భగవాన్‌ రమణమహర్షి | Devotional Stories Of Ramana Maharishi | Sakshi
Sakshi News home page

భగవాన్‌ రమణమహర్షి

Dec 29 2019 1:49 AM | Updated on Dec 29 2019 1:49 AM

Devotional Stories Of Ramana Maharishi - Sakshi

‘‘నువ్వేమిటో తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. ముందు నీ మనస్సుని చదువు. తర్వాత జగత్తును చూడు. అప్పుడు ప్రపంచమే ఆత్మ అవుతుంది. నీకు అవగతమవుతుంది’’అంటారు భగవాన్‌ రమణ మహర్షి. భగవదన్వేషణలో ఎన్నెన్నో ప్రశ్నలతో రమణాశ్రమం చేరినవారికి ఆశ్చర్యకరంగా భగవానుల శక్తిమంతమైన మౌనంలోనే సంశయ నివారణ అయ్యేది. ఆయన మౌనమే వారికి మహాజ్ఞానబోధ. రమణుల సమస్త ఉపదేశసారం ఏమంటే ‘‘నిన్ను నీవు తెలుసుకో’’.

నీకేది కావాలో ఆయనకు తెలుసు
శివదర్శనం కోసం తహతహలాడుతున్న భక్తురాలిని చూచి భక్తిని గురించి వివరించారు రమణులు. ‘‘భగవంతుడిని శరణు వేడు. ఆయన ఇష్టానికి తలవంచు. నీ ఇష్టమొచ్చినట్లు ఆయన నడుచుకోవాలనుకోవడం శరణాగతి కాదు. నీకు ఎప్పుడు, ఏది, ఎలా చెయ్యాలో ఆయనకే బాగా తెలుసు. ఈ విషయంలో నీకిక బాధ్యతలే ఉండవు. అన్ని బాధ్యతలూ ఆయనవే. ఇదే అసలైన శరణాగతి. ఆ పరమాత్మ పేరే ‘నేను’. అన్నిటా వ్యాపించిన ఆ భావనతో కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన భక్తుని లక్షణం‘.

పరిమితులను దాటడమే పరిత్యాగం
తన ఉద్యోగానికి రాజీనామా చేసి, నిరంతరం మహర్షి సాన్నిధ్యంలో ఉండాలనే తలంపుతో ఉన్న భక్తుడికి భగవాన్‌ ఒకనాడు కర్తవ్యాన్ని ఉపదేశించారు. ‘భగవాన్‌ ఎప్పుడూ మీతోనే, మీలోనే వున్నారు. ఈ విషయం బోధపడటానికి నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. నీ బాధ్యతలనుండి తప్పుకోనక్కరలేదు. సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. కోరికలను, మోహాలను విడిచిపెట్టు. అప్పుడు సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతావు’’ వ్యక్తులనేగాదు... పశుపక్ష్యాదులను సైతం  గౌరవంగా సంబోధిస్తూ వాటిపై తమ అనుగ్రహాన్ని ప్రసరింపజేసిన రమణులు అనవసరపు ఆడంబరాలను నిరాకరించి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తన నడవడికతో చూపించారు. అందుకే వారి ఆధ్యాత్మిక శక్తివిలాసం ఈనాటికీ ఉజ్జ్వలంగా భాసిస్తోంది.
– అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని  
వేదపండితులు

Advertisement
 
Advertisement
Advertisement