బ్రెయిన్‌ ట్యూమర్‌ అని చెప్పారు..

 Brain Controls All The Organs Of The Persons Body - Sakshi

మా నాన్నగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య తరచూ కాళ్లూ–చేతులు తిమ్మిర్లెక్కుతున్నాయని విపరీతంగా బాధపడుతున్నారు. ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఏ పని మీదా దృష్టిపెట్టలేకపోతున్నారు. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో విజయవాడ పెద్దాసుపత్రిలోని ‘న్యూరో’ డాక్టరుకు చూపించాం. వారు పరీక్షలన్నీ చేసి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకొమ్మని చెప్పారు. ఆ కుటుంబంలో అందరమూ బెంగపడుతున్నాం. బ్రెయిన్‌ సర్జరీ అంటే ప్రాణాపాయం ఉంటుందని, ఏవైనా అవయవాలు కోల్పోవచ్చని చెబుతున్నారు.

కొద్దికాలం కిందట ‘బ్రెయిన్‌ ట్యూమర్‌’కు ఏదో శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చిందని, అది చాలా సురక్షితమని, అవయవాలు పనిచేయకుండా పడిపోయే పరిస్థితి రాదనే విషయాన్ని తాను పేపర్లో చదివానని ఒక ఫ్రెండ్‌ చెప్పాడు. అంతకు మించి వివరాలేమీ ఇవ్వలేకపోయాడు. అదేం సర్జరీయో వివరంగా చెప్పండి. అది ఖరీదైనదేమోననే ఆందోళన కూడా ఉంది. ఈ సర్జరీలోని రిస్క్‌ ఏమిటో, ఫలితాలెలా ఉంటాయో కూడా దయచేసి వివరించండి.

మీరు లేఖలో రాసినదాన్ని బట్టి చూస్తే... బహుశా మీ ఫ్రెండ్‌ ‘ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ’ గురించి పేపర్లో చదివి ఉంటారు. అదే విషయాన్ని మీకు చెప్పి ఉంటారు. మెదడులో గడ్డలు అనేక సమస్యలు తెచ్చిపెడతాయి. తలనొప్పి మొదలుకొని... శరీరంలోని వివిధ అవయవాల పనితీరు దెబ్బతీసేలా చేయడం వరకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అవయవాలు పనిచేయకపోవడం లాంటి తీవ్రమైన పరిణామాలు తలెత్తితే అది ఆ వ్యక్తి జీవననాణ్యతపై ప్రభావం చూపడంతో పాటు, తన సాధారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.ఇక ఈ అధునాతన సర్జరీ విషయానికి వస్తే... ఇందులో మంచి కచ్చితత్వం ఉంటుంది. ఈ ఇంట్రా ఆపరేటివ్‌ 3టి ఎమ్మారై (ఐఎమ్మారై) శస్త్రచికిత్స ప్రక్రియలో మళ్లీ మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం రాకుండా గడ్డలను సమూలంగా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. దీని సహాయంతో సర్జన్లు కేంద్రనాడీమండలం (సీఎన్‌ఎస్‌)లో ఏర్పడే గడ్డలను మూలాల వరకు గుర్తించి కూకటివేళ్ల నుంచి తొలగించడానికి వీలవుతుంది.

ఒక వ్యక్తి శరీరంలోని అన్ని అవయవాలను మెదడు నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే మెదడుకు శస్త్రచికిత్సలంటే అది ఏ అవయవాన్నైనా దెబ్బతీస్తుందేమోననే ఆందోళన ఉండటం సహజమే. అయితే ఆధునిక న్యూరోసర్జరీ వైద్యవిభాగంలో మైక్రోస్కోప్‌లు ప్రవేశించడం వల్ల ఇప్పుడు అవే శస్త్రచికిత్సలను చాలా సురక్షితమైన రీతిలో చేయడం సాధ్యమవుతుంది. సాధారణంగానైతే సర్జన్‌ మైక్రోస్కోప్‌ ద్వారా లోనికి చూస్తూన్నప్పుడు మెదడులోని భాగాలను ఊహించగలడు గానీ... లోపలి భాగాల్లోకి ప్రవేశించడం కష్టంగానూ, ప్రమాదాలతో కూడుకున్న రిస్కీ పనిగానూ ఉంటుంది. అయితే మనం సాధారణంగా వాడే జీపీఎస్‌లాగే... ఈ ఆపరేషన్‌లోనూ ముందుగానే న్యూరోనావిగేషన్‌ పద్ధతి ద్వారా మెదడులోని అంతర్గత భాగాలనూ విస్పష్టంగా గుర్తించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. నిమ్‌ ఎక్లిప్స్‌ వంటి ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరోమానిటరింగ్‌ను ఉపయోగించుకొని, మెదడులోని ఫంక్షనల్‌ ప్రాంతాలను... అంటే ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాలను గుర్తించి, శస్త్రచికిత్స సమయంలో వాటికి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉంది.

