రిజల్ట్స్‌ పరీక్ష కాకూడదు

Children Should know the Value of Life - Sakshi

ప్రతిభకు పరీక్ష ఉండాలి.. ఆత్మవిశ్వాసానికి కాదు.ప్రయత్నాన్ని మించిన విజయం లేదనిపిల్లలకు చెప్పగలగాలి. ప్రయాణాన్ని మించిన గమ్యం ఉండదనిపిల్లలకు తెలియజేయాలి.పరీక్ష అయిపోయిందనీ..  రిజల్ట్‌ మనకు పరీక్ష కాదనీ చెప్పాలి. 

పరీక్షలు – ఫలితాలు– ఆత్మహత్యలు... ఈ మూడూ ఒకదానితో ఒకటి ఎందుకు ముడిపడి ఉన్నాయి? పరీక్ష ఫెయిలైతే ఆత్మహత్య చేసుకోవడమేనా? జీవితం విలువ ఒక పరీక్షకు సమానమా? కాదు... అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ జీవితం విలువ తెలిస్తే ఆ జీవితాన్ని ముగించుకోవాలని అనుకోరెవ్వరూ. పిల్లలకు జీవితం విలువ తెలియచెప్పాలి. జీవితంలో పాటించాల్సిన విలువలను నేర్పించాలి. అప్పుడు పరీక్ష ఫెయిలయినందుకు ప్రాణం తీసుకోవడం ఉండదు. మార్కులు తగ్గాయని మరణాన్ని ఆశ్రయించడం ఉండదు. అమ్మ తమను కడుపులో మోసి కనిపెంచిన కష్టం కంటే పరీక్ష పోవడం పెద్ద కష్టం కాదని పిల్లలకు ఎవరు చెప్పాలి? 
మార్కుల రేస్‌లో పిల్లల్ని పరుగెత్తించడం ఎంత తీవ్రమైనదంటే..ఏడాదంతా ప్రేమగా చూసుకున్న ఎడ్లకు సంక్రాంతి రోజు పందేలు పెట్టి... అవి వాటి శక్తి కొద్దీ బరువును లాగుతున్నా సరే... సంతృప్తి చెందకుండా గెలుపు కోసం హింసిస్తూ ఉంటారు. ఆ హింస పైకి కనిపిస్తుంది. పిల్లల మెదళ్ల మీద పెట్టే బరువు పైకి కనిపించదు. పిల్లల మనసు మోస్తున్న భారం కూడా పైకి కనిపించదు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీలు పట్టి, రాత్రంతా మేల్కొని... చదివిన పాఠాలనే మళ్లీ మళ్లీ చదివి పరీక్షలు రాస్తారు. ‘హమ్మయ్య పరీక్షలయిపోయాయి’ అని ఊపిరి పీల్చుకున్నప్పటి నుంచే ‘ఫలితాల’ భూతం వెంటాడుతుంది. 

అమ్మానాన్నలకేమైంది!
కార్పొరేట్‌ విద్యాసంస్థలు గీసిన రన్నింగ్‌ ట్రాక్‌ మీద అమ్మానాన్నలు ఎప్పుడు ట్రాక్‌ ఎక్కారో వాళ్లకే తెలియదు, రేసుగుర్రాల్లా అలా పరుగెత్తుతూనే ఉన్నారు. తమ పిల్లలు టాప్‌లో ఉండాలనే ధ్యాస తప్ప, అమ్మానాన్నలు... తమ పిల్లలు మనుషులుగా ఎదగాలనే సంగతి మర్చిపోయి ఒక తరం గడిచిపోయింది. నంబర్‌వన్‌ రేసులో గెలవడానికి శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. అమ్మానాన్నలు పిల్లలతో మాట్లాడేది ‘‘హోమ్‌వర్క్‌ చేశావా, ఎంతసేపూ ఆటలేనా? చదువుకోవా? టీవీ చూసింది చాలు ఇక పడుకో, సెల్‌ఫోన్‌ వదిలిపెట్టవా... ఇలాగైతే నువ్వు ఎగ్జామ్స్‌ పాసయినట్లే’’ అని గద్దించడానికే. ఆ రోజు వాళ్లేం చేశారో అడిగి వారు చెప్పే కబుర్లు వినే ఓపిక ఉండడం లేదు.

ప్రోగ్రెస్‌ రిపోర్టు చూసి ముఖం చిట్లింపులు... చీదరింపులూ ఎక్కువైంది. పట్టించుకోని పిల్లలు బాగానే ఉంటున్నారు. సున్నితంగా ఆలోచించే పిల్లల మనసులు మాత్రం ఆ మాటలకు కల్లోల కాసారాలవుతున్నాయి. ‘అమ్మానాన్నలు నా కోసం చాలా కష్టపడుతున్నారు... నేనే వాళ్లను సంతృప్తి పరచలేకపోతున్నాను. ఈ మార్కులు చూస్తే అమ్మ బాధ పడుతుందేమో,  నాన్నకు కోపం వస్తుందేమో! వాళ్లనలా చూడలేను, నా ముఖం వాళ్లకు చూపించలేను’ ఇలా సాగుతుంటాయి పిల్లల ఆలోచనలు. ఆ మానసిక సంఘర్షణ ఫలితమే ఈ ‘ఫలితాల మరణాలు’.

