సంగ్రామంలో సగం

Janhvi Kapoor first look as combat pilot Gunjan Saxena in her upcoming film - Sakshi

ఆడపిల్ల నిచ్చెన ఎక్కబోతేనే నివారించే సమాజం ఆమె ఆకాశంలో ఎగురుతానంటే సరే అంటుందా?ఆడపిల్ల తుపాకీ బొమ్మ పట్టుకుంటేనే వద్దనే సమాజం ఆమె యుద్ధ క్షేత్రంలో అడుగు పెడతానంటే సరే అంటుందా?ఆడపిల్ల గట్టిగా మాట్లాడితేనే నిరోధించే సమాజం ఆమె శత్రువు మీద తుపాకీ గురిపెడతానంటే సరేనంటుందా?చదువులో సగం అంటే అతి కష్టం మీద సరే అంది సమాజం.ఉద్యోగాల్లో సగం అంటే అతి కష్టం మీద సరే అంటోంది సమాజం.

కాని సంగ్రామంలో సగం అంటే మాత్రం కొంచెం కంగారు పడుతోంది.కాని గుంజన్‌ సక్సేనా వంటి పైలట్‌లు మాత్రం యుద్ధ క్షేత్రాల్లో లోహ విహంగాలు ఎగరేసి మేమూ చేయగలం అని నిరూపించారు.ఆమె స్ఫూర్తితో జాన్వీ కపూర్‌ నటిస్తున్న సినిమా ‘కార్గిల్‌ గర్ల్‌’ ఇప్పుడు సెట్స్‌ మీద ఉంది. నేడు జాన్వి పుట్టినరోజు.గుంజన్‌ సక్సేనా, జాన్వి.. లాంటి ఈ తరం ప్రతినిధుల స్ఫూర్తి కొనసాగుతూ ఉంటుంది.

యుద్ధంలో విమానాలు, హెలికాప్టర్లు ఎంత ముఖ్యమో వాటిని నడిపే పైలట్లు కూడా అంతే ముఖ్యం.పైలట్లు లేని విమానాలు ఒట్టి ఆటబొమ్మలు.ఈ ప్రపంచంలో మగవారిది పైచేయిగా ఉన్నట్టే త్రివిధ దళాలలో కూడా మగవారిదే పైచేయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌లో స్త్రీలు ‘ఫైటర్‌ పైలట్‌’లుగా ఉండటానికి నిన్న మొన్నటి వరకూ అనుమతి లేదు.అటువంటి దశలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మొదటిసారి ‘ఫిమేల్‌ ట్రైనీ పైలట్స్‌’ను భర్తీ చేయ తలపెట్టింది. ఢిల్లీలో చదువుకుంటున్న గుంజన్‌ సక్సేనా ఏ మాత్రం ఆలోచించకుండా ఆ అవకాశాన్ని దక్కించుకోవాలనుకుంది. ఎందుకంటే అప్పటికే ఆమె తల్లి, తండ్రి సైన్యంలో పని చేస్తున్నారు.

ఇంట్లో ఉన్న సైనిక వాతావరణం ఆమెను ఫైటర్‌ పైలట్‌ కమ్మని ప్రోత్సహించింది. అయితే ట్రైనింగ్‌ సమయంలో, ఆమె ‘ఫ్లయిట్‌ ఆఫీసర్‌‘ అయినప్పుడు కూడా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ఏదోలే ఉన్నారులే అనే ధోరణినే మహిళా ఫైటర్‌ పైలట్‌ల పట్ల వ్యక్తపరిచేవారు. ఎందుకంటే వొత్తిడి సమయంలో ఆకాశంలో లోహ మరను కంట్రోల్‌ చేయడం స్త్రీలకు సాధ్యమవుతుందా అని సందేహం. గుంజన్‌ సక్సేనాకు ఇది కొంచెం నిరుత్సాహం కలిగించేది. తనను తాను నిరూపించే అవకాశం రావాలని పట్టుదలగా ఉండేది. ఆమె ఎదురుచూపుకు తగినట్టే వచ్చిన అవకాశం 1999 కార్గిల్‌ యుద్ధం.

చీటా హెలికాప్టర్‌లో..
కార్గిల్‌ యుద్ధం మొదలైంది. ఎయిర్‌ ఫోర్స్‌ అందులో కీలకబాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆకాశ పహారాలో మగ ఫైటర్‌ పైలట్‌లు ఉన్నారు. కాని యుద్ధంలో క్షతగాత్రులను తరలించడానికి, ముఖ్యమైన సామాగ్రి తరలించడానికి పైలట్లు కావాల్సి వచ్చింది. అప్పుడు అవకాశం గుంజన్‌ సక్సేనాకు దక్కింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దగ్గర ఉన్న చీటా హెలికాప్టర్‌ను గుంజన్‌కు ఇచ్చి కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌కు వెళ్లి తిరిగి బేస్‌ క్యాంప్‌కు వచ్చే పని అప్పజెప్పారు. ఈ పని చేయడం అంటే శత్రువు లక్ష్యానికి దగ్గరగా వెళ్లి రావడమే. అయినప్పటికీ గుంజన్‌ భయపడలేదు. ధైర్యంగా అనేకసార్లు కార్గిల్‌ వార్‌లో అటూ ఇటూ చక్కర్లు కొట్టింది.

