క్యాన్సర్‌ చికిత్సకు మరింత బలం...

More strength to cancer  treat  - Sakshi

పరిపరిశోధన

శరీర రోగ నిరోధక వ్యవస్థ కణాలనే క్యాన్సర్‌పై ఆస్త్రాలుగా మార్చే ఇమ్యునో థెరపీని మరింత బలోపేతం చేసేందుకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ సరికొత్త మార్గాన్ని కనుక్కున్నారు. శరీరంలోకి ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియాను ముందుగా రోగ నిరోధక వ్యవస్థకు చెందిన తెల్లరక్త కణాలు ఎదుక్కొంటాయని మనకు తెలుసు. కానీ ఇవి క్యాన్సర్‌ కణాలను మాత్రం గుర్తించలేవు. ఇమ్యునో థెరపీలో సీడీ8+ అనే రోగ నిరోధక కణాలను రోగి నుంచి సేకరించి, వాటికి జన్యుపరమైన మార్పులు చేసి మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా అవి క్యాన్సర్‌ కణాలపై దాడి చేసేలా చేస్తారు. అయితే ఈ పద్ధతి కణుతులు ఉన్న క్యాన్సర్లకు పనిచేయదు. సీడీ8+ కణాలు ఏ మార్పు కారణంగా క్యాన్సర్‌ కణాలపై దాడి చేస్తున్నాయో స్పష్టంగా తెలియకపోవడం దీనికి కారణం.

ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. సీడీ8+ కణాల్లోని రన్‌ఎక్స్‌3 అనే ప్రొటీన్‌ వాటి స్వరూపాన్ని మార్చేసి క్యాన్సర్‌ కణాలపై దాడులకు ఉసిగొల్పుతున్నట్లు తెలిసింది. ఈ ప్రొటీన్‌ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు జంతువుల్లోని కణుతుల సైజు గణనీయంగా తగ్గడమే కాకుండా కణుతులు ఏర్పడటంలోనూ జాప్యం జరిగిందని, అవి ఎక్కువ కాలంపాటు మనగలిగాయని తెలిసింది. ‘రన్‌ఎక్స్‌3 ప్రొటీన్‌ సీడీ8+ కణాల్లోని క్రోమోజోమ్‌లపై పనిచేస్తోంది. ఫలితంగా జన్యువుల్లో మార్పులు వస్తున్నాయి. ఆ తరువాత ఈ కణాల్లో క్యాన్సర్‌ కణుతులు ఎక్కువగా పెరుగుతున్నాయి’’ అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాథ్యూ పిప్‌కిన్‌ తెలిపారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top