ఖాళీ చేసుకోవడం ముందు తెలిస్తే...

If you know before leaving - Sakshi

చెట్టు నీడ 

ఇద్దరూ టీ తాగడం కోసం ఆసీనులయ్యారు. వారి మధ్యలో టీ పాత్ర, కప్పులు ఉన్నాయి. నాన్‌ ఇన్‌ అతిథి కప్పులోకి టీ వంపసాగాడు.  కప్పు నిండిపోయింది.

పంతొమ్మిదవ శతాబ్దంలో జపాన్‌లో ఒక జెన్‌ గురువు ఉండేవాడు. ఆయన పేరు నాన్‌ ఇన్‌. జెన్‌ అంటే ధ్యానం ద్వారా సత్యాన్ని దర్శించే ఒక మార్గం. ఒకరోజు ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు జెన్‌ గురించి తెలుసుకోవడానికి నాన్‌ ఇన్‌ దగ్గరికి వచ్చాడు. ఆ ఆచార్యుడి దృక్పథమూ, ఆలోచనలూ నాన్‌ ఇన్‌కు తెలుసు. అయినా అతిథిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. ఇద్దరూ టీ తాగడం కోసం ఆసీనులయ్యారు. వారి మధ్యలో టీ పాత్ర, కప్పులు ఉన్నాయి. నాన్‌ ఇన్‌ అతిథి కప్పులోకి టీ వంపసాగాడు. కప్పు నిండిపోయింది. అయినా అలాగే పోస్తున్నాడు. టీ కప్పు అంచులు దాటి బయటికి రావడం మొదలైంది. అయినా అలాగే పోస్తున్నాడు. 

ఇక దీన్ని చూడలేక ఆ ఆచార్యుడు, ‘మాస్టర్, టీ కప్పు నిండిపోయింది. ఇంక అందులో మీరు ఏమీ నింపలేరు’ అన్నాడు. అప్పుడు నవ్వి, టీ పాత్రను పక్కకు పెడుతూ చెప్పాడు గురువు: ‘మీరు కూడా ఈ కప్పులాగానే మీవైన అభిప్రాయాలూ భావనలతో పూర్తిగా మీ మెదడును నింపుకునివున్నారు. మరింక నేను మీకు జెన్‌ గురించి ఏం చెప్పగలను? ఏం చెప్పినా అది మీ లోపలికి మాత్రం ఎలా వెళ్లగలుగుతుంది?’  ఆ ఆచార్యుడికి ఒక వెలుగు ఏదో గోచరించింది. తన మెదడు అనే కప్పును ఖాళీ చేసుకోకుండా జెన్‌ సాక్షాత్కరించదని అర్థమైంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top