మామూలుగానైతే శస్త్రచికిత్స చేస్తున్న ప్రదేశాన్ని ఒక మైక్రోస్కోపు... న్యూరోనావిగేషన్‌తో కలిసి కొన్ని భాగాలను కాంతిమంతంగా చూపించగలగుతుంది. కానీ అది మెదడులోని సాధారణ, అసాధారణ కణాల మధ్య వ్యత్యాసాన్ని చూపించలేదు. దాంతో కొన్ని రకాల గడ్డలను మైక్రోస్కోప్‌ కింద చూసినప్పుడు అవి కూడా మెదడు కణజాలంలాగే కనిపిస్తాయి. ఈ సమస్యను ఎదుర్కోవడంలో న్యూరో నావిగేషన్‌ సదుపాయం కొంతవరకు సహాయపడుతుంది. అయితే మెత్తని కణజాలంతో కూడిన మెదడు... సర్జరీ సమయంలో స్థిరంగా ఉండదు. కదలికలకు (షిఫ్ట్స్‌కు) గురవుతుంటుంది. దీనివల్ల శస్త్రచికిత్స ప్రారంభానికి ముందు న్యూరోనావిగేషన్‌ ద్వారా అందిన చిత్రాలు... ఆపరేషన్‌ కొనసాగించే సమయంలో అంతగా ఉపయోగపడవు. అందువల్ల స్పష్టత లేకుండానే తమ ఊహమేరకు సర్జన్లు శస్త్రచికిత్స కొనసాగించాల్సి రావడంతో చాలా సందర్భాల్లో మెదడులోని గడ్డలో కొంతభాగం అలాగే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయిన ఆ భాగం మళ్లీ పెద్ద గడ్డగా పెరిగేందుకు అవకాశం ఉంది.

ఈ కారణంగానే మెదడు గడ్డల తొలగింపు ఆపరేషన్లలో చాలా సందర్భాల్లో మళ్లీ మళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇలాంటి పరిస్థితిని నివారించడంలో  ఇంట్రా ఆపరేటివ్‌ ఎమ్మారై కీలక పాత్ర పోషిస్తుంది. శస్త్రచికిత్స సమయంలో మెదడు కదిలిపోయే పరిస్థితిని ఎప్పటికప్పుడు అది తెలియజేస్తూ ఉంటుంది. శస్త్రచికిత్స కొంత పూర్తయిన తర్వాత ఇంకా గడ్డ భాగం ఏదైనా మిగిలి ఉందా, దాని అంచులు ఎంతమేరకు విస్తరించి ఉన్నాయి... వంటి అంశాలను అది స్పష్టంగా చూపిస్తుంటుంది. అందువల్ల ఈ సౌకర్యాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయించుకుంటే మళ్లీ మళ్లీ మెదడు సర్జరీలు చేయించాల్సిన అవసరం రాదు. మొత్తం ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాకపోతే కాస్తంత సమయం ఎక్కువగా పడుతుందంతే.

