పిల్లలు... ఎముక...ఎరుక!

Children Health Care And Back Pain Counselling - Sakshi

పిల్లలు ఆటలాడుతూ ఉంటారు.  కొద్దిపాటి స్థలం ఉంటే చాలు ఓ ఫోల్డింగ్‌ కుర్చీని వికెట్లలా పెట్టి గల్లీ క్రికెట్‌ ఆడటం మనం చూస్తూనే ఉంటాం. వారు తమ ఆటల్లో ఎంతగా నిమగ్నమవుతారంటే తమకు ఏదైనా హాని జరుగుతుందా లేదా అన్న అంశాన్ని కూడా చూసుకోరు. పైగా జనం, ట్రాఫిక్, కార్లు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సందుల్లోనూ ఇలా ఆడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఇక వారు టీనేజ్‌లోకి ప్రవేశించగానే వాళ్లలో స్రవించే కొన్ని హార్మోన్ల కారణంగా సాహసప్రవృత్తితో ఉంటారు. దాంతో టూవీలర్లు నేర్చుకోవడంతోనే తమ వాహనాలను విపరీతమైన వేగంతో నడపటం, ముందు చక్రాలు లేదా వెనక చక్రాలు ఎత్తడం వంటి ఫీట్లకూ, సాహసాలకు పాల్పడుతుంటారు. ఫలితంగా కింద పడిç గాయాల పాలు కావడం, ఎముకలు విరగడం చూస్తుంటాం. పిల్లల్లో అయ్యే చాలా రకాల ప్రమాదాలు ఇలాగే ఎక్కువగా జరుగుతుంటాయి.

పిల్లల్లో ప్రమాదాలు ముప్పు చాలా ఎక్కువ... ఎందుకంటే...
పెరిగే వయసులో ముఖ్యంగా టీనేజీ పిల్లల ఎముకలు పెద్దవారితో పోలిస్తే మృదువుగానే ఉంటాయి. కానీ... అలా పెరిగే ఎముకకు అనుగుణంగా పక్కనే  ఉన్న కండరాలు (మజిల్స్‌), మృదు కణజాలం (సాఫ్ట్‌ టిష్యూస్‌), లిగమెంట్లు, టెండన్లు పెరిగేందుకు వీలుగా అంతే అనువుగానూ ఉండవు. కాబట్టి ఎముక పెరిగే దశలో ఎముకకూ... కండరాలు, మృదుకణజాలం, లిగమెంట్లు, టెండన్ల మధ్య సమన్వయం అదే స్థాయిలో ఉండదు. అందుకే ఎముకలు పెరిగే దశలో ఉన్న పిల్లల్లో గాయాలయ్యే రిస్క్‌ చాలా ఎక్కువ.  

పిల్లలకూ, పెద్దలకూ ఎముకల్లోతేడా ఇలా ఉంటుంది...
పిల్లల్లోని ఎముకల చివర్లో పెరుగుదలకు వీలుగా ఉండే మృదులాస్థి (కార్టిలేజ్‌) ఉంటుంది. వీటిని ‘గ్రోత్‌ ప్లేట్స్‌’ అంటారు. పెద్దవాళ్ల ఎముకల్లో పెరుగుదలకు వీలు కల్పించే ఈ కార్టిలేజ్‌ ఉండదు. ఈ గ్రోత్‌ప్లేట్స్‌లోని మృదులాస్థి చిగురులా మెత్తగా పెరుగుతూపోయి... పెరుగుదల ప్రక్రియ పూర్తయ్యాక... ఆ భాగం గట్టిగా మారిపోయి పెళుసుగా అయిపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో చెప్పాలంటే క్యాల్సిఫికేషన్‌ అంటారు.

