ఏ సీమల ఏమైతివో

Moments When Shafali Verma Was Out In The T20 World Cup Final - Sakshi

మాధవ్‌ శింగరాజు

గెలవలేక పోయినప్పుడు భూమి మీద మనమొక్కరిమే ఏకాకిలా మిగిలి పోయినట్లు అనిపిస్తుంది.. సృష్టి ప్రారంభపు ఏకకణ జీవిలా! చేజారిన గెలుపుతో పాటే అన్నీ మనల్ని వదిలేసి పోయినట్లూ ఉంటుంది. చూసుకోం గానీ, ఒకరు మాత్రం ఆ క్షణంలో మన చెయ్యి పట్టుకునే ఉంటారు. ఓటమి! మరి ఒంటరివాళ్లం ఎలా అవుతాం?

ఎగరేస్తున్న గాలిపటం తెగిపోతే హటాత్తుగా ఏకాకులై పోతారు చిన్నపిల్లలు. ఇంట్లో వదిలేసి అమ్మ ఊరెళ్లిపోయినా కూడా.. ‘ఏ సీమల ఏమైతివో.. ఏకాకినీ నా ప్రియా..’ అని కృష్ణశాస్త్రిలా విలపిస్తారు. ఆయన్ది కవిత్వం. వీళ్లవి కన్నీళ్లు. అంతే తేడా. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక చిన్నమ్మాయ్‌ షఫాలీ వర్మ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. చిన్నమ్మాయే. ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఆడిన అతి చిన్నవయసు అమ్మాయి. పుట్టిన పదహారేళ్ల నలభై రోజులకే పోటీలోకి వచ్చేసింది.

‘షఫాలీని కన్నీళ్లతో చూడలేకపోతున్నా’ అన్నాడు బ్రెట్‌ లీ. తనకొస్తున్న కన్నీళ్లతో షఫాలీని చూడలేకపోయాడా, కన్నీళ్లతో ఉన్న షఫాలీని చూడలేకపోయాడా! షఫాలీ తనొక్కటే ఏడ్వడం కాదు. క్రీడాదిగ్గజాలకు, ఉద్ధండులకూ ఏడుపులాంటి ఫీలింగ్‌ని తెప్పించింది. ఒకప్పటి ఆస్ట్రేలియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌ లీ. క్యాచ్‌ మిస్‌ అయితే ఎలా ఉంటుందో అతడికి తెలియని బాధ కాదు. క్యాచ్‌ మిస్‌ అయిందన్నది టీమ్‌ పడే బాధ అయితే.. ‘క్యాచ్‌ని మిస్‌ చేశానే’ అన్నది ఆ క్యాచ్‌ పట్టలేకపోయిన వారి బాధ. ఫైనల్స్‌లో కీలకమైన అలీసా హీలీ క్యాచ్‌ని మిస్‌ చేసింది షఫాలీ. అప్పట్నుంచే ఏకాకి అయిపోయింది. తను జారవిడిచింది క్యాచ్‌ని కాదు, కప్పుని.

ఆటకు కనికరం ఉండదు. బ్రెట్‌లీలా ‘ఓ మై షఫాలీ’ అని సానుభూతి పడదు. కన్నీళ్లు పెట్టుకుంటే వెంటనే పెద్ద వర్షాన్ని కురిపించి, ఆ వర్షం నీళ్లలో కన్నీళ్లను కనబడనీయకుండా చేయదు. తన పనిలో తను ఉంటుంది. వెంటనే గెలిచినవాళ్ల దగ్గరకు వెళ్లిపోయి మెరుస్తున్న కప్పులో తన ముఖం చూసుకుని జుట్టు సవరించుకుంటుంది.. తన జట్టేదో గెలిచినట్లు, తనే గెలిపించినట్లు! అలాంటిది.. ఓడిపోయిన జట్టులోని షఫాలీ కన్నీళ్లను ఎందుకు పట్టించుకుంటుంది? ‘చిన్న పిల్లవు కదా, నెక్స్‌ట్‌ టైమ్‌ బెటర్‌ లక్‌’ అంటూ ముంగురుల్ని వేళ్లతో అలా అలా అనేసి ఎందుకు వెళుతుంది? ఆశలు పెట్టుకుంది షఫాలీ.. అందుకొచ్చిన ఏడుపు అది.