ఈ ఎమ్మారై ఎలా సహాయపడుతుందంటే...
ఎమ్మారై (మాగ్నెటిక్‌ రిజొనెన్స్‌ ఇమేజింగ్‌) సహాయంతో మన శరీర అంతర్భాగాల్లోని అవయవాలను స్పష్టమైన చిత్రాలుగా తీయవచ్చన్న విషయం తెలిసిందే కదా. ఇప్పటివరకూ బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధిగ్రస్తుల్లో శస్త్రచికిత్సకు ముందుగా ఈ ఎమ్మారై పరీక్ష చేస్తుంటారు. ఆపరేషన్‌ నిర్వహించాక... రెండో రోజున పేషెంట్‌ను మళ్లీ ఎమ్మారై గదికి తరలించి, మరోసారి పరీక్ష చేసి, ట్యూమర్‌ను ఏ మేరకు తొలగించామని పరిశీలిస్తుంటారు. ట్యూమర్‌ ఇంకా కొంత మిగిలి ఉన్నట్లు గమనిస్తే... మళ్లీ సర్జరీ చేస్తారు. దీంతో ట్యూమర్‌ మొత్తాన్ని తొలగించడానికి... ఈ విధంగా చాలాసార్లు సర్జరీలు చేయాల్సి వస్తుంటుంది. అదే ‘ఇంట్రా ఆపరేటివ్‌ ఎమ్మారై’ శస్త్రచికిత్స సమయంలోనే స్కాన్‌ను నిర్వహిస్తూ ఉంటే... ఇక్కడికక్కడే అప్పటికప్పుడే  శస్త్రచికిత్సలో అవసరమైన మార్పులు చేయడానికి వీలవుతుంది. అంటే దీనిద్వారా పదే పదే సర్జరీలు చేయాల్సిన అగత్యం తప్పుతుందన్నమాట.


ఈ తరహా శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఇంట్రా ఆపరేటివ్‌ ఎమ్మారైను సర్జన్లకు అందుబాటులో ఉంచే విధంగా ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రత్యేకంగా రూపొందించాల్సింటుంది. దీనికి తోడుగా మైక్రోస్కోప్, న్యూరోనావిగేషన్‌ వ్యవస్థలనూ ఏర్పాటు చేస్తారు. ఈ అత్యాధునిక పరికరాల సహాయంతో ఆపరేషన్‌ కొనసాగుతుండగానే నిమిషనిమిషానికీ ఎప్పటికప్పుడు మెదడు చిత్రాల(ఇమేజెస్‌)ను చూసే వీలుకలుగుతుంటుంది. ఈ ఇమేజెస్‌ అందుబాటులో ఉండటం వల్ల సర్జన్లు ట్యూమర్‌ పరిమాణాన్ని, విస్తరణను విస్పష్టంగా చూడగలుగుతారు. ఫలితంగా మూలాల నుంచి గడ్డను తొలగించగలుగుతారు. అంతేకాదు... ఆ శస్త్రచికిత్స జరిగే క్రమంలో మెదడులోని వివిధ కీలకప్రాంతాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చూస్తారు. దాంతో అవి అదుపుచేసే శరీర భాగాల పనితీరు దెబ్బతినకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

కణితి ఉన్న ప్రదేశం వరకు పక్కాగా మార్క్‌ చేసి, మెదడులోని ఇతర కీలక భాగలు, ప్రధాన అవయవాలను నియంత్రించే వ్యవస్థలను ఎంతో జాగ్రత్తగా న్యూరో మానిటరింగ్‌ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తూ... ఏ అవయవాన్నీ కోల్పోకుండా, దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూ ఈ ‘ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరోమానిటరింగ్‌’ సహాయంతో సర్జరీ చేయవచ్చు. ఈ సర్జరీలు 90 శాతానికి పైగా విజయవంతమవుతున్నాయి. ఇక ఖర్చు విషయానికి వస్తే మామూలు సర్జరీలతో పోలిస్తే కేవలం 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే అదనంగా ఖర్చవుతుంది. అయితే మళ్లీమళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులను నివారించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది పెద్ద ఖర్చుగా భావించనక్కర్లేదు. ట్యూమర్‌ ఉన్న ప్రదేశం, సైజును బట్టి ఉండే రిస్క్‌ ఎలాంటి సర్జరీలలోనైనా ఉండనే ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ ఆధునిక పద్ధతిని ఉపయోగించుకొని శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.

- డాక్టర్‌ ఆనంద్‌ బాలసుబ్రమణియం, సీనియర్‌ న్యూరోసర్జన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top