పెరిగే పిల్లల్లో ఈ గ్రోత్‌ప్లేట్‌ వల్లనే ఎముక పొడవుగా పెరుగుతుంటుంది. ఎముకలను కండరంతో అతికి ఉంచే టెండన్స్‌ ఉన్న ప్రాంతంలోనూ గ్రోత్‌ కార్టిలేజ్‌ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ‘అపోఫైసిస్‌’ అంటారు. ఎముకకూ, టెండన్‌ అంచుకూ మధ్య భాగంలో ఉన్న కార్టిలేజ్‌ను ‘అపోఫైసీల్‌ కార్టిలేజ్‌’ అంటారు. ముందుగా కార్టిలేజ్‌ నిడివి పెరుగుతుంది. ఆ తర్వాత దాని కింద ఉన్న ఆ పెరిగిన భాగం పెళుసుబారిన ఎముకగా మారుతుంది. ఇలా అయ్యేటప్పుడు ఎముకకూ, టెండన్‌కూ మధ్య ఉన్న కాస్త బలహీనమైన ప్రాంతంలో గాయాలయ్యేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆటల్లో భాగంగా ఏదైనా కండరం బిగుసుకున్నప్పుడు (మజిల్‌ కంట్రాక్షన్‌ సమయంలో) ఆ కండరం చాలా ఎక్కువగా కుంచించుకుపోతుంది. కానీ అదే సమయంలో పక్కన ఎముక పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరిగే ఎముక లాగే దిశకూ, ఈ కండరాల బిగుసుకునే దిశకూ ఉండే తేడా వస్తుంది. దాంతో పిల్లల్లో గాయాలయ్యే (ఫ్రాక్చర్స్‌ అయ్యే) ఆస్కారం ఎక్కువ. ఎముకపై ఒకే చోట ఎప్పుడూ గాయం మాటిమాటికీ అవుతుండటం వల్ల అది ‘అపోఫైసైటిస్‌’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. ఓస్గూడ్‌–ష్లాటర్‌ అనే ఒక రకం మోకాళ్ల రుగ్మతకు ఇదో ఉదాహరణ. ఈ ఓస్గూడ్‌–ష్లాటర్‌ కండిషన్‌లో పైనున్న కార్టిలేజ్‌ చాలా మృదువుగా ఉండటం, దాని కిందనే ఉన్న ఎముక మాత్రం గట్టిగా ఉండటం, ఆటల్లో కండరం లాగేయడంతో మోకాలి భాగంలో ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చి మోకాలి వాపు వచ్చి పిల్లలను బాధిస్తూ ఉంటుంది. అయితే దాదాపు చాలా సందర్భాల్లో పిల్లలకు ఇదేమీ శాశ్వతమైన నష్టం కలగజేయదు. ఆర్థోపెడిక్‌ నిపుణులు తరచూ ఉపయోగించే రైస్‌ (అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్‌) చికిత్సతో ఉపశమనం కలుగుతుంది. అంటే కాలికి తగినంత విశ్రాంతి (రెస్ట్‌) ఇవ్వడం, ఐస్‌ కాపడం పెట్టడం, నొక్కి పట్టి ఉంచేందుకు ఎలాస్టిక్‌ రాప్‌ లేదా స్లీవ్‌ తొడగడం (కంప్రెషన్‌), పడుకున్నప్పుడు కాలిని కాస్త ఎత్తుగా దిండు మీద ఉంచడం (ఎలివేషన్‌)తో ఈ సమస్య తగ్గుతుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు నొప్పి నివారణ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది.

ఎదిగే వయసు పిల్లల్లో ఎముకల్లో నొప్పి...
కొన్ని సందర్భాల్లో పిల్లల్లో ఎముకలు పెరుగుతున్నప్పుడు కూడా వారి ఎముకల్లో నొప్పి వస్తుంటుంది. ఎముక పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా కండరం, లిగమెంట్‌ కూడా పెరగాలి. కానీ పిల్లల్లో ఒకదశలో ఎముక పెరుగుదల చాలా వేగంగా సాగుతుంది. ఆ టైమ్‌లో పిల్లలు వేగంగా ఎత్తు పెరుగుతారు. ఒకటి రెండేళ్ల పాటు చూడని పిల్లలను అకస్మాత్తుగా చూసినప్పుడు చాలామంది పిల్లల్లో మనం దీన్ని గమనించగలుగుతాం. ఇలా ఎత్తు పెరగడాన్ని ‘గ్రోత్‌ స్పర్ట్‌’ అంటారు. ఈ పెరుగుదల సమయాన్నే వైద్యులు లాగ్‌ ఫేజ్‌ అని కూడా అంటారు. (ఈ లాగ్‌ ఫేజ్‌ దశలో ఎముకలు వేగంగా పెరిగి పిల్లాడు అకస్మాత్తుగా పొడవవుతాడు. ఆ తర్వాత ఈ వేగం మందగించి, చాలా నెమ్మదిగా కొద్దికాలం పాటు పెరిగి... ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. అలా నెమ్మదిగా పెరిగే దశను ‘ల్యాగ్‌’ ఫేజ్‌ అంటారు).

