అంగట్లో వంటనూనెలు

Common Cooking Oils Are Used In The Market - Sakshi

ఆయుర్వేదం

వాసన గ్రహించే ముక్కుకి, రుచిని గ్రహించే నాలుకకి అవినాభావ సంబంధం ఉంది. చక్కగా మరిగిన వంటనూనెలలో రుచిని పెంచే గుణం దాగి ఉంది. అతిగా వాడితే అనారోగ్యం పొంచి ఉంది. ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే వంటనూనెలను మరిగించడం కంటే పచ్చిగా వాడటమే మంచిది. ప్రస్తుతం బజారులో లభించే సాధారణ వంటనూనెలు... నువ్వుల పప్పు నూనె (తిల తైలం), వేరుసెనగ (పల్లీ) నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, రైస్‌ బ్రాన్‌ ఆయిల్, పామాయిల్, మొదలైనవి. కొన్ని ప్రాంతాలలో కొబ్బరినూనె, ఆవనూనె వాడుకునే అలవాటు ఉంది. ఇటీవలి కాలంలో కుసుమ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. సామాన్యులు ఈ నూనెల ధరలను బట్టి చవకగా లభించే వాటికే ప్రాధాన్యతనిస్తున్నారు.

కారణాలేవైతేనేం! ప్రస్తుతం మినహాయింపు లేకుండా వంటనూనెలన్నీ కల్తీమయమనే విషయం జగమెరిగిన సత్యం. రిఫైన్డు ఆయిల్సులో ఉన్న రసాయనిక ద్రవ్యాలు, జంతు కళేబరాల కొవ్వులతో కల్తీ చేయబడ్డ బ్రాండెడ్‌ ప్యాకెట్లు, ప్రత్తి విత్తనాల నూనెల్ని కలిపి కల్తీ చేయడం వంటి అనేక ప్రక్రియల వల్ల జీర్ణకోశ సమస్యలే కాక, పక్షవాతం, క్యాన్సరు వంటి దారుణ వ్యాధులు కలుగుతున్నాయని వైద్యవిజ్ఞానం ఘోషిస్తోంది. ఈ మధ్యనే కొంచెం అవగాహన పెరిగి, గానుగలను ఆశ్రయించి, మన కళ్ల ముందు ఆడిస్తున్న నువ్వుల పప్పునూనె, పల్లీల నూనెలపై మొగ్గు చూపుతున్నారు. ఇళ్లల్లో తయారుచేసుకునే పదార్థాలను సేవిస్తున్నారు.

ఆయుర్వేద గ్రంథాలలోని ప్రస్తావన...
నువ్వుల నూనె: తిలలు అంటే నువ్వులు. పొట్టును తొలగిస్తే ‘నువ్వు పప్పు’ అంటాం. పొట్టుతోబాటు తీసిన నూనెను ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. పప్పు నూనె మరింత రుచికరంగా ఉంటుంది.

గుణధర్మాలు: దీనిని శరీరానికి మర్దన చేసికొని అభ్యంగ స్నానానికి వాడతారు. వంటనూనెగా కూడా సేవిస్తారు. చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని ఇస్తుంది. ఆకలిని పెంచుతుంది. బలాన్ని, తెలివితేటల్ని పెంచుతుంది. స్థూలకాయులకు బరువు తగ్గటానికి, కృశించినవారికి బరువు పెరగటానికి దోహదపడుతుంది. కేశాలకు, నేత్రాలకు మంచిది. గర్భాశయశోధకం. కొంచెం వేడి చేస్తుంది. మలమూత్రాలను అధికంగా కాకుండా కాపాడుతుంది. సాధారణ విరేచనాన్ని సానుకూలం చేస్తుంది. బాహ్యంగానూ, అభ్యంతరంగానూ క్రిమిహరం. శుక్రకరం. నువ్వులలో కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీస్, సెలీనియం, విటమిన్‌ బి 1, ఆహారపు పీచు కూడా ఉంటాయి. ప్రొటీన్లు తగినంత ఉంటాయి.

వేరుసెనగ నూనె: ఆయుర్వేద కాలంలో దీని ప్రస్తావన లేదు.

పోషక విలువలు: ప్రొటీన్లు, కొవ్వులు తగు రీతిలో లభిస్తాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. బయోటిన్, కాపర్, నియాసిన్, ఫోలేట్సు, మాంగనీసు, విటమిన్‌ ఇ , థయామిన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మొదలైనవి ఉండటం వలన ఆరోగ్యకరం. శరీరబరువు తగ్గటానికి, పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌) రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి దోహదం చేస్తుంది. వేరు సెనగ పలుకుల్ని బాగా ఎండబెట్టి వాడుకుంటే దాని అనర్థాల ప్రభావం ఉండదు. ఆయుర్వేద గ్రంథాలలో ఆవనూనె (సర్లప), ఆవిసె (అతసీ), కుసుమ (కుసుంబ) గసగసాలు (ఖసబీజ), ఏరండ (ఆముదం) నూనెల వివరాలు కూడా ఉన్నాయి.

వాడకపోయినా పరవాలేదు...
ఒకసారి మరిగించిన నూనెలను మళ్లీమళ్లీ మరిగించి వాడితే క్యాన్సరు వంటి ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి ∙నూనెలను పచ్చివిగా వాడుకుంటే మంచిది ∙కల్తీలను దృష్టిలో ఉంచుకుని అంగట్లో తయారు చేసి అమ్మే సమోసాలు, పకోడీలు, చిప్స్‌ వంటివి తినకపో వటం మంచిది ∙గానుగలో స్వంతంగా ఆడించుకున్న నూనెలను వాడుకుంటూ, ఇంట్లోనే వండిన వాటిని తినడం వల్ల వ్యాధులు సోకవు ∙అసలు ఈ నూనెలు వాడకపోయినా, శరీరానికి కావలసిన కొవ్వులు ఆకుకూరల వంటి ఇతర ఆహార శాకాలలో లభిస్తాయి (ఇవి మనకు కంటికి కనపడవు)
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top