సబ్బు నీటితో చెలగాటం వద్దు

Dont use Detergent Water in Corn Crop - Sakshi

మొక్కజొన్న రైతులను అల్లాడిస్తున్న కత్తెర పురుగును చంపడానికి సబ్బు, డిటర్జెంట్‌ నీళ్లను సుడిలో పిచికారీ చేస్తే చాలు పురుగు ఖతం అని తెలియజెప్పే వీడియోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బట్టలుతికే సబ్బు పొడి కలిపిన నీటిని పోసీపొయ్యగానే కత్తెర పురుగు విలవిల్లాడుతూ నిమిషాలలో చనిపోతుండడంలోనూ ఎటువంటి సందేహం లేదు కూడా. కానీ, సబ్బుపొడి ద్రావణం పిచికారీ వలన కత్తెర పురుగుతో పాటు మొక్కజొన్న పంట కూడా మాడిపోతున్న వాస్తవం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

బట్టలు ఉతకడానికి తయారు చేసిన సబ్బులు, సబ్బుపొడులను పంటలపై ప్రయోగించడం తగదని మెదక్‌ జిల్లాలోని డా. రామానాయుడు–ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్‌ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యామ సుందర్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బట్టలు ఉతకడానికి వాడే సబ్బులు, సబ్బు పొడుల తయారీలో వాడే రసాయనాలు మొక్కలపై తీవ్ర ప్రభావాలను చూపగలవన్నారు. సబ్బులు, సబ్బు పొడులను కీటకనాశనులుగా వాడటం దాదాపు 200 ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ, మొక్కలపై వాడే సబ్బు పొడుల తయారీలోనూ, ఎంపికలోనూ, వాడవలసిన మోతాదులోనూ ప్రత్యేకమైనవని గుర్తించాలి.

కత్తెర పురుగు నివారణకు సబ్బు పొడి నీటిని వాడిన కొందరు రైతుల క్షేత్రాలలో మొక్కజొన్న మొక్కలు దెబ్బతినడం గమనించిన డా. శ్యామ సుందర్‌ రెడ్డి, కెవికె క్షేత్రంలోని మొక్కజొన్నపై లీటరు నీటికి 5 గ్రాముల సబ్బుపొడి నుంచి 50 గ్రాముల వరకు వివిధ మోతాదులలో ప్రయోగించి పరిశీలించారు. మోతాదు పెరుగుతున్నకొద్దీ.. మొక్కపై దుష్ప్రభావం కోలుకోలేనంత ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. సబ్బు ద్రావణం పిచికారీ చేసిన కొద్ది నిమిషాల తర్వాత సగం మొక్కలపై మంచి నీటిని పిచికారీ చేశారు. ఆ మొక్కల పరిస్థితి కొంచెం నయమనిపించినప్పటికీ, మిగతా మొక్కల పరిస్థితి ప్రమాదరకరంగానే ఉందని చెప్పారు. కాబట్టి, కత్తెర పురగు నివారణకు సబ్బు పొడి ద్రావణం వాడకపోవడం మంచిదనే అభిప్రాయం వెలిబుచ్చారు.

మొక్కజొన్న సుడులను మట్టి, ఇసుక, రాతిపొడి, వరిపొట్టు వంటి మొక్కలకు హాని కలగని పదార్థాలతో నింపి, వాటిని మెటారైజియం లేదా ఇ.పి.ఎన్‌. లేదా బి.టి. బాక్టీరియా ద్రావణాలతో తడిపితే కత్తెర పురుగును సమర్థవంతంగా రసాయన రహితంగా నిర్మూలించవచ్చని గత ఏడాది తాము ప్రయోగ పూర్వకంగా నిరూపించిన విషయాన్ని డా. శ్యామ సుందర్‌ రెడ్డి(99082 24649) ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top