పిల్లలు వేగంగా పెరిగే గ్రోత్‌స్పర్ట్‌ సమయంలో ఎముకకూ, కండరానికి మధ్య లోపించిన సమన్వయం వల్ల కీళ్లు బిగుతుగా అనిపించడం, కీళ్లు సులభంగా వంగకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇదే సమయంలో పిల్లలు ఏదైనా పనిని అదేపనిగా చేస్తూ ఉన్నప్పుడు  వారిలో కొన్ని చోట్ల కండరాలకు, ఎముకలకు అయినచోటే మాటిమాటికీ గాయాలు అవుతుండవచ్చు. ఫలితంగా కండరాలు బిగుసుకుపోయినట్లుగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఆటలాడే పిల్లల్లో ఈ తరహా గాయాలు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ దశలో పిల్లలకు ఏవైనా గాయాలైనప్పుడు అదేపనిగా వ్యాయామాన్ని గాని, ఏదైనా శారీరకమైన శ్రమను  (యాక్టివిటీని) గాని చేయించడం అంత సరికాదు. అలాగే ఒక్కోసారి మనం చేసే శారీరక శ్రమ (ఫిజికల్‌  యాక్టివిటీ) తాలూకు తీవ్రతను ఒకేసారి పెంచడం కూడా ఆర్థోపెడిక్‌ గాయాలకు ఆస్కారం ఇస్తుంది.

అలాగే కొన్ని సందర్భాల్లో పిల్లల వ్యాయామ తీవ్రతనూ అలాగే వారు వ్యాయామం చేసే వ్యవధినీ చాలా ఎక్కువగానూ, అనూహ్యంగానూ పెంచడం, పాదాలకు సరిగ్గా సరిపోనివీ, సరిగా అమరని పాదరక్షలు వాడటం, ఎగుడుదిగుడుగా ఉన్న ఉపరితలంపై ఆటలాడటం వల్ల దొడ్డికాళ్లు (బౌలెగ్స్‌) రావచ్చు, కొందరిలో మోకాళ్లు ఒకదానికి ఒకటి కొట్టుకునే నాక్‌ నీస్‌ అనే సమస్య ఉంటుంది. చిన్నతనంలో రికెట్స్‌ వంటి వ్యాధి వచ్చిన వారిలో ఇలా మోకాళ్లు కొట్టుకునే సమస్య వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి పిల్లలకు క్యాల్షియమ్‌ లోపం ఉందేమో పరీక్షించి, ఆ లోపాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది.

ఇక మనందరిలోనూ మడమకూ, వేళ్లకూ మధ్య ఉండే భాగం అర్థచంద్రాకారంలో పైకిలేచి నేలకు ఆనకుండా చేసే ఆర్చ్‌లా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ కొందరిలో వంశపారంపర్యంగా ఈ ఆర్చ్‌ ఉండదు. అయితే ఇలా ఆర్చ్‌ లేకపోవడం అన్నది పిల్లల్లోనూ, వారి ఎదుగుదలలోనూ  ఎంతమాత్రమూ సమస్య కాబోదు. ఇలా ఫ్లాట్‌ఫీట్‌ ఉన్న ఒక ఆటగాడు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ కూడా సాధించాడు. కాకపోతే ఫ్లాట్‌ఫీట్‌ కారణంగా వారి మోకాళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారు తమ ఆర్చ్‌ భాగంలో సపోర్ట్‌ ఉండేలాంటి పాదరక్షలు ధరిస్తే చాలు.

