ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో హ్యుందయ్ ఐ20లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్‌కు.. భారత్‌లోని జైషే మహమ్మద్ నెట్‌వర్క్ స్థాపించేందుకు చేసే ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ఉగ్రవాది డాక్టర్ షాహిన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో పాటు ఇతర ఉగ్రకుట్రకు సంబంధింత అంశాల్లో అనుమానాస్పద వ్యక్తులతో చేసిన చాటింగ్, అందుకు ఉపయోగించిన కోడ్ సైతం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ పేలుడు ఘటనతో పాటు జైషే మహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో డాక్టర్ షాషిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు ఆమె కదలికలు, ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డాక్టర్ షాహిన్ ఫోన్ నుంచి సేకరించిన వాట్సప్‌లో కీలక ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు.
మేడమ్ X,మేడమ్ Z
వాటిల్లో మేడమ్ X,మేడమ్ Z పేరుతో సేవ్ చేసిన మహిళలతో షాషిన్ మాట్లాడినట్లు తేలింది. అదే సమయంలో ఈ రెండు నంబర్ల నుండి డాక్టర్ షాహీన్‌కు క్రమం తప్పకుండా కాల్స్, మెసేజ్‌లు వచ్చేవి. ఆ మెసేజ్‌లలో ‘మెడిసిన్’ అనే పదం ఎక్కువగా ఉపయోగించినట్లు,.. మెడిసిన్ అంటే పేలుడు పదార్థాలేనని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ప్రకారం మెడిసిన్ అంటే వేరేదేమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఓ మెసేజ్‌లో మేడమ్ X నుంచి షాహిన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ‘ఆపరేషన్‌కు ఔషధం కొరత ఉండకూడదు’ అని ఉంది.
‘హమ్దర్ద్’ అంటే
ఇంకొక మెసేజ్‌లో మేడమ్ జెడ్ ‘మేడమ్ సర్జన్, ఆపరేషన్ హమ్దర్ద్‌పై మరింత శ్రద్ధ పెట్టండి’అని పేర్కొనడం గమనార్హం.‘ఆపరేషన్ హమ్దర్ద్’ అనేది మహిళా ఉగ్రవాదులను నియమించేందుకు రూపొందించిన ప్రణాళికగా గుర్తించారు. ‘హమ్దర్ద్’ అంటే ఉర్దూలో సానుభూతి పరులని సమాచారం.
డాక్టర్ షాషీన్ లక్నోలోని లాల్ బాగ్ నివాసి. పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి నాయకత్వం వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 2001లో పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ ఈ ముఠాను నడిపినట్టు సమాచారం.
కాగా, షాహీన్ గతంలో కాన్పూర్ మెడికల్ కాలేజ్లో ఫార్మకాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. అనంతరం ఆమె కన్నౌజ్ మెడికల్ కాలేజీకు బదిలీ అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కు గంటల ముందు ఉమర్ మహ్మద్ హ్యూందయ్ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకున్నాడు.


