కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయవచ్చా?

family health counciling - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 32 ఏళ్లు. నాకు గతంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయి. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలంగా నడుంనొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. వారు స్కాన్‌ తీయించి, మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా చేసేలా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వండి. 
– సిరాజుద్దిన్, నల్లగొండ 

కిడ్నీలో రాళ్లు ఏర్పడటమనే సమస్య ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. కొందరిలో వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ 50% మందిలో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కాన్‌స్టిట్యూషనల్‌ హోమియో చికిత్స ద్వారా వీటిని మళ్లీ ఏర్పడకుండా చేసే అవకాశం ఉంటుంది.  మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి, శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటికరూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరతాయో, అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రవ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం... ఇలా ఎక్కడైనా రాళ్లు ఏర్పడవచ్చు. 

కిడ్నీరాళ్లలో రకాలు : క్యాల్షియమ్‌ స్టోన్స్, ఆక్సలేట్‌ స్టోన్స్, సిస్టిక్‌ స్టోన్స్, స్ట్రూవైట్‌ స్టోన్స్, యూరిక్‌ యాసిడ్‌ స్టోన్స్‌ ఇలా కిడ్నీస్టోన్స్‌లో అనేక రకాలు ఉంటాయి. 
కారణాలు: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొందరిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, మూత్రమార్గంలో అడ్డంకులు ఏర్పడటం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలో విటమిన్‌–ఏ పాళ్లు తగ్గడం వంటి ఎన్నో అంశాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవేకాకుండా కిడ్నీలో రాళ్లను ప్రేరేపించే అంశాలు... ఆహారంలో మాంసకృత్తులు, ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం; సాధారణం కంటే తక్కువగా (అంటే రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువగా)  నీళ్లు తాగడం వంటి వాటితో కిడ్నీలో రాళ్లు రావచ్చు. ఇక కొన్ని ఇతర జబ్బుల వల్ల... ముఖ్యంగా హైపర్‌ కాల్సీమియా, రీనల్‌ ట్యూబులార్‌ అసిడోసిస్, జన్యుపరమైన కారణాలతో, ఆస్పిరిన్, యాంటాసిడ్స్, విటమిన్‌–సి ఉండే కొన్ని మందులు, క్యాల్షియమ్‌ సప్లిమెంట్లతోనూ కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. 

లక్షణాలు: విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటి ప్రధాన లక్షణాలు. కొందరిలో ఒకవైపు నడుమునొప్పి రావడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల నడుము, ఉదరమధ్య భాగాల్లో నొప్పి, ఇక్కడి నుంచి నొప్పి పొత్తికడుపు, గజ్జలకు, కొన్నిసార్లు కాళ్లలోకి పాకడం జరుగుతుంది. మరికొందరిలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. వీటిని సైలెంట్‌ స్టోన్స్‌ అంటారు. 
చికిత్స: హోమియోలో కిడ్నీలో రాళ్లను తగ్గించేందుకూ, మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం పడకుండా, రాళ్లను నియంత్రించేందుకూ అవకాశం ఉంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌ 

వేసవి విహారయాత్ర తర్వాత  కామెర్లు... చికిత్స ఉందా?
నా వయసు 36 ఏళ్లు. ఈ వేసవిలో విహారయాత్రకు వెళ్లొచ్చిన తర్వాత ఆకలి తగ్గింది. మలబద్దకంగా అనిపించడంతో పాటు మూత్రం పచ్చగా వస్తోంది. కొందరు కామెర్లు వచ్చాయని అంటున్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?  – కె. సెల్వరాజ్, హైదరాబాద్‌ 
కామెర్లు అనేది కాలేయ సంబంధిత వ్యాధి. ఇటీవలి కాలంలో తరచూ తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటిగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కంటే ముందుగా ఇతరులే దీన్ని గుర్తిస్తారు. రక్తంలో బిలురుబిన్‌ పాళ్లు పెరిగినప్పుడు (హైపర్‌ బిలురుబినీమియా) చర్మం, కనుగుడ్లు, మ్యూకస్‌ మెంబ్రేన్స్‌లో పసుపుపచ్చ రంగు తేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. శరీరానికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎర్రరక్తకణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హిమోగ్లోబిన్‌ అనే ప్రోటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హీమోగ్లోబిన్‌లోని హీమ్‌ అనే పదార్థం ప్లీహం (స్లీ్పన్‌)లో శిథిలమైపోయి బైలురుబిన్, బైలివర్డిన్‌ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతాయి. శరీరంలో పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా చెప్పవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి, పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్‌ డక్ట్‌) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. 

కామెర్లకు కారణాలు: ∙హెపటైటిస్‌ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్‌ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది ∙ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం ∙పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు ∙కాలేయం పాడైపోవడం ∙కాలేయం నుంచి పేగుల్లోకి వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడటం వంటివి జరిగితే కామెర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. 
లక్షణాలు:వికారం, వాంతులు ∙పొత్తికడుపులో నొప్పి ∙జ్వరం, నీరసం, తలనొప్పి  కడుపు ఉబ్బరంగా ఉండటం  కామెర్లు సోకినప్పుడు కళ్లు పచ్చబడటం. 
వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఎల్‌ఎఫ్‌టీ, సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ 
చికిత్స: కామెర్లను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను, శారీరక, మానసిక స్థితని పరిగణనలోకి తీసుకొని డాక్టర్లు మందులు సూచిస్తారు. ప్రారంభదశలోనే వాడితే కామెర్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు హోమియోలో చెలిడోనియం, సెలీనియం, లైకోపోడియం, మెర్క్‌సాల్, నాట్‌సల్ఫ్‌ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన మంట... ఎందుకు? 

నా వయసు 35 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. మహిళను కావడంతో ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? 
– సోదరి, కరీంనగర్‌ 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిలో రెండు రకాలు... అప్పర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్‌ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్‌ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్‌ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్‌ అంటారు. 

కారణాలు: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. అందుకే హెచ్‌ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. 
లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు: యూరిన్‌ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌.
హోమియోపతి చికిత్స: రోగిలో మళ్లీ మళ్లీ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రాకుండా చేయడానికి హోమియో మందులు తోడ్పడతాయి. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top