స్వార్థం లేనిదే స్నేహం

Friendship without selfishness - Sakshi

చెట్టు నీడ

ఇశ్రాయేలీయులను, యూదులను పరిపాలించిన సౌలు కుమారుడు యోనాతాను, సౌలు వద్ద ఉన్న దావీదుతో స్నేహం చేశాడు. ఒక రాజ కుమారుడు సాధారణమైన వ్యక్తితో స్నేహం చేయడం వెనుక అతని  హృదయ స్వచ్ఛత కనిపిస్తుంది. స్నేహం అంటే కలిసి తిరగడం, అల్లరి చేయడం అనే ఈ తరం వారికి తెలుసు, కానీ స్నేహం అంటే త్యాగం అనే విషయం ఇప్పటి తరానికి నేర్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వీరుడైన దావీదు తన రాజ్యాన్ని ఎక్కడ ఆక్రమిస్తాడో అని అనుకున్న సౌలు దావీదును చంపడానికి ఆలోచిస్తున్నాడు. అయితే తన కుమారుడైన యోనాతానుతో దావీదుకున్న స్నేహం గురించి అతనికి తెలియదు కనుక ఆ విషయాన్ని యోనాతానుతోనే చెప్పాడు. దావీదును చంపాలన్న ఆలోచన తన తండ్రి చేస్తున్నాడని తెలిసిన యోనాతాను, ఎలాగైనా తన స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు. ఆ విషయాన్ని దావీదుకు తెలియజేసి ‘‘నీవు రహస్యస్థలంలో దాగి ఉండు’’ అని అతనిని తన తండ్రి యొద్దనుండి రక్షించిన గొప్ప స్నేహితుడు యోనాతాను. దావీదును యోనాతాను రక్షించడం వెనుక ఎలాంటి స్వార్థం లేదు, కేవలం దావీదు తన స్నేహితుడు అంతే, దావీదును సౌలు చంపితే ఆ రాజ్యానికి రాజు యోనాతాను కావచ్చు. 

అయినా ఆ రాజ్యం కంటే కూడా తన స్నేహితుడే తనకు ముఖ్యమని దావీదును కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని గొప్ప స్నేహితుడు యోనాతాను, తన కుమారుడే తన శత్రువైన దావీదును రక్షిస్తున్నాడని తెలిసికొన్న సౌలు ‘నీవే దావీదును నా వద్దకు రప్పించమని’ యోనాతానుతో చెప్పినపుడు తన స్నేహితుని కోసం తండ్రినే ఎదిరించి దావీదు వద్దకు పోయి కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చి తన తండ్రి ఉద్దేశ్యం అంతా అతడికి వివరించి దావీదు ప్రాణాన్ని కాపాడి అతడిని అక్కడినుండి తప్పించాడు, ఆ విడిపోతున్న సందర్భంలో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చిన సందర్భంలో యోనాతాను దావీదుతో చేసుకున్న నిబంధన ఎంతో గొప్పది, ఇలాంటి స్నేహం మనం ఇప్పుడు చూడగలమా? ఇలాంటి స్నేహితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారా? అసలు స్నేహం అనే పదానికి అర్థం కూడా మార్చివేసిన ఒక భయంకరమైన సందర్భంలో మనం ఉన్నాం. రాజ్యాలను విడిచి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ స్నేహానికి వారిచ్చిన విలువ ఎంత గొప్పదో కదా! తరువాత రోజుల్లో యోనాతాను మరణించాక దావీదు తన పరిపాలన కాలంలో దివ్యాంగుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును  వెదికించి అతడికి రావలసినదంతా ఇప్పించి అతడు ఇక ఎప్పటికి తనతో కలిసి తన బల్లపైనే భోజనం చేయాలని కోరుకున్నాడు. ఇదంతా తన స్నేహితుడైన యోనాతానును బట్టే. యోనాతాను మరణించినా అతడి స్నేహాన్ని మరచిపోకుండా అతని కుమారుడికి మేలు చేసిన దావీదుది ఎంత గొప్ప హృదయమో కదా! ఇలాంటి స్నేహితులు మనకుంటే ఎంత బావుంటుంది! మనకు మంచి స్నేహితుడు దొరకాలంటే ముందు మనం మంచి స్నేహితులమై ఉండాలి. అప్పుడే మనకు యోనాతాను, దావీదులాంటి స్నేహితులు దొరుకుతారు.  
 – రవికాంత్‌ బెల్లంకొండ  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top