజం నిగ్గు తేల్చి భర్తను ఓడిస్తుంది. అహం దెబ్బతిన్న గోపాలం భార్యను వదిలేయాలనుకుంటాడు. అప్పటికి ఆమె గర్భవతి. తను తలదించుకోకుండా.. సాగిల పడకుండా.. భర్త తన తప్పు తెలుసుకునేలా చేస్తుంది రాధ. తప్పొప్పులను సరిదిద్దుకుంటూ నడిస్తేనే దాంపత్యం.. కలిసి ఉంటేనే ఆలుమగలు లేకపోతే ఒక స్త్రీ, ఒక పురుషుడు అని చెప్తుందీ సినిమా. ‘గోరంత దీపం’ ఇంకో సినిమా. భర్తే తండ్రి, గురువు, దైవం అన్నీనూ అనే సుద్దుల సారెతో అత్తారింట్లోకి అడుగుపెడ్తుంది పద్మ (వాణిశ్రీ). భర్త శేషు (శ్రీధర్‌) బ్యాడ్మింటన్‌ ఆటగాడు. అత్తగారి (సూర్యకాంతం) ఆరళ్లు షరామామూలే. భార్య ఆత్మగౌరవాన్ని గుర్తించని భర్త ప్రవర్తనా సహజమే ఆ సంసారంలో. అదనంగా పద్మకున్న సమస్య డాక్టర్‌ మోహన్‌ (మోహన్‌ బాబు). భర్త స్నేహితుడు అతను. ఆమె మీద కన్నేసి కబళించాలని ఎప్పటికప్పుడు ఎత్తులు, పన్నాగాలు పన్నుతూంటాడు. అతని గురించి భర్తకు చెప్పినా వినడు. విన్నా నమ్మడు. నమ్మినా స్పందించడు. అప్పుడు తనే సత్యభామ అయి మోహన్‌ను ఎదుర్కొంటుంది. విజయం సాధిస్తుంది. ఇంటికే కాదు జీవితానికే  దీపావళి తెచ్చుకుంటుంది.

హిందీలో  ‘‘తుమ్హారీ సులూ’’ కూడా ఏం తీసిపోదు ఈ సత్యభామ సీక్వెన్స్‌లో. కథానాయిక  సులోచనా దూబే (విద్యా బాలన్‌) చూపిన  తెగువా తక్కువేం కాదు. రేడియోలో పాటలు వింటూ .. వాళ్లు పెట్టే క్విజ్‌లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్న ఆమె ఒకరోజు రేడియో క్విజ్‌లో విజేతవుతుంది. అప్పటికే భర్త తను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని మారి ఇబ్బందులు పడ్తూంటాడు. సులూ తనకు వచ్చిన బహుమతి తీసుకోవడానికి రేడియో స్టేషన్‌కు వెళ్లి అక్కడ లేట్‌ నైట్‌ షో అనౌన్సర్‌గా జాబ్‌ తెచ్చుకుంటుంది. భర్త ఉద్యోగం పోయే స్థితి వస్తుంటే ఆమె ఉద్యోగంలో రాణిస్తూంటుంది. దీంతో తలెత్తిన భర్త ఈగో సమస్యను, కొడుకు క్రమశిక్షణారాహిత్యాన్ని అన్నిటినీ నేర్పుగా చక్కదిద్దుకొని.. చివరకు తను పనిచేసే రేడియోస్టేషన్‌లోని ఉద్యోగులకు  క్యాటరింగ్‌ సర్వీస్‌ ఇచ్చేలా భర్తకు కాంట్రాక్టూ ఇప్పిస్తుంది సులోచన దూబే.

వర్తమాన ‘సత్య’లు
అయితే ఈ సినిమాలకు పురాణ స్త్రీ సత్యభామ స్ఫూర్తి కాదు. వ్యాపారంలో నష్టం వస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందామని భర్త చతికిలపడితే ఆఖరుసారిగా ఒక్క చాన్స్‌ తీసుకొని దగ్గరున్న బంగారాన్ని కుదువబెట్టి.. కంపెనీకోసం శ్రమించి రుణంలోంచి బయటపడేసి.. తమను నమ్ముకున్న వాళ్ల జీతాలకు పూచీ  ఇచ్చి జీవితాలకు భరోసా కల్పించిన భార్య, ఉన్నది అమ్ముకొని దుబాయ్‌ వెళ్లి ధిర్హామ్స్‌లో సంపాదనను ఇంటికి పంపిస్తాననే ధీమా చూపిన మనిషి అనారోగ్యంతో ఇంటికొచ్చి మంచానికి అతుక్కుపోతే  ఆయన ఆరోగ్యానికి చికిత్సే కాదు కుటుంబ ఆర్థిక సమస్యల ట్రీట్‌మెంట్‌నూ తలకెత్తుకొని ధైర్యంగా జీవనపోరాటం చేస్తున్న ఆ ఇంటి ఇల్లాలు, కష్టాల కడలిలో చిక్కుకున్న ఇంటిని వీడని ధైర్యంతో చక్కబెట్టిన సహధర్మచారిణి.. ఇలాంటి ఇంకెందరో సంసార సమరంలో సొమ్మసిల్లిన భర్తల చేతిలోంచి కుటుంబ రథం పగ్గాలు పట్టి ముందుకు నడిపిస్తున్న వారంతా నిజ జీవితంలోని సత్యభామలే. మహిళాలోకానికి ఎప్పటికీ వారే స్ఫూర్తి.. ప్రేరణ!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top