మార్కులకంటే విలువైన వాళ్లు
‘పరీక్ష ఇప్పుడు పోతే మరోసారి రాసుకోవచ్చు, జీవితం పోతే మళ్లీ రాదు. పరీక్షలో పాస్‌ కావడమే జీవితం కాదు’ అని పిల్లలకు ధైర్యాన్నిచ్చే అమ్మానాన్నలు తగ్గిపోతున్నారు. అది ఆందోళన చెందాల్సిన విషయం. పిల్లలు ప్రాణం తీసుకుంటున్నారంటే అసలు కారణం పరీక్షలు కాదు. తల్లిదండ్రులు వాళ్లతో స్నేహితుల్లా మెలగలేకపోవడం అంటారు చైల్డ్‌ సైకాలజిస్ట్‌ జయశేషు. తన దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చే పిల్లల్లో ఎక్కువమంది కోరిక ఒక్కటే.. ‘అమ్మానాన్నలు తనను తమ పక్కింటి పిల్లవాడిని చూసినట్లు చూడాలి’ అని. ఆ పిల్లాడితో మాట్లాడినట్లు మంచిగా మాట్లాడాలి. ఆ పిల్లాడిని కసురుకోరు. నన్ను మాత్రం ప్రతి చిన్నదానికీ కసురుకుంటారు’ అని పిల్లలు మనసు విప్పుతున్నారు.

‘‘ఆధునిక మానవుడు సభ్యసమాజంలో గౌరవంగా జీవించాలంటే చదువు అవసరమే, చదువు విలువ పిల్లలకు తెలియ చెప్పాల్సిందే. అయితే చదువంటే మార్కుల నంబరు రేస్‌ కాదు. సబ్జెక్ట్‌ని నేర్చుకున్నారా, చదివింది ఆకళింపు చేసుకున్నారా అన్నంత వరకే పరిమితం కావాలి’’ అన్నారామె. మార్కులకంటే పిల్లలే విలువైన వాళ్లనే సత్యాన్ని అమ్మానాన్న గుర్తించకపోతే పసిమొగ్గలు విచ్చుకోకనే రాలిపోతాయి. ‘వజ్రమైనా సానపడితేనే కాంతులీనుతుంది’ అనే సూక్తిని మరీ ఎక్కువగా ఒంటపట్టించుకున్న పేరెంట్స్‌... సానబెట్టే క్రమంలో వజ్రాన్ని తునాతునకలు చేసుకుంటున్నామని మర్చిపోతే ఎలా? 
వాకా మంజులారెడ్డి

‘అబ్బా.. బోర్‌’ అనిపించకూడదు
హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఉన్న ప్రశాంతి కౌన్సెలింగ్‌ అండ్‌ హెచ్‌ఆర్‌డి సెంటర్‌కి వెళ్లినప్పుడు.. ఆ ప్రాంగణంలో.. పిల్లలకు పెద్దలు విధిగా తెలియజెప్పాల్సిన కొన్ని గుడ్‌ హ్యాబిట్స్‌ గురించి అక్కడి సైకాలజిస్టులు పెద్దలకు చెబుతూ కనిపించారు. పెద్దలతోపాటు వాళ్ల పిల్లలూ ఉన్నారు. పెద్దలు కూడా ఇంటికి రాగానే, ఇలాంటి కొన్ని మంచి అలవాట్లను ఒక చార్ట్‌ మీద రాసి పిల్లలకు రోజూ కనిపించేటట్లు గోడకు తగిలించాలి. త్వరగా నిద్రపోవాలి, ఉదయం త్వరగా లేవాలి. నీటిని పొదుపు చేయాలి. ప్రకృతిని, చెట్లను రక్షించాలి. మూగ జీవుల్ని హింసించ కూడదు. ఆహారాన్ని వృథా చేయరాదు. హోమ్‌వర్క్‌ను వాయిదా వేయవద్దు. ఆడుకోవాలి, కానీ ఆటల్లోనే గంటల కొద్దీ సమయాన్ని గడపకూడదు.

