గ్రేట్‌ రైటర్‌

Great Writer George Orwell - Sakshi

జార్జ్‌ ఆర్వెల్‌

బ్రిటిష్‌ ఇండియాలో ఎరిక్‌ ఆర్థర్‌ బ్లెయిర్‌గా జన్మించాడు ‘ఆర్వెల్‌’. పెద్దయ్యాక ఎప్పటికైనా రచయిత కావాలని ఉండేది. కానీ రాయడమంటే యాతన, తనను తాను నిర్వీర్యుణ్ని చేసుకునే ప్రక్రియ. అందుకే లోలోపలి రచయితను విదిల్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వల్లకాలేదు. తన రాతలతో తల్లిదండ్రులకు చీకాకుగా మారకూడదని కలంపేరు ‘జార్జ్‌ ఆర్వెల్‌’(1903–1950) అని పెట్టుకున్నాడు. ‘యానిమల్‌ ఫామ్‌’, ‘1984’ ఆయన సుప్రసిద్ధ రచనలు.ఆయుధాల చరిత్రే నాగరికత చరిత్ర అన్న ఆర్వెల్, ప్రపంచాన్ని నాశనం చేసే అణుబాంబును వ్యతిరేకించాడు. స్టాలిన్‌ను నిరసించాడు. ఆయన రచనలన్నీ రాజకీయ కోణంలో రాసినవే. కళకూ, రాజకీయాలకూ సంబంధం లేదనడం కూడా రాజకీయమే అంటాడు.

కానీ దాన్ని కళాత్మక స్థాయికి తీసుకెళ్లడం తెలియాలంటాడు. ‘కోల్డ్‌ వార్‌’, ‘బిగ్‌ బ్రదర్‌’ లాంటి ఆయన పుట్టించిన పదబంధాలు సాహిత్యంలోంచి రాజకీయ పరిభాషలోకీ ప్రవేశించగలిగాయి.ఆర్వెల్‌కు చక్కగా కాచిన టీ ఇష్టం. ఘాటైన పొగాకుతో తానే చుట్టుకునే సిగరెట్లు ఇష్టం. పెంపుడు జంతువులు ఇష్టం. ప్రకృతన్నా ప్రాణం. స్నేహితుల దగ్గర నోరు మెదపక పోవడం, కొత్తవారితో అరమరికలు లేకుండా మాట్లాడటం ఆయన స్వభావం. క్షయవ్యాధితో 47 ఏళ్లకే మరణించిన ఆర్వెల్‌ తన అవసరాలను చాలా పరిమితం చేసుకుని, ‘మన కాలపు సన్యాసి’ అనిపించుకున్నాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top