 పిల్లల్లో వచ్చే మరికొన్ని ఎముకల సమస్యలు...
గ్రోత్‌ప్లేట్‌ ఫ్రాక్చర్స్‌: పిల్లల ఎముకలు గ్రోత్‌ప్లేట్స్‌తో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎముకతో పోలిస్తే ఈ పెరిగే భాగం బలహీనంగా ఉంటుందన్న విషయమూ చెప్పుకున్నాం కదా. దాంతో ఈ తేడాల వల్ల ఒక్కోసారి ఎముకకూ, గ్రోత్‌ప్లేట్స్‌కూ మధ్యనుండే భాగం ఫ్రాక్చర్స్‌ అయి జాయింట్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌కూ, చాలా ముందుగానే వచ్చే అర్లీ ఆర్థరైటిస్‌ వంటి సమస్యకూ దారితీయవచ్చు. చాలా అరుదుగా ఒక్కోసారి కొంత మంది పిల్లల్లో పెరుగుదల ఆగిపోవచ్చు. వైద్య పరిభాషలో ఇలా పెరుగుదల ఆగిపోవడాన్ని ‘స్టంటెడ్‌ గ్రోత్‌’ అని చెబుతారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా శిక్షకులు పిల్లాడిలోని సమస్యను సరైన సమయంలో గుర్తించాలి. దానికి ఇవ్వాల్సిన చికిత్స కూడా చాలా శ్రద్ధగా చేయించాల్సి ఉంటుంది.

ఆస్టియోకాండ్రోసిస్‌: ఇది ఎముక చివరన పెరిగే కార్టిలేజ్‌లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఎముక చివరన జరిగే రక్తసరఫరాలో తేడాల వల్ల ఈ సమస్య వస్తుంది. తుంటి ఎముక కీలు వద్ద కనిపించే ‘పార్థెస్‌ డిసీజ్‌’ అన్నది ఈ తరహా సమస్యకు ఒక మంచి ఉదాహరణ. దీనివల్ల తుంటి ఎముక కీలు శాశ్వతంగా దెబ్బతినవచ్చు. సాధారణంగా సమస్య తుంటికే వచ్చినా... పిల్లలు మాత్రం మోకాలు నొప్పి అని చెబుతుంటారు. ఇలా ఒకచోట ఉన్న నొప్పి మరో చోట బయటకు కనిపించడాన్ని వైద్యపరిభాషలో ‘రిఫర్‌డ్‌ పెయిన్‌’ అంటారు. కాబట్టి పిల్లలు మోకాళ్లలో నొప్పి అంటే తుంటి ఎముకను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పిల్లల వయసును బట్టి కూడా సమస్యలతో పాదాల సమస్యలు (కొహ్లెర్స్‌ డిసీజ్‌), పాదాల వేళ్ల సమస్యలు (ఫ్రీబెర్గ్స్‌ డిసీజ్‌), మడమ సమస్యలు (సెవెర్స్‌ డిసీజ్‌) వంటివి కూడా కనిపించవచ్చు.

ఒక పనిని అదేపనిగా పదేపదే చేస్తే వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది ఆస్గుడ్‌ ష్లాటర్స్‌ డిసీజ్‌ అని చెప్పుకున్నాం కదా. ఇది కూడా చాలావరకు ఆస్టియోకాండ్రోసిస్‌లాగే ఉంటుంది. కానీ ఇందులో టెండెనైటిస్, అపోఫైసైటిస్‌ వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇది మోకాలి చిప్ప వద్ద ఉండే టెండన్‌ను ఎక్కువగా దెబ్బతీస్తుంది. మోకాలి చిన్న కింద చిన్న బుడిపె వంటిది కనిపించవచ్చు. దీన్ని టిబియల్‌ ట్యుబర్కిల్‌ అంటారు. తొడకు సంబంధించిన అతిపెద్ద కండరం అయిన క్వాడ్రసెప్‌ కండరపు  చివరి భాగం... మోకాలి చిప్ప టెండన్‌ ద్వారా మోకాలి కిందనున్న ట్యుబర్కిల్‌కు అంటుకుని ఉంటుంది. మనం తరచూ అదేపనిగా ఏదైనా వ్యాయామమో, శారీరక శ్రమో చేస్తున్నప్పుడు ఆ ట్యుబర్కిల్‌ వద్ద ఉన్న కండరం ఊడినట్లుగా అవుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి ఆ పరిసరాల్లో ఎముక వద్ద, కండరాల వద్ద కాస్తంత పెద్ద  గాయం కావచ్చు. అలాంటప్పుడు పిల్లలు తమ మోకాలిచిప్ప కింది భాగంలో నొప్పిగా ఉందంటూ బాధపడుతుంటారు. అక్కడ కొంత వాపు కూడా కనిపించవచ్చు. చూడటానికి కాస్తంత ప్రమాదకరంగా అనిపించినా... నిజానికి ఇది అంత పెద్ద హానికరం కాని సమస్య. కాస్త విశ్రాంతి తీసుకోవడం, కాలికి శ్రమ ఇవ్వకపోవడం వల్ల ఇది తగ్గిపోతుంది. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ అది చాలా చాలా అరుదు.

