'పాడి'తో బతుకు 'పంట'!

Chittoor Women Dairy Farming Special Story - Sakshi

బతుకు పోరులో పాలు, పొదుపే వజ్రాయుధాలయ్యాయి

విధి చిన్న చూపు చూసింది. పెళ్లయిన మూడేళ్లకే పసుపు కుంకాలను తుడిచేస్తే గుండెలవిసేలా రోదించింది. ఇద్దరు బిడ్డల్ని తీపిగుర్తులుగా మిగిల్చి భర్త అకాల మరణం పాలయ్యాడు. అత్తింటివారు చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వకుండా నిరాదరించినా కుంగిపోలేదు. ముక్కుపచ్చలారని బిడ్డల్ని వెంటబెట్టుకొని కట్టుబట్టలతో, కన్నీళ్లతో పుట్టింటికి చేరింది. ఎన్ని కష్టాలెదురైనా తన కాయకష్టంతో బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనేదొక్కటే సుజాత సంకల్పం!పాడి, పొదుపులే ఆమెకు అండాదండలయ్యాయి.. ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చాయి. జీవన రథం సజావుగా సాగడానికి అవే చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి..

సుజాత సొంతూరు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని తిరివిరెడ్డిపల్లె గ్రామం. రేవతి, రంగస్వామిల కుమార్తె  అయిన సుజాత 7వ తరగతి వరకు చదువుకుంది. గుడిపాల మండలం దాయంవారిపల్లెకు చెందిన గురుమూర్తితో 1996లో ఆమెకు పెళ్లయింది. మూడేళ్లలోనే దురదృష్టం వెంటాడింది. ఆశలన్నీ కుప్పకూలాయి. కుమారుడు పవన్, కుమార్తె పూజిత పుట్టిన తర్వాత.. భర్త విద్యుదాఘాతంతో అకాల మరణం చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లీ పిల్లలను అత్త మామలు పట్టించుకోలేదు. ఆస్తి కూడా ఇవ్వలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో తన ఇద్దరు బిడ్డలను వెంటపెట్టుకొని సుజాత పుట్టింటికి చేరింది. బంధుమిత్రుల సూచన మేరకు అప్పట్లోనే రూ. 50 వేలు అప్పు చేసి రెండు పాడి ఆవులు కొన్నది. ఆర్థికంగా తన కాళ్లమీద తాను నిలదొక్కుకోవడానికి, బిడ్డలను చదివించుకోవడానికి ఈ పాడి ఆవులే ఆమెకు ఆధారమయ్యాయి.

నీటి వసతి ఉన్న ఎకరం భూమిని ఏడాదికి రూ. 15 వేల చొప్పున కౌలుకు తీసుకొని కో4 రకం పచ్చగడ్డి పెంచుతూ, పచ్చగడ్డితో పాటు ఎండుగడ్డిని కలిపి మేపుకుంటూ సంతృప్తికరంగా పాల ఉత్పత్తి ఉండేలా జాగ్రత్తపడుతున్నారామె. ఇప్పుడు సుజాత వద్ద 5 ఆవులు ఉన్నాయి. రోజుకు 30 లీటర్ల పాలను డెయిరీకి అమ్ముతూ ఉంటుంది. ప్రస్తుతం లీటరుకు రూ. 28 చొప్పున ఆదాయం వస్తున్నది. లీటరుకు రూ. 4 బోనస్‌ ఇస్తామంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయని సుజాత చెప్పారు.

పాడిపశువులను పోషించుకుంటూనే పొదుపుపై ఆమె దృష్టి సారించారు. చాలా సంవత్సరాల క్రితమే ఆమె పొదుపుసంఘంలో సభ్యురాలిగా చేరారు. ప్రస్తుతం మండల పొదుపు సంఘం అధ్యక్షురాలిగా సుజాత పనిచేస్తున్నారు. నెలకు రూ. 4,500 ఆదాయం వస్తుంది. ఉన్న ఆదాయ వనరులతోనే ఇద్దరు బిడ్డలను ఉన్నత విద్యావంతులను చేయాలన్నదే ఆమె సంకల్పం. పొదుపు సంఘంలో రూ. 50 రుణం తీసుకొని బిడ్డల చదువుకు ఉపయోగించింది. పాడి ఆవుల ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చడంతోపాటు ఉన్నంతలో పొదుపు చేస్తోంది.   
కుమారుడు పవన్‌ ఇంటర్‌తో చదువు చాలించి, ఓ ప్రైవేటు డెయిరీలో ఉపాధి వెతుక్కున్నాడు. తల్లి ఆకాంక్షలకు తగ్గట్టుగా కుమార్తె 83 శాతం మార్కులతో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. పదోతరగతిలో 9.5 పర్సంటైల్, ఇంటర్‌లో కూడా 97 శాతం మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకుంది. పూజిత తెలివి తేటలను తిరుపతి వ్యవసాయ కళాశాల డీన్‌ రమేష్‌ ఆమెను అభినందించారు. రాష్ట్ర పొదుపు సంఘాల అధికారి విజయభారతి ఆర్థిక తోడ్పాటునందించి ప్రోత్సహించారు.

పొదుపు సంఘం సభ్యులను చైతన్యవంతం చేస్తూ, వారి సమస్యలు పరిష్కరిస్తూ సుజాత ప్రశంశలందుకుంటున్నారు. మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులకు భారం కాకుండా.. తన రెక్కల కష్టంతో బిడ్డలకు తండ్రి లేని లోటు కనపడకుండా కుటుంబాన్ని సమర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నడుపుతున్నారు సుజాత. 

‘చిన్నవయస్సులో భర్తను కోల్పోయాను. అత్తమామల నిరాదరణకు గురై సెంటు భూమి లేని నిరుపేదగా మిగిలాను. జీవితంలో ఎన్నో కష్టాలకు గురైనా ధైర్యం కోల్పోకుండా ఉపాధి కల్పించుకున్నాను. స్వశక్తితో జీవిస్తున్నా. బిడ్డలను చదివిస్తున్నా. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం అన్నారు సుజాత. ‘నన్ను ఉద్యోగస్తురాలిగా చూడాలని మా అమ్మ కన్న కలలు నిజం చేస్తాను. తల్లి రుణం తీర్చుకుంటాను. అమ్మను జీవితాంతం నేనే చూసుకుంటాను..’ అంటున్న పూజితను నిండు మనసుతో ఆశీర్వదిద్దాం.  – దూది త్యాగరాజులు,సాక్షి, పెనుమూరు, చిత్తూరు జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top