మనది కానిది 

Buddha moves along with his disciples across a farm - Sakshi

చెట్టు నీడ

తెల్లవారగనే ఆ అధికారి, దొంగల్ని వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని నాణేల్ని లెక్కబెట్టుకుంటూ కనిపించాడు.

ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలసి ఒక పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు. దారిలో ఒక చెట్టు పక్కన ఒక భిక్షువుకి ఒక డబ్బు మూట కనిపించింది. ఆ భిక్షువు –‘‘భగవాన్‌! ఇదిగో ధనం మూట’’ అని చూపించాడు.  ‘‘నాయనా! అది ఒక కాలసర్పం లాంటిది. దాని జోలికి వెళ్లొద్దు. ఇటు వచ్చేయ్‌’’అని వెళ్లిపోయాడు. మిగిలిన భిక్షువులు ఆ మూటకి కాస్త దూరం జరుగుతూ ఆయన వెంట వెళ్లిపోయారు. కొద్దిదూరంలో ఉన్న ఒక బాటసారి ఈ తతంగం అంతా చూస్తున్నాడు.  ‘‘ఈ భిక్షువులకు అక్కడ పామేదో కనిపించినట్లుంది. ఉట్టి పిరికివాళ్లలా ఉన్నారు. అంతమంది ఉండి కూడా దానిని ఏమీ చేయలేక తప్పుకుని పారిపోతున్నట్లున్నారు’’అనుకుంటూ అక్కడికి వచ్చాడు.  తీరా వచ్చి చూస్తే అక్కడ డబ్బు మూట ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని– ‘ఆ భిక్షువులు పిరికివాళ్లే కాదు వెర్రిబాగులవాళ్లలాగున్నారు.లేకపోతే డబ్బు మూటను చూసి పాముని చూసినట్టు పరుగు పెడుతున్నారు’ అనుకుంటూ మూట విప్పి డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు.

నిజానికి అసలు జరిగిందేమిటంటే.. ఆ ముందు రోజు రాత్రి రాజు కొలువులో పని చేసే ఒక అధికారి ఇంట్లో దొంగలు పడి, ఎన్నో కుండల కొద్దీ ధనాన్ని దోచుకుపోతూ... దారిలో ఉన్న ఈ చెట్టుకింద కూర్చుని మూటల్ని లెక్కపెట్టుకున్నారు. అప్పుడు ఆ చీకట్లో ఒక మూట జారి పక్కన పడిపోయింది. అది గమనించకుండా వారు వెళ్లిపోయారు. తెల్లవారగనే ఆ అధికారి, దొంగల్ని వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని నాణేల్ని లెక్కబెట్టుకుంటూ కనిపించాడు. ఇతడే దొంగతనం చేసి ఉంటాడని భావించి, ఆ బాటసారిని తన్ని, రాజుగారి దగ్గరకు లాక్కుపోయాడు. ఇదీ కథ. 
పరుల సొమ్ము పాము వంటిది– అనే నానుడి ఇలా పుట్టింది. అందుకే బుద్ధుడు ‘ఇతరులు ఇవ్వకుండా నీకు దొరికింది కూడా నీది కాదు. అదీ ఒక రకంగా దొంగతనమే’ అని తన శిష్యులకు చెప్పాడు. అంటే ‘నీ శ్రమ కానిది నీది కాదు. మరొకరు దానంగా ఇవ్వనిదేదీ నీది కాదు’ అని దాని అర్థం. 
– బుద్ధుని ‘పంచశీల’ నుంచి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top