కేన్సర్‌కు కృత్రిమ వైరస్‌ విరుగుడు!

Artificial virus antidote to cancer - Sakshi

శరీరంలోని కేన్సర్‌ కణాలన్నింటినీ టకటక నమిలి మింగేస్తే...? పనిలోపనిగా వాటిపక్కన ఉండే హానికారక ఫైబ్రోబ్లాస్ట్‌ల నాశనమూ జరిగిపోతే? ఈ అద్భుతం సాకారమవుతోంది అంటున్నారు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. తాము సృష్టించిన కృత్రిమ వైరస్‌ అటు కేన్సర్‌ కణాలతోపాటు అవి రోగనిరోధక వ్యవస్థకు చిక్కకుండా చేసే ఫైబ్రోబ్లాస్ట్‌లను కూడా నాశనం చేస్తుందని వీరు తెలిపారు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ వైరస్‌ ఇప్పటికే కొన్ని క్లినికల్‌ ట్రయల్స్‌లో వాడుతూండటం! ఎనాడినోటుసిరీవ్‌ అని పిలుస్తున్న ఈ వైరస్‌ కేవలం కేన్సర్‌ కణాలపై మాత్రమే దాడిచేయడం ఇంకో ముఖ్యమైన అంశం. కేన్సర్‌ కణాలు టి–సెల్‌ ఎంగేజర్‌ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా ఈ వైరస్‌ కొన్ని సంకేతాలు పంపుతుంది.

ఈ టి–సెల్‌ ఎంగేజర్‌ ఒకవైపు ఫైబ్రోబ్లాస్ట్‌లను ఇంకోవైపు రోగ నిరోధక వ్యవస్థకు చెందిన టి–కణాలతోనూ అతుక్కుంటుంది. దీంతో టి–కణాలు ఫైబ్రోబ్లాస్ట్‌లను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తాయి. అంతేకాకుండా టి–సెల్‌ ఎంగేజర్‌ ప్రొటీన్‌ కేన్సర్‌ కణితి లోపల ఉండే రోగ నిరోధక వ్యవస్థ కణాలను కూడా చైతన్యవంతం చేస్తుందని ఫలితంగా అవి కూడా కేన్సర్‌ కణాలను మట్టుబెట్టడంలో మునిగిపోతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ జాషువా ఫ్రీడ్‌మ్యాన్‌ తెలిపారు. ఎలుకలతోపాటు పరిశోధనశాలలో మానవ కేన్సర్‌ కణాలపై జరిపిన ప్రయోగాల్లో ఈ కొత్త పద్ధతి మంచి ఫలితాలివ్వడం గమనార్హం.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top