బాబుకు  ఛాతీలో నెమ్ము, ఏం చేయాలి? 

health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌
మా బాబు వయసు 14 నెలలు. ఛాతీలో నెమ్ము ఉందని డాక్టర్లు చెప్పారు. యాంటీబయాటిక్‌ ఇంజెక్షన్స్‌ చేశారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఇలా నెమ్ము ఎందుకు వస్తుంది?  దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి.  – ఎమ్‌. సుప్రియ, రాజమండ్రి 
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో  ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి.  డయేరియా తర్వాత పిల్లల్లో ప్రమాదకరంగా పరిణమించే వ్యాధుల్లో ఇది రెండోదని చెప్పవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో  కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్‌ ప్రాబ్లమ్స్‌) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్‌) వల్ల కూడా పదే పదే నిమోనియా కనిపించవచ్చు. ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 
∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే సమూహాలుగా జనం ఉన్న ప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. 
∙పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్‌) చాలా ప్రధానం. హెచ్‌ఐబీ, నిమోకోకల్‌ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్‌ వ్యాక్సిన్‌లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్‌తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకూ చికిత్స చేయడం (సపోర్టివ్‌ కేర్‌) అవసరం. 

పాపకు  మళ్లీ  చెవి నొప్పి... తగ్గేదెలా? 
మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్‌ గ్రంథి బ్లాక్‌ అయిందన్నారు. తగ్గిపోయాక ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మళ్లీ ఇలా వచ్చే అవకాశం ఉందా?  – శాంతిశ్రీ, మధిర 
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్‌ విత్‌ యూస్టేషియన్‌ కెటార్‌’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్‌ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్‌ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్‌ తరహాలో ఇన్ఫెక్షన్‌ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్‌ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు సైనుసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం (బ్లాక్‌ కావడం), నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్‌ స్లీప్‌) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్‌ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్‌ మెడికేషన్‌ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్‌ లేదా ఈఎన్‌టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. 

