అమ్మ నాకు వద్దు

Childens Reject live at Mother - Sakshi

పెళ్లి చేసుకునేటప్పుడు మనిద్దరి నిర్ణయం అనుకుంటారు. విడిపోయేటప్పుడు మనిద్దరి నిర్ణయం అని అనుకోవచ్చా? పిల్లలు ఏమవుతారు? పెద్దయ్యాక ఏమవుతారు? సింగిల్‌ పేరెంట్స్‌గా ఉన్నప్పుడు పిల్లల మనసుల్లో ఏ సుడిగుండాలు చెలరేగుతాయి. ఏ అసంతృప్తులు పెల్లుబికుతాయి. నాన్న లేని ఇంట్లో ఎప్పుడూ అమ్మే కనిపించే ఇంట్లో ఒక కూతురికి అమ్మ మీద కోపం వచ్చింది. అమ్మ వద్దు అనుకుంది. అమ్మ ఏం చేయాలి?

ఆ ఏ.సి గది చల్లగా ఉంది. అడ్వకేట్‌ రఘునాథరావు కళ్లద్దాలు సవరించుకుంటూ అలేఖ్య వైపు చూశాడు. పదిహేనేళ్ల అలేఖ్య స్కూల్‌ యూనిఫామ్‌లో ఉంది. కుర్చీలో కూచుని కాళ్లాడించకుండా కంపోజ్డ్‌గా ఉంది. రఘునాథరావు అలేఖ్యకు దూరపు బంధువు అవుతాడు. ఎప్పుడైనా ఒకసారి వాళ్లింటికి భార్యతో కలిసి వెళుతుంటాడు. కాని ఇలా అలేఖ్య తన దగ్గరికి రావడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. ‘చెప్పు... పాపాయి’ అన్నాడు వాత్సల్యంగా. ‘నాకు అమ్మ వద్దు అంకుల్‌’ అంది అలేఖ్య. ‘ఏంటి?’ అన్నాడు అడ్వకేట్‌. ‘అవును. నాకు అమ్మ వద్దు. ఎలాగూ నాన్న లేడు. ఇప్పుడు అమ్మ కూడా లేదనుకుంటాను. నాకు ఎవరినైనా ఒక గార్డియన్‌ని పెట్టండి. అలాగే నాకు రావల్సిన ప్రాపర్టీ కూడా మా అమ్మ నుంచి, నాన్న నుంచి ఇప్పించి ఆ గార్డియన్‌ కింద పెట్టండి.

నేను ఒక్కదాన్నే ఏదైనా హోమ్‌లో ఉండి చదువుకుంటాను. మీరు లీగల్‌గా ఏం చేయాలో ఆలోచించి నాకు హెల్ప్‌ చేయండి’ అంది. రఘునాథరావు చాలా ఆశ్చర్యపోయాడు. అలేఖ్యది బాలచేష్ట కాదని తెలుస్తోంది. ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్‌. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉంటుంది. పుస్తకాలు చదువుతుంది. న్యూస్‌పేపర్‌ ఫాలో అవుతుంది. వయసుకు మించిన ఆలోచనలతో ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి మాటను తీసి పడేయడానికి సంకోచంగా ఉంది. ‘నేను ఆలోచించి చెప్తానులే పాప’ అన్నాడు. ‘థ్యాంక్యూ’ అని లేచింది అలేఖ్య. ‘ఆగు’ అని తన ర్యాక్‌లో ఉన్న చాక్లెట్లు తీసి అలేఖ్య చేతిలో పెట్టి తల మీద ముద్దుగా అరచేతితో రెండుసార్లు తట్టాడు. ‘జాగ్రత్తగా వెళ్లు’ అని పంపిస్తూ అలేఖ్య తల్లి విజయరేఖతో మాట్లాడటానికి ఫోనందుకున్నాడు.
∙∙∙
‘ఇన్నాళ్లు ఎప్పుడూ అలేఖ్య పేచీ పెట్టలేదు బాబాయ్‌. కాని ఒక పది రోజులుగా నాన్నను చూడాలి.. నాన్నను చూడాలి అని అడగడం మొదలుపెట్టింది. మనం హైదరాబాద్‌లో ఉంటాం.. మీ నాన్న వైజాగ్‌లో ఉంటాడు... తర్వాత కలుద్దువుగానీ అన్నా వినలేదు. అసలే టెన్త్‌కి వచ్చింది. ఈ కోరిక తీరకపోతే ఏం చేస్తుందో అని అదో భయం. మేం లీగల్‌గా విడిపోయి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఒక్కసారి కూడా అతనితో మాట్లాడింది లేదు. అతడు మా కోసం వచ్చింది లేదు. ఇప్పుడు ఈ కొత్త కాంటాక్ట్‌ ఏమవుతుందో... వెళ్లి కలిశాక ఎలా మారిపోతుందో అని భయపడ్డాను. భయపడ్డట్టే జరిగింది. మా తమ్ముడి చేత అతనికి కబురు పెట్టిస్తే నిన్న ఫ్లయిట్‌లో వచ్చి అలేఖ్య స్కూల్‌కు వెళ్లి రెండు గంటలు మాట్లాడి వెళ్లాడట. ఇంటికొచ్చాక ఏం మాట్లాడుకున్నారు అని అడిగితే ఏమీ చెప్పలేదు. రాత్రంతా ముభావంగా ఉంది. ఇవాళ మీ దగ్గరికి వచ్చినట్టుంది’ అంది విజయరేఖ, రఘునాథరావుతో. ‘ఇప్పుడు ఎలాగమ్మా... నీ కూతురు చాలా మొండిపిల్ల’ అన్నాడు రఘునాథరావు. ‘అదే నాకు ఏం అర్థం కావడం లేదు బాబాయ్‌’ అని కళ్లనీళ్లు పెట్టుకుంది విజయరేఖ.

ఆ రోజు రాత్రి విజయరేఖ కూతురిని రెట్టించి అడిగింది– ‘మీ నాన్న నా గురించి ఏమైనా చెడుగా చెప్పాడా?’ ‘ఊహూ’ అంది అలేఖ్య. ‘నేనేమైనా రాక్షసిని అన్నాడా?’ ‘ఊహూ. అసలు నీ గురించే మాట్లాడలేదు. తన గురించి మాట్లాడాడు. నా గురించి అడిగాడు అంతే’ ‘మరి అడ్వకేటంకుల్‌ దగ్గరకు వెళ్లి నేను వద్దన్నావట’ ‘అవును. అన్నాను. నువ్వు నాకు వద్దు’ ‘పాపా’ ‘వద్దంటే వద్దు’ అటు తిరిగి పడుకుంది.

అలేఖ్యకు ఐదారేళ్లు ఉన్నప్పుడు విజయరేఖ, సుమన్‌ విడిపోయారు. విజయరేఖ హైదరాబాద్‌లో ఉండిపోయింది. సుమన్‌ తన సొంత ఊరు వైజాగ్‌ వెళ్లిపోయాడు. కూతురిని తన దగ్గరే ఉంచుకుంది విజయరేఖ. ఆ తర్వాత ‘రైట్‌ ఆఫ్‌ యాక్సెస్‌’ తండ్రికి ఉన్నా విజయరేఖ పెద్దగా ఎంకరేజ్‌ చేయలేదు. కూతురు ఇప్పుడు పెద్దదయ్యింది. తన మీద తిరగబడుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తండ్రిని కలిసి, అడ్వకేట్‌ను కలిశాక అలేఖ్య రాను రాను తల్లితో పొడిపొడిగా వ్యవహరించసాగింది. ఎక్కువగా ఫ్రెండ్స్‌తో ఉంటోంది. ఎమ్‌సెట్‌లో మంచి ర్యాంక్‌తో హైదరాబాద్‌లోనే మంచి కాలేజీలో చేరిన అలేఖ్య ఫైనలియర్‌ వచ్చేసరికి అసలు చదవనే చదవను అనేదాకా వెళ్లి ఇంట్లో కూచుంది. తల్లికి ఇక వేదన తట్టుకోలేకపోయింది. అలేఖ్యను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లి, డాక్టర్‌కు విషయం చెప్పి, తను బయట కూచుంది కూతురు ఓపెన్‌ కావడానికి.

‘చెప్పమ్మా... మీ అమ్మ నీకు ఎందుకు వద్దు’ అడిగాడు సైకియాట్రిస్ట్‌. ‘డాక్టర్‌. నేను నాన్నను మిస్సవుతున్నాను. స్కూల్లో అందరూ నాన్నెక్కడా.. నాన్నెక్కడా అని అడుగుతుండేసరికి ఉన్న అమ్మను చూపలేక చాలా ఎంబరాసింగ్‌గా ఫీలయ్యేదాన్ని. చిన్నప్పుడు అర్థం కాలేదు. టెన్త్‌ వచ్చేసరికి నాన్నను కలవాలన్న కోరిక పెరిగింది. కలిశాను. నాన్న అమ్మ గురించి చెడ్డగా మాట్లాడలేదు. కాని నాన్న చాలామంచివాడని నాన్నతో గడిపిన రెండు గంటల్లో నాకు తెలిసింది. అమ్మ, నాన్న విడివిడిగా మంచివాళ్లు కావచ్చు. కాని వారు ఒకరికి ఒకరు చెడ్డవాళ్లై నాకు చెడ్డ జీవితం ఇచ్చారు. నాన్న ప్రేమ, వాత్సల్యం తీవ్రంగా మిస్‌ కావడం నాకు నచ్చలేదు. నా కోపం ఎవరి మీద చూపించాలి. అమ్మ మీదే చూపించాను. నాకు ఫాదర్‌ ఫిగర్‌ కావాలని గార్డియన్‌ని పెట్టమని కోరుతున్నాను. ఒక తండ్రిలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలని నేను కోరుకోవడం తప్పా?’ అంది అలేఖ్య. ‘తప్పు కాదమ్మా. కాని నీ తల్లిని తప్పు అనుకోవడమే తప్పు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. అలేఖ్య డాక్టర్‌ వైపు చూసింది.

‘మీ అమ్మ ఇప్పుడు కూడా వయసులో ఉంది. కాని పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకునే హక్కు ఆమెకుంది. కాని నీ కోసం ఆగిపోయింది. ఆమె వర్కింగ్‌ ఉమన్‌. జాబ్‌ చేస్తూ నీ గురించి కేర్‌ తీసుకుంటూ ఎన్ని అవస్థలు పడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? డివోర్స్‌ అనేది పురుషుని కంటే స్త్రీ మీదే ఎక్కువ వొత్తిడి తెస్తుంది సంఘపరంగా. మీ నాన్న వైజాగ్‌లో తన మానాన తాను జీవిస్తున్నాడు. కాని ఎమోషనల్‌ బర్డన్‌ అంతా మీ అమ్మే కదా మోసింది. దగ్గరలేని వ్యక్తిలోని మంచి  చూడటానికి ఉన్న వ్యక్తిలోని చెడును వెతుకుతున్నావు నువ్వు. మీ అమ్మ నిన్ను అమ్మలా చూసుకుంది... నాన్నలా బాధ్యతలూ నెరవేరుస్తోంది. అది చూడు ఆమెలో. నువ్వు చదువు డిస్కంటిన్యూ చేశావు. ఫస్ట్‌ నువ్వు చదువులో పడు. చదువు పాడైతే ఆ కోపం పూర్తిగా మీ అమ్మ మీద మళ్లుతుంది. నిన్ను కనడమే ఆమె తప్పు అన్నట్టుగా నువ్వు వేదన కలిగిస్తే ఎలా చెప్పు?’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. అలేఖ్య తల వొంచుకుంది.

‘మీ అమ్మ మీ నాన్నతో ఉండి ఘర్షణ పడటం కంటే నీతో ఉండి జీవితాన్ని ఎదుర్కొనడం మేలని తలచింది. భార్యాభర్తలు విడాకుల దాకా వెళ్లారంటే లక్ష కారణాలుంటాయి. ఇరు పక్షాలా తప్పు ఉంటుంది. మీ తల్లినే బాధ్యురాలిని చేస్తే ఎలా? ఇక గార్డియన్‌ సంగతి. అతడెవరో ఎలాంటి వాడో ఎలా బిహేవ్‌ చేసి కొత్త తలనొప్పులు తెస్తాడో ఊహించగలవా? నువ్వే ఆలోచించు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. సైకియాట్రిస్ట్‌తో మాట్లాడాక తల్లి మరింతగా అర్థమైంది అలేఖ్యకి. బయటికొచ్చి మౌనంగా తల్లిపక్కన కూచుంది. కళ్ల నిండా నీటితో చూసిన తల్లికి దగ్గరగా జరిగి, ఆమె గుండెలకు తల ఆనించింది. అమ్మ ఆమెను దగ్గరకు తీసుకుంది. జీవితం మళ్లీ ఒకసారి ఆ ఇరువురిని కలిసి ముందుకు సాగే అవకాశం కల్పించింది.

‘చెప్పమ్మా... మీ అమ్మ నీకు ఎందుకు వద్దు’ అడిగాడు సైకియాట్రిస్ట్‌. ‘డాక్టర్‌. నేను నాన్నను మిస్సవుతున్నాను. స్కూల్లో అందరూ నాన్నెక్కడా.. నాన్నెక్కడా అని అడుగుతుండేసరికి  చాలా ఎంబరాసింగ్‌గా ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు నాకు నాన్నలాంటి ఒక వ్యక్తి కావాలనిపిస్తోంది’’ అంది అలేఖ్య.

– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top