నీలమేఘశ్యాముని నాల్గు నగరాలు

నీలమేఘశ్యాముని  నాల్గు నగరాలు - Sakshi


శ్రీకృష్ణుని లీలలు ఎన్ని చెప్పిన తరగవు. కన్నయ్య నడయాడిన ప్రదేశాల గురించి ఎంత చెప్పినా తరగదు. గోపబాలుడుగా జన్మించిన మధుర... గానామృతాలు పంచిన బృందావనం... రాజసంగా కొలువుదీరిన ద్వారక...సర్వవ్యాప్తుడైన ఆయన సంచరించిన ప్రదేశాలెన్నో! కృష్ణాష్టమి సందర్భంగా ఆ మురారికి ప్రీతిపాత్రమైనపట్టణాల గురించి, ఆలయవైభవాలగురించి తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లితీరాల్సిందే! ద్వారక, మధుర ఉత్తరభారతదేశంలో ఉన్నాయి. గురువాయూర్, ఉడిపి దక్షిణభారతదేశంలో ఉన్నాయి.

 

 

ద్వారకాధీశుడు

శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో సముద్రమట్టానికి సమానంగా ఉంటుంది. ద్వార్ అంటే సంస్కృతంలో వాకిలి, ద్వారం వంటి అర్థాలు ఉన్నాయి. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్‌ధామ్‌లలో ద్వారకాపురి ఒకటి. జరాసంధుని బారి నుండి తప్పించుకునేందుకు కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ద్వారకాధీశుని మందిరం అతి పురాతమైంది.

 

శ్రీకృష్ణుని మునిమనమడు వజ్రనాభుడు క్రీస్తు పూర్వం 2వేల సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని నిర్మించినట్టు పురాణాలలో ప్రస్థావన ఉంది. ఆ తర్వాత క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 5 అంతస్తులతో, 72 స్తంభాలతో అలరారుతుంటుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, రుసుములు లేవు. ఎక్కువ మెట్లు లేవు. అందువల్ల వయోవృద్ధులు కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కనే గోమతి నది పరవళ్లు తొక్కుతుంటుంది. గోమతి నది సముద్రంలో కలసే చోటే ద్వారక ఉంది. ఈ ఆలయం నుంచే ఆ సంగమ ప్రదేశాన్ని చూడవచ్చు.

 

బేట్ ద్వారక: శ్రీకృష్ణుడు తన రాణులను కలిసిన చోటు గా ఈ ప్రాంతానికి పేరుంది. ఇది రేవు పట్టణం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లిన తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెబుతుంటారు. ద్వారక నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేదారిలో రుక్మిణీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, జాంబవతి, సత్యభామ ఆలయాలు కూడా ఉన్నాయి.

 

చూడలవసినవి: గాయత్రి మందిరం, గీతా మందిరం. 20 కి.మీ దూరంలో గల నాగనాథ్ (జ్యోతిర్లింగం), ద్వారక నుండి 250 కి.మీ. దూరంలో గల సోమనాథ దేవాలయం (జ్యోతిర్లింగం), అక్కడి నుంచి 10 కి.మీ దూరంలో శ్రీకృష్ణుని నిర్యాణ స్థలం.

 రైలు మార్గం: హైదరాబాద్ నుంచి రామేశ్వరం-ఓఖా ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ప్రయాణ సమయం 36 గంటలు. ద్వారకలో భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయి.

 

ఉడిపి చిన్నికన్నయ్య

కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు 58 కి.మీ దూరంలో ఉంది ఉడిపి. ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయంగా దీనికి పేరుంది. స్వామి దర్శనం నవరంధ్రా లున్న కిటికీగుండా చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని కృష్ణుని విగ్రహం చిన్ని బాలుడి రూపంలో ఉంటుంది. 12వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ జరిపి, ఎనిమిదిమంది బ్రహ్మచారి శిష్యులతో పూజలు జరిపించారట. ఇక్కడి తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఇందులోనే శ్రీ మధ్వాచార్యుల దివ్యప్రతిమ ఉంది. ఉత్సవాలు, పండగలపుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి త్రిశూర్ 150 కి.మీ. ఉంటుంది.  ఉడిపిలో కృష్ణమందిరం దర్శంచుకొని త్రిశూర్‌కు రైలులో చేరుకోవచ్చు. అక్కడ నుంచి గురువాయూర్ చేరుకోవాలి.