పిల్లల్లో పుట్టుకతో వచ్చే కంజెనిటల్‌ సమస్యలు...
కొన్నిసార్లు పిల్లలు పుట్టుకతోనే వెన్నులో కాస్త లోపంతో పుట్టవచ్చు. ఇలాంటి సమస్యను ‘స్పాండిలోలైసిస్‌’ అంటారు. దీనివల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. ఒక్కోసారి పైన ఉన్న వెన్నుపూన తన కింద ఉన్నదానిపైనుంచి జారిపోయి... ముందుకు వెళ్లిపోవచ్చు. అలాంటప్పుడు కూడా పిల్లల్లో వెన్నునొప్పి వస్తుంది. ఈ పరిస్థితిని స్పాండిలోలైస్థెసిస్‌ అంటారు. పిల్లలు లేదా యుక్తవయస్కుల్లో వెన్నునొప్పితో పాటు జ్వరం, మల, మూత్రవిసర్జనలకు సంబంధించిన సమస్యలు ఉంటే మరిన్ని వైద్యపరీక్షలు అవసరమవుతాయి. అలాంటి సమయాల్లో వారిని మరింత నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇక కొందరిలో వెన్ను వంకరగా ఉండే స్కోలియోసిస్‌ అనే సమస్య కూడా వస్తుంది. దీనికి శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.

ఈ తరహా నడుమునొప్పి ప్రమాదకరం కాదు...
అయితే చాలా మంది పిల్లల్లో నిద్రలో నడుం పట్టేసి మర్నాడు వారికి నడుమునొప్పి రావచ్చు. ఇలా వచ్చే నడుమునొప్పి గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. నిద్రలో నడుం పట్టేసి వచ్చే నొప్పికి విశ్రాంతి తీసుకుంటే చాలు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే ఉపశమనం కోసం, డాక్టర్‌ సలహా మేరకు ఒకటి రెండు రోజులు మాత్రమే పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఈ తరహా నడుమునొప్పి విషయంలో జాగ్రత్త...
కొన్ని సందర్భాల్లో లోపల ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉండటం లేదా గడ్డ (ట్యూమర్‌) వల్ల కూడా నడుం నొప్పిరావచ్చు. ఈ తరహా నడుమునొప్పి నిద్రలో పట్టేసినప్పుడు వచ్చే నొప్పిలా ఒకపట్టాన తగ్గదు. ఇలా నొప్పి తగ్గకుండా అదేపనిగా వస్తున్న సందర్భాల్లో తప్పక వైద్య పరీక్షల కోసం ఆర్థోపెడిక్‌ నిపుణుడిని సంప్రదించాలి. అలాంటప్పుడు వైద్యపరీక్షల్లో తేలే అంశాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

