కొర్నేలీ, పేతురుల అసాధ్య సంగమం...

Cornelius, the impossibility  - Sakshi

సువార్త

కైసరయ పట్టణంలో రోమాప్రభుత్వ శతాధిపతిగా ఉన్న కొర్నేలీ నిజానికి అన్యుడు, ఇటలీ దేశస్థుడు. అప్పుడప్పుడే యేసుప్రభువును తెలుసుకొంటున్నాడు. దేవుడతనితో ఒకరోజు తన దూత ద్వారా మాట్లాడి, యొప్పే పట్టణంలో ఉన్న పేతురును పిలిపించుకొని అతని ద్వారా దైవమార్గాన్ని సంపూర్ణంగా తెలుసుకొమ్మన్నాడు. నాటి పరిస్థితుల్లో క్రైస్త్తవుడు కావడమే ప్రమాదమైతే, క్రైస్తవ మత ప్రచారకుణ్ణి ఇంటికి పిలిపించుకోవడం వల్ల రోమా ప్రభుత్వానికి తాను శత్రువునవుతానని అతనికి తెలుసు. పైగా కొర్నేలీకి పేతురేవరో తెలియదు. అయితే దేవుని ఆదేశాలు ప్రభుత్వాదేశాలకన్నా అత్యున్నతమైనవని, పరిణామాలేమైనా వాటిని తూచా తప్పకుండా పాటించాలని మాత్రం అతనికి తెలుసు. అందుకే 65 కిలోమీటర్ల దూరంలోని యొప్పేకు అతను వెంటనే తన మనుషులను పంపాడు. పోతే కొర్నేలీ లాంటి అన్యుల ఇళ్లలో ఆతిథ్యం పొందడం, వారితో సహవసించడం యూదుడుగా ఎంతో నిష్టాపరుడైన పేతురుకు అంతకన్నా అభ్యంతరకరం, అది నిషిద్ధం కూడా.

అందుకే యొప్పెలో ఉన్న పేతురును సిద్ధపర్చేందుకు, దేవుడు దర్శనరీతిలో నిషిద్ధమైన, అపవిత్రమైన జీవచరాలెన్నో ఉన్న ఒక దుప్పటిని దించి వాటిని చంపుకొని తినమని మూడుసార్లు ఆదేశించినా పేతురు ఒప్పుకోకుండా నిషిద్ధమైన, అపవిత్రమైన  జంతువులను తానెన్నడూ తినలేదని దేవునికి బదులిచ్చాడు. అదే కొర్నేలీకి పేతురుకు మధ్య ఉన్న తేడా. క్రైస్తవ విశ్వాసంలో కొత్తవాడైనా కొర్నేలీ దైవదర్శనానికి వెనువెంటనే విధేయుడయ్యాడు కానీ గొప్ప విశ్వాసి, మహాబోధకుడు, భక్తుడూ అయిన పేతురు మాత్రం దేవుని ఆదేశాన్ని నిరాకరించాడు. నిజమే, తరతరాల క్రైస్తవులమని గొప్పలు చెప్పుకునే చాలామంది విశ్వాసుల్లో కనబడని భక్తి, నిబద్ధత, నీతి, నిజాయితీ, విధేయత కొత్తగా క్రైస్తవులైన విశ్వాసుల్లో కనిపిస్తూ ఉంటుంది. దేవునికి ఎదురు చెప్పే అలవాటు పేతురుకు మొదటినుండీ ఉంది. యూదులు యెరూషలేములో తనను చంపబోతున్నారని ఒకసారి యేసుప్రభువు తన శిష్యులకు తెలుపుతున్నప్పుడు, అలా నీకు జరుగదంటూ పేతురొక్కడే పదే పదే ఆయన్ను అడ్డుకొంటూ ఉంటే ‘సాతానా నా వెనక్కి వెళ్ళు’ అంటూ యేసు అతన్ని గద్దించాడు (మత్తయి 16:22). మేడగదిలో చివరి పస్కా విందులో యేసుప్రభువు తన శిష్యులందరి పాదాలు కడుగుతూంటే, తన పాదాలు మాత్రం కడుగొద్దంటూ పేతురు అడ్డుపడ్డాడు(యోహాను 13:6).

