Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు

Russia-Ukraine war: Russia cannot be isolated says vladimir putin - Sakshi

మా దేశం చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టీకరణ

మాస్కో/కీవ్‌: భారత్, చైనాతోనే గాక లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్‌ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘‘ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుంది. అక్కడ 150 కోట్ల మంది ఉన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యం. మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టాం. ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

ఈయూలో చేర్చుకోండి: జెలెన్‌స్కీ   
తమకు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. మాట నిలబెట్టుకోవాలని సూచించారు.‘గ్రేజోన్‌’ పేరిట ఉక్రెయిన్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా రష్యా దండయాత్రకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు.

ఫిన్‌లాండ్‌ నుంచి మరిన్ని ఆయుధాలు!
ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందజేసేందుకు ఫిన్‌లాండ్‌ ముందుకొచ్చింది. ఫిన్‌లాండ్‌ గతంలోనే రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది.
► యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వోన్‌ డెర్‌ లెయేన్‌ తాజాగా పోప్‌ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. యుద్ధానికి ముగింపు, ఆహార సంక్షోభంపై చర్చించారు. యుద్ధం వల్ల నష్టపోయిన వారికి తాము అండగా ఉంటామని ట్వీట్‌ చేశారు.

► ఉక్రెయిన్‌లో ముగ్గురు విదేశీయులకు రష్యా అనుకూల వేర్పాటువాదుల కోర్టు మరణ శిక్ష విధించడంపై ఐరాస మానవ హక్కుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది యుద్ధనేరమని వ్యాఖ్యానించింది.

► తూర్పు ఉక్రెయిన్‌లో తమ బలగాలు ప్రత్యర్థి రష్యా సైనికులపై పైచేయి సాధిస్తున్నాయని లుహాన్‌స్క్‌ గవర్నర్‌ సెర్హివ్‌ హైడై చెప్పారు. సీవిరోడోంటెస్క్‌లో కీలక పారిశ్రామిక ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలను ఉక్రెయిన్‌ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయన్నారు.

రష్యా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గాళ్ ఫ్రెండ్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి

► తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులకు తూర్పు ఉక్రెయిన్‌లో మరణ శిక్ష విధించడం దారుణమని, ఇందుకు రష్యానే బాధ్యత వహించాలని బ్రిటిష్‌ మంత్రి రాబన్‌ వాకర్‌ డిమాండ్‌ చేశారు. బ్రిటిష్‌ పౌరులైన ఐడెన్‌ అస్లిన్‌(28), షౌన్‌ పిన్నర్‌(48)కు రష్యా అనుకూల కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరో మొరాకో పౌరుడు సాదౌన్‌కు కూడా మరణశిక్ష విధించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

► రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ సైన్యంలో నిత్యం 200 మంది దాకా జవాన్లు బలవుతున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడోల్యాక్‌ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి మరిన్ని ఆధునిక ఆయుధాలు వస్తేనే తమ సైనికుల ప్రాణత్యాగాలకు తెరపడుతుందన్నారు.   

► ఉక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్‌ అధ్యక్షడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ చెప్పారు. ఆయన తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడారు. తమ సేనలు ఖర్కీవ్‌నుంచి రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాయని జెలెన్‌స్కీ చెప్పారు.

► డోన్బాస్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్టాఖనోవ్‌పై ఉక్రెయిన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top