సూర్యరశ్మి, నడక, కోపాన్ని అణుచుకోగలగడం... ఈ మూడూ ఎప్పుడూ వదలకూడని మంచి స్నేహితులు. వాయిదా వేయడం, బద్దకం, అతి నిద్ర... ఈ మూడూ ఎప్పుడూ దరి చేరనివ్వకూడని చెడ్డ స్నేహితులు.. ఇలాంటివి రాసి ఉంచాలి. అయితే వీటి చూస్తూ ఒకసారి పిల్లలు మారిపోతారని కాదు. ఒక్కరోజే అన్నింటినీ ఒంటపట్టించుకుంటారనీ కాదు. రోజూ చెప్తుంటే ‘‘అబ్బా బోర్‌’’ అని చెవులు మూసుకుంటారు. మనం చెప్పకుండా వాళ్ల చూపు పడేలా ఉంచితే... రోజులో కనీసం ఒక్క నిమిషమైనా ఆ మంచిమాటల మీద వాళ్ల దృష్టి పడుతుంది. ఒకసారి చూసిన సంగతి కానీ విన్న సంగతి కానీ తప్పకుండా మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లలతోపాటు వారిలో విలువలూ పెరుగుతాయి.

ఈదడం వస్తే... ఎదురీదడమూ వస్తుంది
కోల్‌కతాలో ప్రభుత్వం సర్కస్‌ని నిషేధించింది. పులులతో సహా జంతువులన్నింటినీ తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టేశారు. మామూలుగా అడవిలో పులి సంచరిస్తుంటే మిగిలిన జంతువులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమను తాము రక్షించుకోవడానికి పరుగులు తీస్తాయి. అయితే సర్కస్‌ నుంచి వచ్చిన పులులు తాము వేటాడవచ్చనే సంగతినే మర్చిపోయాయి. కేర్‌టేకర్‌ పెట్టే మాంసాన్ని తినడానికి అలవాటు పడిన ఆ పులులు వేటాడలేక అడవిలో పుట్టి పెరిగిన వేటకుక్కల దాడిలో మరణించాయి. మనుషులు కూడా అలాగే అయిపోతున్నారు. పిల్లలకు ఏ పనీ తెలియకుండా పెంచుతున్నారు. ఆఖరుకి తమను తాము రక్షించుకోవడం కూడా చేతకానంత ఓవర్‌ ప్రొటెక్షన్‌ అది.

గ్రామాల్లో పదేళ్లకే పిల్లలు ఈత నేర్చుకుంటారు. పట్టణాలు, నగరాల్లో పిల్లలను పేరెంట్స్‌ రోడ్డు కూడా సొంతంగా దాటనివ్వడం లేదు. పిల్లలు ప్రయాణిస్తున్న బస్సు పొరపాటున నీళ్లలో పడితే అప్పుడు పిల్లలు ఆ భయాందోళనలతోనే  ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత వచ్చి ఉంటే బస్సు నీళ్లలో ఎంత లోతులో పడిపోయినా సరే... ధైర్యాన్ని కోల్పోరు. మునిగిపోయినా పైకి తేలగలం అనే భరోసా అది.అలాగే ఈ తరం పిల్లలు చిన్న నిరాశను కూడా భరించలేకపోతున్నారు. మా దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చే పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్లకు నిండా పదిహేనేళ్లు ఉండవు. ‘లైఫ్‌ ఈజ్‌ మిజరబుల్‌’ అంటారు. అమ్మానాన్న తన పట్ల డిస్క్రిమినేషన్‌ చూపిస్తున్నారంటారు. హర్టయ్యానని చెబుతారు.

మన పెంపకంలో పిల్లల్లో ‘పెద్ద కష్టాన్ని కూడా చిన్నదిగా చూడగలిగిన పరిణతి’ రావాలి. అంతేతప్ప చిన్న కారణాన్ని పెద్దగా ఊహించుకుని బెంబేలు పడడం అలవడుతోంది. అది పూర్తిగా పెంపకంతోపాటు విద్యావిధానంలో ఉన్న లోపం. నేను ముప్పయ్‌ ఏళ్లుగా బాల వికాస్‌లో పిల్లలకు కథలు చెప్తున్నాను. అంటే కథల రూపంలో జీవన నైపుణ్యాలను చెప్తాను. ఇక్కడ ఒక సంగతి గమనించాలి... పిల్లలను తీర్చిదిద్దడానికి చెప్పే ఏ కథలోనూ బతకలేక ఆత్మహత్య చేసుకోవడం ఉండదు. బతికి సాధించి చూపించడమే ఉంటుం ది. బాల్యంలో నేర్చుకున్న విలువలు వాళ్లకు జీవితమంతా గుర్తుంటాయి. అవరోధాలను ఎదుర్కోవాలని చెప్పడానికి కూడా ఇదే సరైన వయసు.
బి. జయశేషు పట్టాభిరామ్, చైల్డ్‌ సైకాలజిస్ట్, ప్రశాంతి కౌన్సెలింగ్‌ అండ్‌ హెచ్‌ఆర్‌డి సెంటర్, 
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top