అయితే కొర్నేలీ మనుషులు తన వద్దకొచ్చినపుడు పేతురుకు ఆ దర్శనం అర్థమైంది. క్రైస్తవం లోనికి యూదులకు మాత్రమే కాదు, కొర్నేలీ వంటి అన్యులకు కూడా దేవుడు ద్వారాలు తెరిచాడని, క్రైస్తవాన్ని హత్తుకునే విషయంలో నిషిద్ధ జనమంటూ లోకంలో ఎవ్వరూ లేరని, అది సర్వజన దైవమార్గమన్నది అతనికి  అర్ధమయ్యింది (అపో.కా.10:28). వెంటనే పేతురు వారితో పాటు కొర్నేలీ ఇంటికి వెళ్లి వారికి దైవమార్గాన్ని సంపూర్ణంగా విశదీకరించి అతని పరివారమంతటికీ బాప్తీస్మాలిచ్చాడు. కొన్ని శతాబ్దాల క్రితం నీనెవె పట్టణస్థులైన అన్యులకు సువార్త ప్రకటించమని దేవుడు ఆదేశిస్తే యోనా అనే ప్రవక్త ఎదురు తిరిగి ఇదే యొప్పే పట్టణం నుండి తర్షీషు పట్టణానికి ఓడలో పారిపోయాడు. ఇపుడు యొప్పే పట్టణం నుండే అన్యులకు సువార్త చెప్పేందుకు పేతురు కైసరయకు వెళ్లడంతో యొప్పేకున్న ఆ అపఖ్యాతి కాస్తా తొలగిపోయి, క్రైస్తవ ధర్మానికున్న సార్వత్రికత కూడా వెల్లడయింది. మొదటి శతాబ్దంలో క్రీస్తు శిష్యుడు థామస్‌ ఇండియాకు వచ్చినపుడు కేరళలోని నంబూద్రీలనే సవర్ణులు క్రైస్తవాన్ని అంగీకరించారు. పదహారవ  శతాబ్దంలో చాలా మంది బిసిలు క్రైస్తవులయ్యారని చరిత్ర చెబుతోంది. అయితే అస్పృశ్యులైన శూద్రులు మాత్రం ఈ రెండువేల ఏళ్లుగా క్రైస్తవానికి కూడా అంటరాని వారే అయ్యారు. అయితే 1864 లో ఒంగోలు ప్రాంతానికి బాప్టిస్టు మిషనేరీగా వచ్చిన జాన్‌ ఎవెరెట్‌ క్లౌ(క్లౌ దొర) కటిక దారిద్య్రంలో అస్పృశ్యులుగా బతుకుతున్న దళితులను క్రైస్తవంలోకి ఆహ్వానించాడు. ఆయన చొరవ, పరిచర్య వల్ల 1878 జులైలో గుండ్లకమ్మ నదిలో ఒక్కరోజే 2222 మంది దళితులు క్లౌగారి ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత ఆరు వారాల్లో 9000 మందికి పైగా దళితులు ముఖ్యంగా మాదిగలు ఆయన ఇచ్చిన బాప్తీస్మం ద్వారా ్రౖకైస్తవంలోకి వచ్చారు. రిజర్వేషన్ల వంటి రాజ్యాంగ హక్కులు రావడానికి వందేళ్ల ముందే, భారతదేశ చరిత్రలో అంటరానివారైన దళితులకు ఆత్మగౌరవాన్నిచ్చి జనజీవనస్రవంతిలో చేర్చిన అద్భుతమైన తొలి విప్లవం ఇది. క్రైస్తవం అందుకే ఒక ఆత్మగౌరవ విప్లవం, సార్వత్రిక ఆశీర్వాద జీవన సౌరభం !!! 
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top