డయాబెటిస్‌ కౌన్సెలింగ్‌

Diabetes Counseling - Sakshi

ఈ వయసులో సర్జరీని తట్టుకోగలరా?
మా నాన్నగారి వయసు 58 ఏళ్లు. ఏడాదిన్నర కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్‌ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ మాత్రం నడిచినా విపరీతంగా ఆయాసపడుతున్నారు. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళితే, బైపాస్‌ చేయాలంటున్నారు.  ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? పైగా బైపాస్‌లో ఛాతీ ఎముకలను కోస్తారని తెలిశాక ఆయన, ఆయనతో పాటు మేమందరమూ ఆందోళన పడుతున్నాం. దయచేసి సలహా ఇవ్వండి.
– సీహెచ్‌. చంద్రశేఖర్, నిజామాబాద్‌
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్‌) ఏర్పడితేనే బైపాస్‌ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు మాత్రమే ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్‌ వేస్తారు. ఇప్పుడు మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా క్లాట్స్‌ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్‌ బైపాస్‌ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, ఆత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలుగుతున్నారు.

అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్‌ బైపాస్‌ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్‌ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్‌ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్‌ 3 – 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అలాగే 50 పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్‌ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు.
 

కార్డియోమయోపతి అంటే ఏమిటి...?
నా వయసు 39 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస సరిగా అందడం లేదు. ఎప్పుడూ విపరీతమైన అలసట. దాంతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మా ఫ్యామిలీ డాక్టర్‌కు చూపించుకుంటే కార్డియాలజిస్ట్‌ వద్దకు పంపారు. ఆయన ‘కార్డియోమయోపతి’ కావచ్చని అంటూ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వ్యాధి ఏమిటి? చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – పి. శ్రీరాములు, చిత్తూరు
కార్డియోమయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీలో కనిపిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్‌ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్‌ కార్డియోమయోపతి, హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్‌ కార్డియోమయోపతి.

వైరస్‌లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యుటేషన్‌ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్‌ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్‌ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్‌ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధిచెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి.

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్‌ కార్డియోమయోపతిలో కనిపించే ప్రథమ లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్‌), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్‌ అమర్చుతారు.

ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్‌ట్రోఫిక్‌ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్‌ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్‌ట్రోఫిక్‌ రకానికి చెందినవి 4 శాతం ఉంటాయి. రెస్ట్రిక్టెడ్‌ కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి.  

హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్‌ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్‌మేకర్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్‌ కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌) పరికరాన్ని అమర్చుతారు.

- డాక్టర్‌ సత్య శ్రీధర్‌ కాలే, సీనియర్‌ కార్డియో–థొరాసిక్‌ సర్జన్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ,  హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top