రాళ్ల ముద్దలు

Life Story About Peninnah From Mombasa - Sakshi

గర్భంతో ఉన్నప్పుడు తల్లికి ఒక కడుపే. బిడ్డ పుట్టాక రెండు కడుపులు! పిల్లలకు ఆకలైతే తల్లి ఆగలేకపోయేది అందుకే. ఏదో ఒకటి చేసి పెడుతుంది. ఎక్కడో ఒకచోట తెచ్చయినా పెడుతుంది. తల్లికీ బిడ్డలకు తెగనిబంధం.. ఆకలి పేగు! లాక్‌డౌన్‌లో ఇప్పుడు..తల్లుల కడుపుల్లోని పిల్లల పేగులు మాడిపోతున్నాయి. రాళ్లు అన్నం ముద్దల్లా ఉడికితే ఎంత బావుణ్ణు!

చేసి పెట్టడానికి ఇంట్లో ఏమీ లేవు. తెచ్చి పెట్టడానికి బయట పనులేమీ లేవు. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు. పెనీనాకు ఎనిమిది మంది పిల్లలు. పెద్దపిల్లలు కూడా ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పూటల పస్తు కాదు మరి. రోజుల పస్తు. పెనీనాకు ఏం చేయాలో తోచడం లేదు. భర్త లేడు. సాయుధులైన బందిపోట్లు ఏడాది క్రితమే అతడిని చంపేశారు. కెన్యాలో బందిపోటు ముఠాలు ఉండే హిందూ మహాసముద్రపు తీరప్రాంతం మోంబసాలో ఉంటోంది వీళ్ల కుటుంబం. భార్యని, బిడ్డల్నీ, ఇంట్లో ఉన్న కొద్దిపాటి గోధుమల్నీ రక్షించుకునే ప్రయత్నంలో బందిపోట్లతో పోరాడి వారి ఆయుధాలకు బలైపోయాడు పెనీనా భర్త. ఆయన ఉన్నప్పుడు కొంత వేరుగా ఉండేది. ఏడాదిగా పెనీనా నాలుగిళ్లలో పనిచేస్తూనే ఇంట్లో పిల్లల్నీ కనిపెట్టుకుని ఉండవలసి వస్తోంది. అటొక అడుగు. ఇటొక అడుగు. కంట్లో పిల్లల్ని పెట్టుకుని పనికి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి కడుపులో ఆకలిని పెట్టుకుని పిల్లలు ఉంటారు. ఎంత రాత్రయినా వంట చేసి పెడుతుంది. పిల్లలు నిద్రపోతుంటే లేపి తినిపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా ఆమె.. పిల్లలు నిద్రపోవడం కోసమే వంట ‘చేస్తూ..’ ఉంటోంది. అది ఎంతకీ కాని వంట!

లాక్‌డౌన్‌తో పెనీనా తన ఉపాధిని కోల్పోయింది. బట్టలు ఉతుకుతుంటుంది తను. ‘భౌతిక దూరం’ పాటించక తప్పదు కాబట్టి ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటున్నారు. తనను కొంతకాలం వరకు రావద్దని చెప్పారు. పెనీనా ఇంటికే పరిమితం అవాల్సి వచ్చింది. చేతిలో డబ్బుల్లేవు. ఇంట్లో తిండిగింజల నిల్వలు లేవు. పిల్లలు ఆకలి అంటున్నప్పుడు నీళ్లతో చేయగలిగిన ద్రవాహారమేదో చేసి గ్లాసులలో నింపి ఇస్తోంది. నీళ్లతో ప్రయోగాలు అయిపోయి, రాళ్లతో ఆమె వంట చేస్తుండగా పొరుగున ఉండే ప్రిస్కా అనే ఆమె కంట్లో పడింది.

పెనీనా మిగతా పిల్లల్లో ఇద్దరు.

పెనీనాను చూసి ప్రిస్కాకు కళ్ల నీళ్లు వచ్చాయి. అవును. పెనీనా రాళ్లతో వంట చేస్తోంది! ఒక బిడ్డ ఆమె చంకలో ఉంది. మిగతా పిల్లలు అమ్మ చేస్తున్న వంట పూర్తవడం కోసం నిద్రను ఆపుకుని ఉన్నారు. ‘ఇదిగో అయిపోతోంది. తిందురు గానీ’ అని పెనీనా అంటుండటమే కానీ, ఎంతకీ అయిపోతేనా! ఎలా అయిపోతుంది? అమ్మేదో తినడానికి చేస్తోందని పిల్లల్ని నమ్మించడానికి పెనీనా పొయ్యి రాజేసింది. పొయ్యి పైన కుండను పెట్టింది. కుండలో నీళ్లు పోసింది. పిల్లలు అదంతా చూస్తూనే ఉన్నారు. వారు చూడనిది, వాళ్లకు తెలియనిది ఒక్కటే. ఆ కుండలో ఉడుకుతున్నది అన్నం కాదు, రాళ్లు అని!!

‘‘ఎందుకిలా చేశావ్‌’’ అంది ప్రిస్కా, పెనీనాను పక్కకు తీసుకెళ్లి గట్టిగా హత్తుకుని. ‘‘పిల్లలు నిద్రపోయేవరకు ఏదో ఒకటి చెయ్యాలిగా’’ అంది కన్నీళ్లను ఆపుకుంటూ. అప్పటికే ప్రిస్కా పెట్టిన బిస్కెట్‌లు అవీ తింటున్నారు పిల్లలు. ‘‘నువ్వూ తిను’’ అంది ప్రిస్కా. ‘‘వాళ్లు తింటున్నారు కదా. నా ఆకలీ తీరుతోంది’’ అంది పెనీనా సంతృప్తిగా. ప్రిస్కా చదువుకున్న అమ్మాయి. అత్యవసరంగా పెనీనా పేరు మీద ఒక బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచింది. మీడియాను అలెర్ట్‌ చేసింది. బిడ్డల ఆకలి తీర్చలేక వాళ్లను మాయచేసి నిద్రపుచ్చడానికి పెనీనా అనే ఒక తల్లి చేసిన రాళ్ల వంట గురించి తెలిసి ప్రపంచ నివ్వెరపోయింది. కెన్యాలో ఇప్పుడు ఎంతోమంది పెనీనాకు సహాయం చేసేందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు’’ అంటోంది పెనీనా తన పిల్లలందర్నీ కడుపులోకి లాక్కుంటూ. 

మోంబసాలోని మిషోమొరోని ప్రాంతంలో పెనీనా ఇల్లు. ఆమె పిల్లలు. పెనీనాకు సాయం చేయడానికి వచ్చిన కెన్యన్‌లు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top