నెంబర్‌ 1 అమ్మ

Manujadevi is one of the received women the award from the President - Sakshi

బిడ్డను తల్లి తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది. చూసే వాళ్లకే భారంగా అనిపించే క్షణాలను కూడా తల్లి సంతోషంగానే భరిస్తుంది. జైపూర్‌లోని మంజుదేవి ముగ్గురు పిల్లల తల్లి. ముగ్గురు పిల్లలను కనడానికి ఇరవై ఏడు నెలలు మోసింది. ఇప్పుడు వాళ్లను పోషించడానికి కొన్నేళ్లుగా బరువులు మోస్తోంది. జైపూర్‌ రైల్వే స్టేషన్‌లో కూలీగా ప్రయాణికుల పెట్టెలు మోస్తూ పిల్లల్ని బతికించుకుంటోంది. వాయవ్య రైల్వే జోన్‌లో తొలి మహిళా కూలీ మంజుదేవి. ఈ ఏడాది రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్న 112 మంది సాధికార మహిళల్లో మంజుదేవి కూడా ఒకరు. జీవితానికి రెడ్‌ సిగ్నల్‌!

మంజుదేవి భర్తతో కలిసి జైపూర్‌లో నివసించేది. ఆమె భర్త జైపూర్‌ రైల్వే స్టేషన్‌లో లైసెన్స్‌ ఉన్న పోర్టర్‌. మంజుదేవి ఏమీ చదువుకోలేదు. చదువు రాకపోవడం వల్ల అప్పటి వరకు ఆమెకు ఎటువంటి ఇబ్బంది కూడా ఎదురవలేదు. పెద్ద పెద్ద కోరికలు, ఆశలు లేకపోవడంతో భర్త సంపాదనతో కాపురం హాయిగా గడిచినంత కాలం గడిచిపోయింది. ఏ కష్టమూ లేకపోతే జీవితం జీవితమే కాదని నిరూపించడానికా అన్నట్లు పదేళ్ల క్రితం భర్త మహదేవ్‌ అనారోగ్యంతో మంచం పట్టి, మరణించాడు. మంజుదేవికి భర్త తోడు లేని జీవితం ఊహకు కూడా అందలేదు. కానీ ‘నువ్వు ఒక భర్తకు భార్యవు మాత్రమే కాదు, ముగ్గురు బిడ్డలకు తల్లివి కూడా’ అంతరాత్మ హెచ్చరించింది. 

కూలీగా.. గ్రీన్‌ సిగ్నల్‌
భర్త నుంచి వారసత్వంగా మణులు రాలేదు, మాన్యాలూ రాలేదు. అతడికి ఉన్నది, అతడి నుంచి ఆమె చేతికి వచ్చిందల్లా రైల్వే పోర్టర్‌ లైసెన్స్‌ మాత్రమే. ఆ లైసెన్స్‌తో అధికారుల దగ్గరకు వెళ్లింది. అనుమతిస్తే సామాన్లు మోసి పిల్లల ఆకలి తీర్చుకుంటానని మొర పెట్టుకుంది. అధికారులు స్పందించి భర్త పేరు మీద ఉన్న లైసెన్స్‌ను ఆమె పేరు మీద మార్చి ఇచ్చారు. ఆ లైసెన్స్‌తోపాటు ఆమెకు నార్త్‌వెస్టర్న్‌ రైల్వేస్‌లో తొలి మహిళా కూలీ అనే గుర్తింపు కూడా ఆమెకు ఏ మాత్రం తెలియదు. ఆమెకు తెలిసిందల్లా పిల్లలను పోషించుకోవడానికి ఒక పని కావాలి, భర్త పని చేసిన చోట అయితే తోటివాళ్లు తనకు రక్షణగా ఉంటారు.. అంతే. ఆమె ఊహించింది కూడా నిజమే. చదవడం రాని ఆమెకు తోటి మగ పోర్టర్‌లు అండగా నిలిచారు. ప్లాట్‌ఫామ్‌ నంబర్లు, రైళ్ల పేర్లు, నంబర్లు, బోగీ వివరాలపై ఆత్మీయంగా అవగాహన కల్పించారు. 

దేవుడిచ్చిన లైసెన్స్‌
దేవుడికి పూజలు, ప్రార్థనలు చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు. మంచి జరుగుతుందన్నా కూడా అవన్నీ చేసే ఖాళీ కూడా ఉండదు. మంజుదేవికి తెలిసింది పనిని మించిన దైవం లేదని మాత్రమే. రోజూ ఇంట్లో పని ముగించుకుని పోర్టర్‌ డ్యూటీ కోసం కుట్టించుకున్న కుర్తా, నల్ల పైజామా ధరించి, ‘నార్త్‌వెస్ట్‌ రైల్వే జైపూర్‌ నంబర్‌ 15’ లైసెన్స్‌ను కళ్లకు అద్దుకుని చేతికి కట్టుకుంటుంది. పనికి బయల్దేరుతుంది. కుదరదంటే ఒప్పుకోరు! పోర్టర్‌గా తాను తెలుసుకోవలసినవన్నీ పద్ధతిగానే నేర్చుకుంది మంజుదేవి. అయితే కొందరు ప్రయాణికులు మెట్లెక్కి వెళ్లడానికి బద్దకించి ట్రాక్‌కు అడ్డంగా దాటి వెళ్తుంటారు. వాళ్లు వెళ్లడమే కాకుండా తమ సామాన్లను కూడా తమతోపాటే తెమ్మంటారు. ‘ప్లాట్‌ఫామ్‌ మీద నుంచి ట్రాక్‌ మీదకు దిగడం, అడ్డంగా దాటటం తప్పని తెలుసు. కానీ అలా కుదరదంటే ఒప్పుకోరు, ఇంకా మాట్లాడితే పని చేజారిపోతుంది. వచ్చే డబ్బు రాకుండా పోతుంది. ఆ భయంతో అలాగే ట్రాక్‌ దాటి సామాన్లు తీసుకుపోతుంటాను’ అని చెప్తారు మంజుదేవి.

మనిషి బరువు ముప్పై.. మోసే బరువూ ముప్పై
‘నా బరువు ముప్పై కిలోలు. నేను మోసే సూట్‌కేసుల బరువు కూడా ముప్పై కిలోలు ఉంటుంది. అయితే అదేమీ కష్టంగా ఉండదు. ఎందుకంటే నేను మోసే బరువు నా బిడ్డల కోసమే కదా. బిడ్డల బరువు తల్లికి భారం కాదు. ఈ ఉద్యోగంతో పిల్లలను చదివించుకోగలుగుతున్నాను. అందుకే నా పని నాకు దైవంతో సమానం’ అని రాష్ట్రపతి భవన్‌లో పురస్కారం అందుకున్నప్పుడు మంజుదేవి  చెప్పిన మాటలివి. పిల్లల కోసం ‘తల్లి మాత్రమే’ అనగలిగిన గొప్ప మాట ఇది. 
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top