ఆమెకు తెలుసు.. ఏ క్షణాన్నైనా ఈ హెలికాప్టర్‌ను శత్రువు కూల్చవచ్చని. అందుకని తన దగ్గర ఒక అసాల్ట్‌ రైఫిల్, ఒక రివాల్వర్‌ పెట్టుకుని ఆకాశంలో ఎగిరేది. ఎందరో క్షతగాత్రులను ఆమె బేస్‌ క్యాంప్‌కు తెచ్చి ప్రాణాలు కాపాడింది. ఒకసారి కార్గిల్‌ స్ట్రిప్‌ మీద ఆమె హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతూ ఉండగా ఆమెను లక్ష్యం చేసి పేల్చిన రాకెట్‌ లాంచర్‌ కొంచెంలో తప్పి పక్కన ఉన్న కొండ చరియకు తాకింది. అయినప్పటికీ చెక్కు చెదరక గుంజన్‌ విధులు నిర్వర్తించింది. ఈ ధైర్యం, తెగువ వృధా పోలేదు. యుద్ధం ముగిసి మనం గెలిచాక ఆమెకు ‘కార్గిల్‌ గర్ల్‌’ అని పాపులర్‌ బిరుదు వచ్చింది. ప్రభుత్వం ‘శౌర్య చక్ర’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఆ కథ సినిమాగా రాబోతుంది.


జాన్వియే సరైన ఎంపిక...
గుంజన్‌ యుద్ధ క్షేత్రంలో తెగువ ప్రదర్శించి ఉండొచ్చు. కాని జాన్వి నిజజీవితంలో తెగువ ప్రదర్శించింది. ఆమె తల్లి నటి శ్రీదేవి మరణించి మొన్నటి ఫిబ్రవరికి ఒక సంవత్సరం. తల్లి ఎన్నో కలలు కనగా తాను నటించిన తొలి సినిమా ‘ధడక్‌’ రిలీజ్‌ను చూడకనే ఆమె మరణించడం జాన్వికి తీరని లోటు. ఇంకా పూర్తిగా జీవితంలో స్థిరపడక మునుపే తల్లి లేని పిల్ల కావడం చాలా పెద్ద దెబ్బ. అయినప్పటికీ నిబ్బరంగా ఆమె ‘ధడక్‌’ పూర్తి చేసింది.

రిలీజయ్యాక జాన్వి ఒట్టి అందాల బొమ్మ కాదని, తల్లికి మల్లే మంచి నటి అని జనం గ్రహించారు. మెచ్చుకున్నారు. అందుకే జాన్వికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘కార్గిల్‌ గర్ల్‌’లో గుంజన్‌ సక్సేనా పాత్రను పోషించే అవకాశం రావడం చాలా మంచి విషయం. ఈ సినిమా కాకుండా కరణ్‌ జోహర్‌ తీస్తున్న మల్టీస్టారర్‌ ‘తఖ్త్‌’లో జాన్వి ఒక పాత్ర పోషి స్తోంది. కరీనా కపూర్, అనిల్‌ కపూర్, ఆలియా భట్‌ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇది కాకుండా రాజ్‌కుమార్‌ రావ్‌కు ఒక సినిమాలో జోడీ కట్టనుంది.

పిత్రోత్సాహం
తండ్రి కూతురిని చూసి పొంగిపోతే ‘పుత్రికోత్సాహం’. కూతురు తండ్రిని చూసి పొంగిపోతే ‘పిత్రోత్సాహం’. జాన్వి ప్రస్తుతం పిత్రోత్సాహంలో ఉంది. ఎందుకంటే హిందీలో హిట్‌ అయిన ‘పింక్‌’ సినిమాను తమిళంలో రీమేక్‌ చేయాలనేది శ్రీదేవి కోరిక. అందుకే తాను దక్షిణాదిలో మొదటిసారి నిర్మాతగా ‘పింక్‌’ను ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేసి విడుదల చేయనున్నారు బోనీ కపూర్‌. హిందీలో అమితాబ్‌ చేసిన పాత్రను తమిళంలో అజిత్‌ చేయడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల అయ్యింది. దానిని చూసిన జాన్వి ‘నాన్న తొలి తమిళ సినిమా. కాన్ట్‌ వెయిట్‌’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించింది. 

కూడుతున్న కుటుంబం
జాన్వి తల్లి లేని లోటు నుంచి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోందనే చెప్పవచ్చు. చెల్లెలు ఖుషీ కపూర్‌తో, సవతి సోదరుడు అర్జున్‌ కపూర్‌తో, సవతి సోదరి అన్షులా కపూర్‌తో ప్రేమానుబంధాలు బలపడ్డాయి. ఇంకా అనిల్‌ కపూర్‌ సంతానం సోనమ్‌ కపూర్, రియా కపూర్‌ కూడా ఆమెకు బాసటగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా మగవారిదే పైచేయి. వారితో సమానంగా నిలిచే సంగ్రామంలో జాన్వి విజయవంతం అవుతుందని ఆశిద్దాం.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top