పిల్లల్లో వచ్చే చాలా రకాల ఎముకలకు సంబంధించిన నొప్పులు చాలావరకు తాత్కాలికం. వారి ఎదుగుదలకూ, పెరుగుదలకూ చాలావరకు ప్రతిబంధకం కాదు. చిన్నపాటి విశ్రాంతి, ఐస్‌ కాపడం వంటి జాగ్రత్తలతోనే అది తగ్గిపోతుంది. అయితే నొప్పి ఎంతకూ తగ్గనప్పుడు మాత్రం అదేపనిగా కాపడం పెట్టడం, నొప్పి ఉన్నచోట మర్దన చేస్తూనే ఉండటం సరికాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారిలో ఏదైనా తీవ్రమైన సమస్య (లుకేమియా అంటే బ్లడ్‌క్యాన్సర్‌) ఉన్నదానికి కూడా ఎముకల్లో నొప్పి ఒక లక్షణం కావచ్చు. అందుకే పిల్లల్లో నొప్పి వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించి, అది ప్రమాదకరం కాని సాధారణమైన నొప్పేనని నిర్ధారణ చేసుకొని, ఆపైన నిశ్చింతగా ఉండవచ్చు.

ఆటల్లోగాయాలతోనూ ప్రమాదాలు...
తరచూ ఆటల్లో ఎక్కువగా పాల్గొనే పిల్లల్లో పెద్దవాళ్లలాగే గాయాల కావచ్చు. కొన్ని సార్లు బెణుకులు (స్ప్రెయిన్‌), ఎముకలు విరగడం (ఫ్రాక్చర్లు) వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు.  ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు. కాబట్టి వాటిని  మనం ఎలాగూ నివారించలేం. కాకపోతే పిల్లలు పదే పదే ఆటలాడుతూ ఉండటం వల్ల వారిలో చోటు చేసుకునే భౌతిక కార్యకలాపాల (ఓవర్‌ యూజ్‌ ఆక్టివిటీ)ని తగ్గించడం ద్వారా వాటి వల్ల అయ్యే గాయాలను కొంతవరకు నివారించవచ్చు. అందుకే పిల్లలు ఆటలు లేదా వ్యాయామం లేదా స్ట్రెచ్చింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేసే సమయంలో ముందుగా చేయాల్సిన వార్మ్‌–అప్‌ వ్యాయామాలు, అటు తర్వాత చివగా చేయాల్సిన కూలింగ్‌ డౌన్‌ వ్యామామాలు తప్పనిసరిగా చేసేలా చూడాలి. వారి శిక్షణ కార్యక్రమాలను ఆ విధంగా రూపొందించాలి. చిన్నారి అథ్లెట్లలో ఎముకలు అకస్మాత్తుగా పెరిగే గ్రోత్‌ స్పర్ట్‌  (లాగ్‌) దశలో కండరాలకు ఫ్లెక్సిబిలిటీ కలిగించేలా తరచూ మసాజ్‌ చేయడం వంటివి అవసరం. అలాంటి పిల్లలకు ఏవైనా గాయాలైనప్పుడు అవి పూర్తిగా మానేవరకు, ఆ వ్యాయామాన్ని పూర్తిగా ఆపేసి, వారికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

పిల్లల్లో వెన్ను నొప్పి...
ప్రకృతి నియమం ప్రకారం చిన్నపిల్లల్లో వెన్ను నొప్పి రాదు. రానే కూడదు. ఒకవేళ పిల్లల్లో వెన్ను నొప్పి వస్తున్నా లేదా తరచూ కనిపిస్తూ లేదా దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా... ఆ పరిస్థితిని తేలిగ్గా తీసుకోకూడదు. పిల్లలు లేదా టీనేజీలో ఉన్న వారు లేదా అప్పుడే టీనేజీ దాటిన యుక్తవయస్కుల్లోని వారికి వెన్ను నొప్పి వచ్చిందంటే అది వెన్నుపై తీవ్రమైన ఒత్తిడి వల్ల కావచ్చని భావించాలి. ఒక్కోసారి వాళ్లు నిల్చునే లేదా కూర్చునే భంగిమలు సరిగా లేకపోవడం వల్ల కూడా ఇది ఇస్తుంది. సాధారణంగా పూర్తి విశ్రాంతితో ఇలాంటి సమస్యలు చక్కబడతాయి. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఒకటి లేదా అంతకు మంచి వెన్నుపూసల్లో ఏదైనా/ఏవైనా  ఫ్రాక్చర్‌ ఉందేమో చూడాలి.-డాక్టర్‌ కె. సుధీర్‌రెడ్డి,చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్,ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top