ఇసాక్‌ బేబెల్‌

Great Writer Isaac Babel - Sakshi

గ్రేట్‌ రైటర్‌

సైనికులు, కార్మికులు, వేశ్యలు, నటులు, సంపన్నులు, ఇలా అన్ని రకాల మనుషులతో స్నేహం చేసేవాడు ఇసాక్‌ బేబెల్‌ (1894–1940). రష్యాలోని ఒడెస్సా పట్టణంలో జన్మించాడు. దేశవాళీ మపాసా పుట్టడానికి ఇది అనువైన చోటు అంటాడాయనే. దీని నేపథ్యంలో ఇక్కడి యూదు రౌడీలు పాత్రలుగా ‘ది ఒడెస్సా టేల్స్‌’ రాశాడు. ఒక యూదుడిగా యిడ్డిష్, హీబ్రూ బాగా తెలిసిన బేబెల్‌కు ఫ్రెంచి కూడా అంతే బాగా వచ్చు. తొలి కథల్ని ఫ్రెంచిలోనే రాశాడు. యౌవనంలో గోర్కీ సలహాతో యుద్ధవార్తల విలేఖరిగా పనిచేశాడు. యుద్ధం మనుషుల్ని ఎలా చితగ్గొడుతుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. యూదుల పట్ల చూపే వివక్షకు సొంత, పరాయి సైన్యానికి ఏం తేడా లేదని గ్రహించాడు.

ఆ అనుభవాలతోనే 1920లో ‘రెడ్‌ కావల్రీ’ కథలు రాశాడు. తొలిసారిగా యుద్ధపు చీకటిని రష్యన్‌ పాఠకుల సామూహిక అనుభవంలోకి తెచ్చాడు. వాక్యాల్లో కచ్చితత్వం, సరైన పదాల కోసం వెతుకులాట ఆయన నిబద్ధత. అయితే, గూఢాచారి అన్న ఆరోపణ మీద 1939లో అరెస్ట్‌ అయ్యాడు. ఆయన పేరును అన్ని రికార్డుల్లోంచి తొలగించి, ఎక్కడా వేదికల మీద ఉచ్చరించకుండా ‘నాన్‌పెర్సన్‌’(నిర్వ్యక్తి) చేశారు. 1940 జనవరిలో కాల్చి చంపడానికి స్టాలిన్‌ అనుమతించిన 346 మందిలో ఇసాక్‌ బేబెల్‌ ఒకరు.కాల్చి చంపిన 14 ఏళ్ల తరువాత, కృశ్చేవ్‌ ప్రభుత్వం ఆయన్ని అధికారికంగా నిరపరాధిగా గుర్తించింది. వ్యక్తిగా మరణించినా రచయితగా బేబెల్‌ పునరుజ్జీవం పొందాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top