నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Mar 11 2017 12:12 AM | Updated on Sep 5 2017 5:44 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హలో రామ్‌గారూ... ఎలా ఉన్నారు? థ్యాంక్స్‌ ఫర్‌ కమింగ్‌ బ్యాక్‌.

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

హలో రామ్‌గారూ... ఎలా ఉన్నారు? థ్యాంక్స్‌ ఫర్‌ కమింగ్‌ బ్యాక్‌. నేను ఒక చిన్న కన్ఫ్యూజన్‌లో ఉండిపోయా! మీరు నాకు క్లారిటీ ఇవ్వగలరని కోరుకుంటున్నా. నాకు 2012లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఒకే ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్, ఒకే సామాజిక వర్గం, ఒకే ఐడియాలజీ. సో... ఇద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఇష్టపడ్డాం. కాని సడన్‌గా వాళ్ల నాన్నగారు చనిపోవడంతో ఆ అమ్మాయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. నేను తనకు కౌన్సిలింగ్‌ ఇప్పించాను. నా నుండి ఎంత సపోర్ట్‌ ఇవ్వాలో అంత ఇచ్చి మామూలు మనిషిని చేశాను. ఆ తర్వాత జాబ్‌కోసం ఇద్దరం ప్రిపేర్‌ అయ్యాం. ఎగ్జామ్స్‌ రాసాం. జాబ్స్‌ కూడా వచ్చాయి. అలా 4 ఏళ్లు లవ్‌  చేసుకున్నాం. 2014లో నాకు  క్లినికల్‌ రీసెర్చ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చెయ్యాలనిపించి జాబ్‌ మానేసి వన్‌ ఇయర్‌ కోసం బయటి దేశానికి వెళ్లా. తనతో రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లోనే ఉన్నాను. మధ్యలో ఆరునెలలు గ్యాప్‌ వచ్చింది. 2016 అక్టోబర్‌లో ఇండియాకి వచ్చాను. రాగానే పెళ్లి కన్‌ఫర్మ్‌ చేసుకుందాం అని వాళ్ల ఇంటికి వెళ్లగానే నాకు పంచ్‌ పడింది.

తనకి 2 నెలల క్రితం ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందనీ, డిసెంబర్‌లో మ్యారేజ్‌ అని వాళ్ల అమ్మ చెప్పింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఏమి జరిగి ఉండొచ్చు? కారణం తెలుసుకుందామని మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాను. బాగా అవమానించి పంపించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 4 ఏళ్లు లవ్‌ చేసుకున్నాం. ఆమెకు ఇలా ఎలా నన్ను మోసం చేయాలనిపించింది? నాకు ఆ అమ్మాయిపై  కోపం కానీ, అసహ్యం కానీ లేవు. ఏదో జరిగి ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటో ఎంత ఆలోచిస్తున్నా తట్టడం లేదు సర్‌. తనని కాంటాక్ట్‌ చేయడానికి కావలసిన అన్ని పాజిబుల్‌ వేస్‌ క్లోజ్‌ అయిపోయాయి. ఆలోచిస్తూ ఉంటే ఏడుపు, తలనొప్పి వస్తున్నాయి. నాకు తెలిసి తనకి ఈపాటికి మ్యారేజ్‌ కూడా అయిపోయుంటుంది. మీరు నా సిచ్యుయేషన్‌లో ఉంటే ఏమి చేస్తారు సర్‌? కాస్త కన్‌ఫ్యూజన్‌ క్లియర్‌ చేయండి. ప్లీజ్‌ గివ్‌ రిప్లై సర్‌. – రాఘవేంద్ర, ఈ–మెయిల్‌ ద్వారా


 కొంచెం పక్కకు జరుగుతావా ప్లీజ్‌. డోర్‌కలా అడ్డం నిలబడితే ఎలా? హౌ విల్‌ ఐ  కమ్‌ ఇన్‌సైడ్‌. అయినా ఎంట్రన్స్‌లో ఈ ధర్నా ఏంటి? ఏం బాగలేదు. అరటిపండ్ల మార్కెట్‌లో తోపుడుబండ్ల వాళ్ల రోడ్‌ బ్లాక్‌లా ఉంది. అచ్చం ఈ అబ్బాయి లెటర్‌లా ఉంది. అంతేసి పొడగాటి లెటర్లు రాస్తే ఇక సమాధానం చెప్పడానికి చోటెక్కడుంది? నీలాంబరీ... నువ్వు డోర్‌కి అడ్డం నిలబడినట్టే ఈ జింగరీ ఉత్తరం జవాబుకు అడ్డం పడుతోంది. అయినా పెళ్లయిపోయింది కదరా బాబూ. ఎందుకు పెళ్లయ్యింది... ఎప్పుడు పెళ్లయ్యింది... ఎలా పెళ్లయ్యింది.. ఎవరితో పెళ్లయ్యింది... అత్తమామలు ఎవరు?... ఆ పెళ్లిపత్రిక సంపాదించి చదివితే తెలుస్తాయిగా. నాకు ఇంత పొడుగాటి ఉత్తరం రాయాలా? నిన్ను ప్రేమించిందని చెప్పి మోసం చేసి ఇంకొకరిని చేసుకుందని నీ బాధ. నీకంటే వాళ్ల అమ్మను ఎక్కువ ప్రేమించిందేమో? నాన్న లేడు కదా.

అమ్మ మాట కాదనలేక ఆమె చెప్పినట్లు చేసుకుందేమో? అమ్మాయిలన్నా. ఎన్నో సున్నితమైన విషయాలుంటాయి. ఎంతో అలజడితో కూడిన కష్టాలు ఉంటాయి. మనకేమి ఎలా అయినా బతికేస్తాం! అర్థం చేసుకోగలిగితే తన కష్టాన్ని అర్థం చేసుకో... దాన్ని మోసం అనుకోకు ప్లీజ్‌! ఇక వాట్‌ హ్యాపెన్డ్‌... వై హ్యాపెన్డ్‌... గట్రా... రీసెర్చ్‌ ఆపి... కొత్త జీవితాన్ని ‘సెర్చ్‌’ చేసుకో! ఆ అమ్మాయి దారి నుంచి అడ్డు తప్పుకో. వాట్‌ నీలాంబరీ... నువ్వు అడ్డు తప్పుకోవా? ప్లీజ్‌! ‘నన్నడగొద్దు ప్లీజ్‌ అని వాళ్లకు చెప్పారు. కానీ నన్నడగకుండానే సమాధానం చెప్పేస్తారా? ఐ యామ్‌ వెరీ వెరీ హర్ట్‌. మీకు అరటిపండు కట్‌...’ అని చకచకా వెళ్లిపోయింది నీలాంబరి. రేపటి నుంచి మేడమ్‌ను అడగాలి. లేకపోతే అరటిపండు అడుక్కోవాలి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌
ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement