చాట్‌ చేద్దామా

Chat specials - Sakshi

మాట్లాడే అవకాశం అస్సలు లేదు. అయినా తింటూ మాట్లాడటం తప్పు కదా! ఇంట్లో ఈ చాట్‌ చేసుకుంటే బాగుంది... బహు బాగుంది... అని చెప్పుకోవడానికి మాటల్లేవ్‌... మాట్లాడుకోవడాల్లేవ్‌! చాట్‌ చేసుకుందాం!

స్వీట్‌ పొటాటో చాట్‌
కావలసినవి : చిలగడ దుంపలు – పావు కేజీ; మిరియాల పొడి – పావు టీ స్పూను; ఆమ్‌చూర్‌ పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత

తయారీ : చిలగడదుంపలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, తొక్క తీసి, ముక్కలుగా కట్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి
మిరియాల పొడి, ఆమ్‌చూర్‌ పొడి, ఉప్పు జత చేయాలి (ఇష్టపడేవారు మిరపకారం, చాట్‌ మసాలా కూడా జత చేసుకోవచ్చు)
 నిమ్మరసం జత చేసి జాగ్రత్తగా కలిపి వెంటనే అందించాలి.

ఫ్రూట్‌ చాట్‌
కావలసినవి : ఆపిల్‌ ముక్కలు – అర కప్పు; అరటి పండు ముక్కలు – ఒక కప్పు; సపోటా పండు ముక్కలు – ఒక కప్పు; బొప్పాయి ముక్కలు – ఒక కప్పు; డ్రైఫ్రూట్స్‌ – పావు కప్పు (జీడిపప్పు, వాల్నట్, బాదం పప్పులు...); పుదీనా ఆకులు – అలంకరణకు తగినన్ని; చాట్‌ మసాలా – టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; స్వీట్‌ చట్నీ – టేబుల్‌ స్పూను

తయారీ : ఒక పాత్రలో ఆపిల్‌ ముక్కలు, అరటి పండు ముక్కలు, సపోటా ముక్కలు, బొప్పాయి ముక్కలు వేసి కలపాలి
స్టౌ మీద బాణలిలో డ్రైఫ్రూట్స్‌ను నూనె లేకుండా వేయించి తీసి, పండ్ల ముక్కల మీద వేశాక, చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, స్వీట్‌ చట్నీ వేయాలి  చివరగా పుదీనా ఆకులతో అలంకరించి వెంటనే అందించాలి.

పాలక్‌ చాట్‌
కావలసినవి : పాలకూర – 3 కప్పులు; సెనగ పిండి – అర కప్పు; పసుపు – చిటికెడు; ఇంగువ – చిటికెడు; మిరప కారం – చిటికెడు; సోంపు – చిటికెడు; వాము – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; బియ్యప్పిండి – ఒక టేబుల్‌ స్పూను; నీరు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
చాట్‌ కోసం
ఉల్లి తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; పెరుగు – చిన్న కప్పు; గ్రీన్‌ చట్నీ – చిన్న కప్పు; స్వీట్‌ చట్నీ – చిన్న కప్పు; సేవ్‌ – తగినంత; మెత్తగా పొడి చేసిన పూరీలు లేదా పాపడ్‌ – అర కప్పు; దానిమ్మ గింజలు – పావు కప్పు; చాట్‌ మసాలా – తగినంత; గసగసాలు – కొద్దిగా; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు

తయారీ : పాలకూరను శుభ్రంగా కడిగి, తడి పోయే వరకు పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి
ఒక పాత్రలో సెనగ పిండి, పసుపు, ఇంగువ, మిరప కారం, జీలకర్ర పొడి, గసగసాలు, ఉప్పు వేసి బాగా కలపాలి
తగినన్ని నీళ్లు జత చేసి మిశ్రమాన్ని బజ్జీల పిండిలా కలపాలి
స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పాలకూరను సెనగపిండి మిశ్రమం లో ముంచి బజ్జీల మాదిరిగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి.

పాలక్‌ చాట్‌ తయారీ
సర్వింగ్‌ ప్లేట్లలో పాలక్‌ పకోడీలు వేసి, వాటి మీద గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ వేయాలి
పైన ఉల్లితరుగు, పెరుగు వేయాలి
తగినంత చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, మిరప కారం, ఉప్పు పైన చల్లాలి
చివరగా సేవ్, పాపడ్‌ పొడి వేసి, కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలతో అలంకరించి ఆలస్యం చేయకుండా అందించాలి.

ఇడ్లీ చాట్‌
కావలసినవి : ఇడ్లీలు – 10; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; పుదీనా + కొత్తిమీర చట్నీ – 2 టేబుల్‌స్పూన్లు; స్వీట్‌ చట్నీ – 2 టేబుల్‌ స్పూన్లు; బూందీ – ఒక టేబుల్‌ స్పూను; మిరప కారం – చిటికెడు; చాట్‌ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – కొద్దిగా; సన్నటి సేవ్‌ – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – పావు కప్పు

తయారీ : ఇడ్లీలను కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్‌ చేయాలి
స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇడ్లీ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి
ఉల్లి తరుగు, టొమాటో తరుగు జత చేయాలి
ఇడ్లీ ముక్కల మీదుగా పడేలా పెరుగు వేయాలి
పుదీనా + కొత్తిమీర చట్నీ, స్వీట్‌ ^è ట్నీలను వీటి మీద వేయాలి
సేవ్, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా పైన చల్లాలి
కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి.

కార్న్‌ చాట్‌
కావలసినవి :  మొక్కజొన్న గింజలు – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; చాట్‌ మసాలా – టీ స్పూను; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; సేవ్‌ (సన్న కారప్పూస) – తగినంత
తయారీ: మొక్కజొన్న గింజలను కుకర్‌లో ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి
 గింజలు చల్లారాక ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, మిరపకారం, చాట్‌ మసాలా, నిమ్మరసం, ఉప్పు జత చేసి బాగా కలపాలి
 మిశ్రమాన్ని చిన్న పాత్రలలోకి తీసుకుని, పైన సేవ్‌ వేసి వేడివేడిగా అందించాలి.

మూంగ్‌ స్ప్రౌట్స్‌ చాట్‌
కావలసినవి:
పెసర మొలకలు – 2 కప్పులు; ఉల్లి తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; టొమాటో తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు టీ స్పూను; చాట్‌ మసాలా – టీ స్పూను; నిమ్మరసం – టీ స్పూను; ఉడికించిన బంగాళదుంప పెద్దది – 1; స్వీట్‌ చట్నీ – 2 టేబుల్‌ స్పూన్లు; గ్రీన్‌ చట్నీ – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర – అలంకరించడానికి తగినంత; నల్ల ఉప్పు – తగినంత; సేవ్‌ – 4 టేబుల్‌ స్పూన్లు; అప్పడాలు – 6 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)

తయారీ:పెసలను ముందురోజు రాత్రి నానబెట్టి, ఉదయాన్నే నీళ్లన్నీ ఒంపేసి, గాలి తగిలేలా ఉంచితే మరుసటి రోజుకి మొలకలు వస్తాయి
పెసలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, పెసలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి
పైన చెప్పిన పదార్థాలను (అప్పడాలు, నిమ్మరసం, సేవ్‌ మినహా) పెసలకు జత చేయాలి
నిమ్మరసం వేసి కలపాలి  కొత్తిమీర తరుగు, సేవ్‌ వేసి, చివరగా పైన  అప్పడాల ముక్కలతో అలంకరించి అందించాలి.

చైనీస్‌ భేల్‌
కావలసినవి :
నూడుల్స్‌ – 75 గ్రా.; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; కార్న్‌ ఫ్లోర్‌ – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; నూనె – 2 టీ స్పూన్లు; క్యాబేజీ తరుగు – అర కప్పు; క్యారట్‌ తురుము – పావు కప్పు; క్యాప్సికమ్‌ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల తరుగు – పావు కప్పు; గ్రీన్‌ చిల్లీ సాస్‌ – ఒక టేబుల్‌ స్పూను; స్వీట్‌ చట్నీ – 2 టేబుల్‌ స్పూన్లు; సోయా సాస్‌ – అర టేబుల్‌ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; ఉల్లికాడల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; టొమాటో తరుగు – పావు కప్పు; వేయించిన పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్లు; చాట్‌ మసాలా – పావు టీ స్పూను; ఉప్పు – కొద్దిగా; కొత్తిమీర – టేబుల్‌ స్పూను
గార్నిషింగ్‌ కోసం..
ఉల్లికాడల తరుగు – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌స్పూను
తయారీ :  వెడల్పాటి పాత్రలో మూడు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి
రెండు మూడు చుక్కల నూనె జత చేయాలి
నీళ్లు బాగా మరిగాక, నూడుల్స్‌ జత చేసి ఫోర్క్‌తో కలిపి, కొద్దిగా ఉడికిన తరవాత దింపేసి, నీళ్లు ఒంపేసి, నూడుల్స్‌ను చన్నీళ్లలో రెండు మూడు సార్లు జాడించినట్లుగా కడిగి, పెద్ద పళ్లెంలో ఆరబోసి, సమానంగా పరిచి రెండు గంటలపాటు ఆరనివ్వాలి
ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల కార్న్‌ ఫ్లోర్‌ను నూడుల్స్‌ మీద వేసి బాగా కలపాలి
స్టౌ మీద బాణలిలో నూనె కాగాక నూడుల్స్‌ను కొద్దికొద్దిగా వేస్తూ డీప్‌ఫ్రై చేసి, బంగారు వర్ణంలోకి వచ్చాక, ప్లేట్‌లోకి తీసుకోవాలి
ఒక పెద్ద పాత్రలో వేయించిన నూడుల్స్‌ను ముక్కలు చేసి వేసుకోవాలి
బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె కాగాక, పావు కప్పు ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి
అర కప్పు క్యాబేజీ తరుగు, పావు కప్పు క్యారట్‌ తరుగు, పావు కప్పు క్యాప్సికమ్‌ తరుగు జత చేసి వేయించాలి
  గ్రీన్‌ చిల్లీ సాస్, స్వీట్‌ చట్నీ, సోయా సాస్‌ వేసి బాగా కలపాలి
మిరియాల పొడి, ఉప్పు జత చే సి బాగా కలిపి దింపేయాలి
ఉల్లికాడల తరుగు వేసి కలపాలి
అన్ని రకాల కూరగాయ ముక్కలు జత చేయాలి
టొమాటో తరుగు, వేయించిన పల్లీలు జత చేసి కలపాలి
చాట్‌ మసాలా, కొద్దిగా ఉప్పు జత చేయాలి  కొత్తిమీర తరుగు, టేబుల్‌ స్పూను ఉల్లికాడల తరుగు జత చేసి కలపాలి
కొద్దిగా నిమ్మరసం జత చేసి, అన్నీ బాగా కలిపి అందించాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top