‘ఆశలు రాలి ధూళిపడినప్పుడు.. గుండెలు చీల్చు వేదనావేశము బ్రేల్చినప్పుడు.. వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశపు రక్త బిందువులతో..’ మేఘసందేశాన్ని రచియించాడు కృష్ణశాస్త్రి. ఈ అమ్మాయి కళ్లు మేఘాలై, ఓటమి వేదనను వర్షించాయి. అనుకుంటాం.. మన ఒంట్లో ఊపిరనేది ఒకటి ఉంటుందని, అందుకని జీవించి ఉంటాం అని. ఊపిరి కాదు ఉండేది. ఆశ. ఆశే ఊపిరికైనా ఆయువు. ఫైనల్స్‌లో తొలి ఓవర్‌లోనే రెండు పరుగులకే షఫాలీ ఔట్‌ అయింది! ఆయువు అవిరై కళ్లల్లోకి ఉబికి వచ్చేసింది. పిచ్, టీమ్, మెల్‌బోర్న్‌ మైదానం.. ఏవీ కనిపించడం లేదు. అంతా అలికేసినట్లున్న ఒకటే బ్లర్‌ పిక్చర్‌. ఓటమి! షఫాలీ మీద హోప్స్‌ పెట్టుకుంది భారత జట్టు. షఫాలీ ఉందని హోప్స్‌ వదులుకుంది ఆస్ట్రేలియా జట్టు. కప్పు కోసం పోటీ పడుతున్న రెండు జట్లకూ షెఫాలీ ముఖ్యం.

షఫాలీని నిలబెట్టుకోవడం కోసం టీమ్‌ ఇండియా, షఫాలీని పడగొట్టడం కోసం టీమ్‌ ఆస్ట్రేలియా. గెలిస్తే ప్రపంచ కప్పులో భారత మహిళల తొలి విజయం. భారత్‌ను ఓడిస్తే ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియాకు ఐదవ విజయం. అసలు ఫైనల్స్‌కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు టార్గెట్‌ అయింది షెఫాలీ. ‘ఐ జస్ట్‌ హేట్‌ ప్లేయింగ్‌ ఇండియా.. దే హ్యావ్‌ గాట్‌ ద ఉడ్‌ ఓవర్‌ మి’ అని అంది మెగాన్‌ షూట్‌. ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌ తను. ‘గాడ్‌ ద ఉడ్‌’ అనే మాట పూర్తిగా ఆస్ట్రేలియా వాళ్లది. ‘ఎక్కడం’ అని అర్థం. ట్రై సీరీస్‌లో షఫాలీ తన సిక్సర్‌తో ఆమెను ఎక్కేసిందట. అది గుర్తుంచుకుంది షూట్‌. బలమైనవాళ్లు కూడా గుర్తుపెట్టుకునేంత షాట్‌ కొట్టిందన్నమాట షఫాలీ!

క్రీడాకారులలో, చిన్నపిల్లల్లో ప్రతీకారేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. పైగా షఫాలీ క్రీడాకారిణి అయిన చిన్నపిల్ల. ఫైనల్స్‌లో మళ్లీ సిక్సర్‌లు కొట్టి షూట్‌ నోటిని ‘ఆ..’ అని తెరిపించాలని కూడా ఆమె అనుకుని ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తన జట్టును  గెలిపించాలని తపించి ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తొమ్మిదేళ్ల వయసులో.. అబ్బాయిలు మాత్రమే ఆడే అకాడమీలో తనను చేర్పించడానికి అబ్బాయిలా తనకు క్రాఫ్‌ చేయించి సీటు సంపాదించిన తండ్రికి.. హర్యానా నుంచి ఆస్ట్రేలియా వచ్చే ముందు.. ‘నాన్నా.. కప్పుతో కనిపిస్తాం, చూస్తుండు’ అని షఫాలీ చెప్పే ఉండొచ్చు. అదీ సాధ్యం కాలేదు. సాధ్యం కాలేదూ అంటే ప్రయత్నలోపం కాదని తెలుసుకోడానికి షెఫాలీ మరికొన్ని ఆటలు ఆడాలి. దక్కని గెలుపు మిగిల్చి వెళ్లిన ఒంటరితనాన్ని పోగొట్టి అక్కున చేర్చుకునే మైదానాలు, వాటిలో ఆడవలసిన ఆటలు ఇంకా ఎన్నిలేవు ఈ చిన్నమ్మాయ్‌కి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top