 

రోడ్డు మార్గం: ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మంగళూరుకు నేరుగా వెళ్లి, అక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. ఉడిపిలో అన్ని వసతులు ఉన్నాయి. దక్షణాది నవభోజనాలు ఆలయానికి దగ్గరలోనే లభిస్తాయి.

 

గురువాయూర్ బాలగోపాలుడు

కేరళ రాష్ట్రంలో త్రిశూర్ పట్టణానికి 30 కి.మీ. దూరంలో గురువాయూర్ ఉంది. కేరళ సంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పాతాళ జలశిలతో కృష్ణుని విగ్రహం మలచినట్టుగా, శంకరాచార్యులవారు దీన్ని ప్రతిష్ఠాపన చేసినట్టుగా చెబుతారు. నాలుగు చేతులలో పాంచజన్యం, శంఖం, చక్రం, కౌమోదకం పద్మాలను ధరించి ముగ్ధమనోహర రూపంలో అలరించే బాలగోపాలుడు గురువాయూర్. అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు దర్శనార్ధం చేరుకుంటుంటారు. అయ్యప్పకు వెళ్లే భక్తజనావళి గురువాయూర్‌ను దర్శించుకొని వెళతారు.

 

ఇక్కడ స్వామిని ఉన్నికృష్ణన్, కన్నన్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు తన అవతార పరిసమాప్తి కాలంలో సహచరుడైన ఉద్దీపునికి కృష్ణవిగ్రహం ఇచ్చాడట. లోక కళ్యాణార్థం జలప్రళయ అనంతరం విగ్రహాన్ని వాయువు కాపాడి దేవగురువు బృహస్పతికి ఇచ్చాడట. గురువు వాయువుతో కలిసి ఈ విగ్రహం ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్ అని పేరొచ్చిందని పెద్దలు చెబుతుంటారు.

 రైలుమార్గం: హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో త్రిశూర్ చేరుకొని, అక్కడ నుంచి బస్సుమార్గం ద్వారా గురువాయూర్ చేరుకోవచ్చు.

 

మధుర హృదయవల్లభుడు

మానవ హృదయంతో మధురను పోల్చుతారు. ప్రేమకు, భక్తి భావనకు, ఆనందాతిశయాలకు నెలవుగా ఈ ప్రాంతాన్ని కొనియాడుతారు. ఆగ్రా నుండి ఢిల్లీ వెళ్లే తోవలో 50 కి.మీ. దూరంలో ఉంది మధుర. యమునానదికి ఆనుకొని ఉంటుంది. ఢిల్లీ సందర్శనకు వెళ్లినప్పుడు మధుర చూసి రావచ్చు. కృష్ణుని జన్మస్థానమైన ఈ నగరం అతి ప్రాచీనమైనది. ఇక్కడ కృష్ణుని ఆలయాన్ని నాలుగు పర్యాయాలు నిర్మించినట్టు కథనాలు ఉన్నాయి. 1965లో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయభాగమే శ్రీకృష్ణుని జన్మస్థానం.

 

చూడలవసినవి: కృష్ణమందిరం, దేవకీ వసుదేవుల జైలు, కంసరాఖిల్లా, బలిదేవ్, కంసవిఖండన మందిరాలు ఉన్నాయి.  ఇంకా గోకులం, మహావనం, బృందావనం చూడదగినవి. ఇక్కడ కృష్ణాష్టమి, దీపావళి, ఆషాఢపౌర్ణమి, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాలలో ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి.

 

మధురలో అన్ని ప్రాంతాలను దర్శించాలనుకునేవారు గైడ్ సాయం తీసుకోవడం మంచిది.

- ఎస్.వి. సత్యభగవానులు, విశ్రాంత డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top