
హెమింగ్వే అనుమానం.. నిజమే!
‘ఓల్డ్‌మ్యాన్ అండ్ ద సీ’ నవలతో ప్రపంచ ప్రఖ్యాతుడైన అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే, తన అవసాన కాలంలో శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవాడు...
‘ఓల్డ్‌మ్యాన్ అండ్ ద సీ’ నవలతో ప్రపంచ ప్రఖ్యాతుడైన అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే, తన అవసాన కాలంలో శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవాడు. క్యూబాకు వీరాభిమాని అయిన హెమింగ్వే తరచుగా అక్కడకు వెళ్లి వస్తుండేవాడు. క్యూబా అంటే పడని అమెరికా ప్రభుత్వానికి తాను తరచు క్యూబాకు రాకపోకలు సాగించడం గిట్టదని హెమింగ్వేకు తెలియని సంగతేమీ కాదు. విపరీతమైన తాగుడు అలవాటు కారణంగా వార్ధక్యంలో ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, అతడికి మతి కూడా భ్రమించింది. తనపై అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ గూఢచర్యం జరుపుతోందని అనుమానించేవాడు. తన ఫోన్ ట్యాప్ చేయడమే కాకుండా, తనకు వచ్చే ఉత్తరాలను కూడా ఎఫ్‌బీఐ ఏజెంట్లు రహస్యంగా చదువుతున్నారని బలంగా నమ్మేవాడు. ఈ అనుమానాన్నే తరచుగా వ్యక్తం చేస్తుండటంతో కుటుంబ సభ్యులు అతడికి మానసిక చికిత్స కూడా ఇప్పించారు. అనుమానం నివృత్తి కాకుండానే, హెమింగ్వే 1961లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అమెరికాలో సమాచార హక్కు నిబంధనలు అమలులోకి వచ్చాక బయటపడ్డ పత్రాల ఆధారంగా హెమింగ్వే అనుమానం నిజమేనని తేలడం విశేషం.
- కూర్పు: పన్యాల జగన్నాథదాసు