గ్రేట్‌ రైటర్‌ (హెన్రిక్‌ ఇప్సెన్‌)

Great Writer Henrik Ibsen In Sakshi Sahityam

నార్వేలో జన్మించాడు హెన్రిక్‌ ఇప్సెన్‌ (1828–1906). మొదట్లో ‘బలవంతపు అబార్షన్‌’లాగా నాటకాలు రాశాడు. అందులో జాతి నిర్మాణం కోసం పాటుపడాలన్న ధోరణి కనబడేది. తర్వాత్తర్వాత నాటకానికి మనో విశ్లేషణను అద్ది, రంగస్థల ఫ్రాయిడ్‌ అనిపించుకున్నాడు. షేక్‌స్పియర్‌ తర్వాత షేక్‌స్పియర్‌ అంతటివాడు అనిపించుకున్నాడు. సామాజిక ప్రాధాన్యతలకు కూడా ఆయన నాటకాల్లో చోటున్నా దానికిమించిన మానవీయ అంశకు పెద్దపీట వేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో డైలమా, ఇంకెలాగో బతకాలనే ద్వంద్వం, స్వీయ సామర్థ్యాన్ని అంచనా వేసుకోలేని స్వభావం, రోజువారీ చీకటి, గుడ్డిగా అనుకరించే తత్వం, అన్నీ వుండీ నిరంతరం వెంటాడే శూన్యం, చచ్చిపోయాకగానీ బతకలేదన్న గ్రహింపునకు రావడం... ఇట్లాంటివన్నీ ఆయన నాటకాల్లో చూపించాడు. ఉల్లిగడ్డ పొరల్లాగా విప్పుతూపోతే మనకుగా ఏమీ మిగలనితనాన్ని గురించి కూడా రాశాడు. వెన్‌ వి డిడ్‌ అవేకెన్, పిల్లర్స్‌ ఆఫ్‌ సొసైటీ, ఘోస్ట్స్, ద వైల్డ్‌ డక్, ద లేడీ ఫ్రమ్‌ ద సీ, ద ప్రిటెండర్స్, బ్రాండ్, పీర్‌ జైంట్, ఎంపరర్‌ అండ్‌ గెలీలియన్, హెడ్డా గాబ్లర్‌ ఆయన కొన్ని నాటకాలు. పెళ్లంటే చట్టబద్ధ వ్యభిచారమనీ, వివాహం బేరసారాల మయమనీ బోలెడన్ని బోల్డు స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఇప్సెన్, స్త్రీవాదానికి ఊతమిచ్చాడు, ప్రత్యేకంగా స్త్రీవాది కాకపోయినా. దేనికైనా చట్టాలు, సంస్థాగత పరిష్కారాల కన్నా వ్యక్తి తనకు తానుగా మారాలన్నది ఆయన అభిమతం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top