ఈ వయసులోనే పాపాయికి కాళ్లనొప్పులా... ఎందుకిలా? 
మా పాపకు ఏడేళ్లు. తరచూ కాళ్లనొప్పులంటూ ఏడుస్తోంది. ఇటీవల మరీ ఎక్కువగా ఉన్నట్లు గమనించాం. కొన్నిసార్లు నిద్రనుంచి లేవడం, కాసేపు కాళ్లు నొక్కాక అవి తగ్గడం, ఆ తర్వాత పడుకోవడం చేస్తోంది. మా డాక్టర్‌గారిని సంప్రదిస్తే ఆందోళన అక్కర్లేదని చెప్పారు. మా దగ్గరి బంధువుల్లో ఒక పెద్దావిడకు కూడా ఇలాగే కాళ్లనొప్పులు వస్తుంటే వారు డాక్టర్‌ను సంప్రదించారు. ఆమెకు రుమటాయిడ్‌ సమస్య అని చెప్పారు. మా పాపకు కూడా రుమటాయిడ్‌ సమస్య వచ్చి ఉంటుందంటారా? ఇవి దాని తాలూకు లక్షణాలా? మాకు తగిన సలహా ఇవ్వండి.  – నీరజ, నెల్లూరు 
పిల్లల్లో కండరాల నొప్పులు కనిపిస్తున్నాయనేది చాలా సాధారణంగా వినిపించే ఫిర్యాదు. దాదాపు 10 శాతం నుంచి 30 శాతం మంది పిల్లల్లో రకరకాల స్థాయుల్లో కండరాల నొప్పులు (మస్క్యులో స్కెలెటల్‌ పెయిన్స్‌) కనిపిస్తుంటాయి. అయితే వీటిల్లో ఎక్కువగా కనిపించేవన్నీ చాలావరకు హానికరం కాని బినైన్‌ తరహావే. పిల్లల్లో ఇలా నొప్పి అని చెప్పేవాటిల్లో చాలావరకు ప్రమాదవశాత్తు దెబ్బతగలడం (ట్రామా), ఎక్కువగా ఆడటం (ఓవర్‌ యూజ్‌), పెరుగుదల సమయంలో మన ఎముకల్లో (స్కెలెటల్‌ గ్రోత్‌) కనిపించే హెచ్చుతగ్గుల వంటి చాలా సాధారణ సమస్యల వల్లనే కనిపిస్తుంటాయి. 
ఇక పిల్లల్లో కనిపించే నొప్పుల్లో ఏది ఏది ప్రమాదకరం కానిది లేదా ప్రమాదకరమైనది అని నిర్ణయించేందుకు ఈ సూచనలను గమనించండి. 
ప్రమాదకరం కానివి
1.    ఏదైనా పనిచేయగానే పెరిగేవి, విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గేవి     
2.    సాయంత్రంపూట, రాత్రి పూట కనిపించేవి  
3.    కీళ్ల దగ్గర వాపు లేకపోవడం, ముట్టుకుంటే నొప్పి/మంట (టెండర్‌నెస్‌) లేకపోవడం. 
4.    పిల్లల్లో పెరుగుదల మామూలుగానే ఉండటం 
5.    ల్యాబ్‌ పరీక్షలు / ఎక్స్‌–రే పరీక్షలు నార్మల్‌గా ఉండటం. 
6.    జ్వరం వంటి లక్షణాలేమీ లేకుండా ఉండటం. 
ప్రమాదకరమైనవి  
1.     ఏదైనా పనిచేయగానే కాస్తంత ఉపశమనం అనిపించేవి, విశ్రాంతి తీసుకున్నా తగ్గనివి 
2.     ఉదయం వేళల్లోనూ, చాలా రాత్రి గడిచాక కనిపించేవి 
3.     కీళ్ల దగ్గర వాపు కనిపించేవి, ముట్టుకుంటే నొప్పి/మంట (టెండర్‌నెస్‌) ఉండటం. కీళ్లు బిగుసుకుపోయి, కదలికలు తక్కువగా ఉండటం. 
4.     పిల్లల్లో పెరుగుదల తక్కువగా ఉండటం. 
5.     ల్యాబ్‌ పరీక్షలు / ఎక్స్‌–రేలో   మార్పులు ఉండటం. 
6.  జ్వరం వంటి లక్షణాలు కనిపించడం. 
మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న తీవ్రమైన / ప్రమాదకరమైన లక్షణాలేమీ ఉన్నట్లు చెప్పలేదు. కాబట్టి అవి అంత తీవ్రమైనవి కావనీ, హానికరం కానివేనని భావించవచ్చు. పిల్లలు పెరిగే సమయంలో కనిపించే సాధారణమైన నొప్పులుగా (అంటే నాక్చర్నల్‌ పెయిన్స్‌ ఆఫ్‌ ఛైల్డ్‌హుడ్‌గా) వీటిని పరిగణించవచ్చు. పెరుగుతున్నప్పుడు 20 శాతం మంది పిల్లల్లో ఇలా నొప్పులు కనిపించడం చూస్తుంటాం. పెరిగే పిల్లల్లో కీళ్లనొప్పులు, తొడ, పిక్కల్లో ఇవి కనిపిస్తూ తరచూ వచ్చిపోతుంటాయి. మసాజ్‌ చేయగానే లేదా కొద్దిపాటి పెయిన్‌కిల్లర్స్‌తో ఇవి తగ్గిపోతుంటాయి. మర్నాడు ఉదయానికి ఈ నొప్పులు ఉండవు. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొందరిలో నొప్పి భరించే శక్తి (పెయిన్‌ థ్రెషోల్డ్‌) తక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో ఈ కండరాల నొప్పులతో పాటు పొట్టనొప్పి, తలనొప్పి వంటివి కూడా కనిపిస్తూ ఉండటం చూడవచ్చు. 
ఇక మీ పాప విషయానికి వస్తే మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆమెకు అవసరమైనప్పుడు కొద్దిపాటి నొప్పి నివారణ మందుతో పాటు ధైర్యం చెప్పడం, ఆరోగ్యకరంగా నిద్రపుచ్చడం వంటివి చేస్తూ ఉంటే

ఇవి క్రమేపీ తగ్గిపోతాయి. 
ఇక మీరు మీ బంధువుల్లో పెద్దలెవరికో రుమాటాయిడ్‌ సమస్యను ప్రస్తావిస్తూ ఒక ప్రశ్న అడిగారు. మీ సందేహానికి జవాబు ఏమిటంటే...  పిల్లల్లోనూ రుమటాయిడ్‌ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే జువెనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అంటారు. కానీ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ పాపకు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నట్లుగా ఏమాత్రమూ అనిపించడం లేదు. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. పైన పేర్కొన్న విషయాలను ఒకసారి మీ పీడియాట్రీషియన్‌ లేదా రుమటాలజిస్ట్‌తో చర్చించి, వారు పాపకు ఏవైనా పరీక్షలు సూచిస్తే వాటిని చేయించి, నిశ్చింతగా ఉండండి. 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top