ఆ పావురంపాటి చేయనా..!

Devotional information by Chaganti Koteswara Rao - Sakshi

భాగవతంలో రంతిదేవోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. రంతిదేవుడు చక్రవర్తి. మహాదానశీలి. ఎవరు ఎదురుగుండా వచ్చినా విష్ణుస్వరూపాన్నే చూస్తాడు. అందరికీ అన్నీ దానం చేసేశాడు. 48రోజులపాటు అన్నం నీళ్లులేవు. తన కుటుంబంతో అలా ఉండిపోయాడు. ఎవరో మధురమైన అన్నాన్ని, మంచినీళ్ళను తెచ్చిచ్చారు. అవి తీసుకోబోతుండగా...
ఓ బ్రాహ్మణుడొచ్చి...‘అయ్యా! ఆకలితో ఉన్నా’.. అంటే అన్నం పెట్టాడు. మరొకడు వచ్చాడు.. నాలుగో వర్ణం.. ఆదరణతో మిగిలిన అన్నమంతా పెట్టేసాడు. రాగద్వేషాలేమీ ఉండవు.

ఎవరొచ్చినా ఆయనకు విష్ణువే వచ్చినట్లుంటుంది. ఇక మంచినీళ్ళొక్కటే మిగిలాయి. నోట్లో పోసుకోబోతుండగా... కుక్కల గుంపుతో ఒక ఛండాలుడొచ్చాడు. ‘అయ్యా! ప్రాణాలు నిలబడడం లేదు. కాసిని మంచినీళ్ళివ్వండి’ అని అడిగాడు. ‘‘ఈ నీళ్ళయినా నన్ను తాగనివ్వవా?’’ అని ఆయన అనలేదు. పైగా ‘అన్నా! ఆకలితో ఉన్నట్టున్నావు. నా దగ్గర అన్నం లేదు. కానీ తియ్యటి నీళ్ళున్నాయి. ఆపద వచ్చినప్పుడు తనదగ్గర ఉన్నదానితో ఆకలి తీర్చడం ఎంత గొప్పదన్నా.

ఈ నీళ్ళు తాగు’ అని తన దగ్గరున్న ఆ కొద్దినీళ్ళు ఇచ్చేసాడు.  త్రిమూర్తులు ప్రత్యక్షమై ‘‘నిన్ను పరీక్షించడానికే ఇదంతా’’ అని ఏదయినా కోరుకొమ్మన్నారు. పెట్టడం తప్ప మరేదీ తెలియని ఆయన నాకిది కావాలని ఏదీ అడగలేదు. కానీ వారు దీవెనలతో ఎంత బలం ఇచ్చారంటే... కేవలం ఆయన పక్కన కూర్చుంటే చాలు, ఎవరికయినా యోగం వచ్చేస్తుంది. అతిథి పూజ చేసి ఆ స్థితికి వెళ్ళిపోయాడు రంతిదేవుడు. తరువాత బ్రహ్మంలో ఐక్యమై పోయాడు.  

ఇక శ్రీరామాయణం... యుద్ధకాండలో విభీషణుడొచ్చి శరణువేడితే అందరూ వద్దంటున్నా..రాముడు శరణు ఇస్తూ దానికి ముందు ఇలా అన్నాడు...‘‘వాడు శత్రువే కానీ, మిత్రుడే కానీ –రామా ! నేను నీ వాడను– అని నన్ను శరణువేడితే రక్షిస్తా.  పురుషులే కానక్కరలేదు, ఎవరయినా....అది నా ప్రతిజ్ఞ. అంటూ...ఇంకా ఇలా చెప్పాడు..’’

‘‘ఓ చెట్టుమీద ఓపావురాల జంట పిల్లలతో ఉండడాన్ని చూసిన వేటగాడు ముందు పిల్లల్ని నేలకూల్చాడు.  పిల్లలకోసం అలమటిస్తూ ఆడపావురం తిరుగుతూంటే దాన్ని కొట్టి పడేసాడు. మగపావురం కళ్లముందే ఆడపావురం రెక్కలు తెంపేసి, ఈకలు తీసి, దాని మాంసాన్ని కాల్చుకు తిన్నాడు. మగపావురం కన్నీరు పెట్టడం తప్ప ఏం చేయలేకపోయింది. కొన్నాళ్ళయిన తరువాత అదే వేటగాడు ఒకరోజు జోరుగా వాన కురుస్తుంటే అరణ్యంలో ఒక్క మృగం కూడా దొరక్క ఆకలితో నకనకలాడుతూ తిరిగి తిరిగి వచ్చి అదే చెట్టుకింద నిస్సత్తువతో చేరగిలబడ్డాడు.

అయ్యయ్యో, నా గూడున్న చెట్టుకింద ఆకలితో వచ్చి కూర్చున్నవాడు  నాకు అతిథి అవుతాడు. అని ఎండుపుల్లలు తెచ్చి అక్కడ నెగట్లో వేసి చలికి వణుకుతున్న అతనికి సేదదీర్చింది. ఇతని ఆకలి తీర్చగలిగే తిండి నేను తీసుకురాలేను. అందువల్ల నేనే అతనికి ఆహారమవుతానని ఆ అగ్నిహోత్రంలోకి దూకేసింది. తన భార్యను, తన బిడ్డల్ని చంపినవాడు కూడా అతిథిగా వచ్చేటప్పటికి ఒక పక్షి తాను పడిపోయి ఆహారమయి ఈ ఉపకారం చేసింది. మనుష్యుడిగా ఉండి, గృహస్థుడిగా ఉండి నా దగ్గరకొచ్చి నిలబడి రక్షించమని అడిగితే...పావురం పాటి సాయం చేయనక్కరలేదా ...??? కాబట్టి నేను రక్షిస్తా. విభీషణుడిని స్వీకరిస్తున్నా’’ అని పలికిన రామచంద్ర ప్రభువు అతిథిపూజ అంటే ఏమిటో నేర్పాడు.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top