మృదుస్పర్శ ఎరిగినవాడు

BIography Of Dajai Osamu - Sakshi

గ్రేట్‌ రైటర్‌

మనిషి స్వతహాగా బలహీనుడని నమ్ముతాడు డాజై ఒసాము (1909–1948). ఎదుటివాడి బలహీనతను ఎరిగి, మృదువుగా స్పందించడం ద్వారా వారికి సాంత్వన అందించగలమని చెబుతాడు. దీనికోసం ఆయన ఎన్నుకున్న ఒక మార్గం, జీవితపు కర్కశత్వానికి బలైపోయిన బలహీన పాత్రలను సృష్టించి, వాటిపట్ల పాఠకుల్లో ప్రగాఢమైన సానుభూతిని రేకెత్తించడం. ఈ మృదుస్పర్శ లేనివాడే ఆయన ఉద్దేశంలో దుష్టుడు. ఈ స్పర్శ లేదనిపించినప్పుడు ఆయన ఇతరుల రచనలను తిరగరాయడానికి కూడా వెనుకాడలేదు. అలాగే, రాయడం అంటే నిజాయితీ అని కూడా డాజై విశ్వాసం. వ్యక్తిగత జీవితాన్ని అత్యంత పారదర్శకంగా కనబరిచే ఆత్మకథాత్మక నవలలుగా ఆయన ‘ద సెట్టింగ్‌ సన్‌’, ‘నో లాంగర్‌ హ్యూమన్‌’ జపాన్‌లో కొనియాడబడుతున్నాయి.

అప్రయత్నంగా రాసే రచయితగా, అతి చిన్న విషయాలను గురించి పట్టించుకునే రచయితగా కూడా ఆయనకు పేరు. అయితే, కేవలం వాస్తవాన్ని ప్రతిబింబించడం పట్ల కూడా డాజైకి అభ్యంతరాలున్నాయి. ఎదుటివారిలో ఆర్ద్రతను మేల్కొల్పని వాస్తవికవాదాన్ని నిరసించాడు. వాస్తవం కన్నా సత్యం వైపు మొగ్గుచూపాడు. మనిషిగా బతకడంలో సంఘర్షణ ఎదుర్కొని, మద్యానికి బానిసై, అనారోగ్యం పాలై, సంబంధాలను చెడగొట్టుకుని, 39వ పుట్టినరోజు ఇంకా ఆరు రోజులుందనగా సహచరితో కలిసి కాలువలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఆయన తలపెట్టి పూర్తిచేయకుండా వదిలేసిన నవలిక పేరు ‘గుడ్‌బై’.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top