పని వదిలి రానా?!

If its love it should not be visible - Sakshi

చెట్టు నీడ

పైకి కనిపించని ప్రేమను గ్రహించకుండా, ‘ప్రేమ ఉంటే అది కనిపించాలి కదా’  అనుకోవడం వంటిదే దైవసాక్షాత్కారాన్ని కోరుకోవడం కూడా.  

‘నీకు నా మీద ప్రేమ లేదు’ అని ఎప్పటిలా ఆమెను నిందించాడు అతడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘ఉంది అని నిరూపించుకునేంత సమయం నాకు లేదు’ అంది. ‘సమయం లేదా? ప్రేమ లేదా?’.. వ్యంగ్యంగా అన్నాడు.  ‘ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం కూడా నాకు లేదు’ అంది ఆమె. అతడికి కోపం వచ్చింది. ‘అవును. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నావు కదా, సమయం ఉండదులే’ అని మళ్లీ విరుపుగా అన్నాడు. మనసు నొప్పించాలని అతడు అలా అనలేదని, మనసు నొచ్చుకుని అలా అన్నాడని ఆమె అర్థం చేసుకుంది. ప్రేమగా దగ్గరకు వెళ్లబోయింది. దూరంగా జరిగాడు. ‘ముందు చెప్పు, నీకు నా మీద ప్రేమ ఉందా? లేదా’ అన్నాడు.  ‘ఆ సంగతి చెప్పాలంటే నేనిప్పుడు చేస్తున్న పనిని ఆపి రావాలి. ఆపి రానా మరి?’ అని అడిగింది. ‘ఏంటా పని, నా కన్నా ముఖ్యమైనది?’ అన్నాడు. ‘నీకన్నా ముఖ్యమైన పనే. నిన్ను ప్రేమిస్తూ ఉండటం. దాన్ని ఆపి రావడం అంటే.. నిన్ను ప్రేమించడం ఆపి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీ దగ్గరికి రావడం’ అంది. అతడు వింతగా చూశాడు. ‘నేను వేరు, నాపై నీ ప్రేమ వేరు ఎలా అవుతుంది? మాటలతో మాయ చేస్తున్నావు గానీ!’ అన్నాడు.

ఆమె ఎప్పటిలా నిశ్చలంగా నవ్వింది. ‘నువ్వు వేరు, నీపై నా ప్రేమ వేరు కానప్పుడు – నీకు నాపై ప్రేమ ఉందా – అని నువ్వెలా అడుగుతున్నావు?’ అంది నవ్వుతూ. అతడు ఆలోచనలో పడ్డాడు. ‘నీపై నాకు ప్రేమ ఉంది అని చెప్పే ఆ కొన్ని క్షణాల సమయాన్ని కూడా నేన్నిన్ను ప్రేమిస్తూ ఉన్న క్షణాల్లోంచి తీసివ్వలేను’ అంది అమె. అతడింకా ఆలోచిస్తూనే ఉన్నాడు.  నిరంతరం దైవధ్యానంలో ఉండే మనిషి కూడా దైవదర్శనాన్ని కోరుకోవడం సహజమే. ధ్యానమే దైవమని తెలుసు. అయినా దర్శనధ్యానాన్ని వదిలి పెట్టలేడు. కొండలెక్కి దిగుతాడు. నుదుటిని నేలకు ఆన్చుతాడు. మోకాళ్లపై కూర్చొని ఆకాశంలోకి చేతులు జోడిస్తాడు. ధ్యానం కన్నా దర్శనం ముఖ్యం అనుకుంటాడు కానీ, ధ్యానం కూడా దర్శనంలో ఒక భాగమే అనుకోడు. పైకి కనిపించని ప్రేమను గ్రహించకుండా, ‘ప్రేమ ఉంటే అది కనిపించాలి కదా’ అనుకోవడం వంటిదే దైవసాక్షాత్కారాన్ని కోరుకోవడం కూడా. దేవుడి దర్శనానికి దైవధ్యానాన్ని వదిలి వెళ్లాల్సిన పనేముంది?!
– మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top