మాదిరెడ్డి లోకమలహరి రచనలు | Article On Madireddy Sulochana In Sahithyam | Sakshi
Sakshi News home page

Dec 24 2018 12:24 AM | Updated on Dec 24 2018 12:24 AM

Article On Madireddy Sulochana In Sahithyam - Sakshi

తెలంగాణ సాహిత్య అకాడమి ఇటీవల రెండు పుస్తకాలు ప్రచురించింది. మాదిరెడ్డి సులోచన కథలు, లోకమలహరి నవలలు. లోకమలహరి (1910–2010) ‘శతాధిక గ్రంథకర్త’. చివర్లో సన్యాసాశ్రమం స్వీకరించి, వేదానంద సరస్వతీస్వామిగా పేరు మారాడు. 

లోకమలహరి 114 పేజీల పుస్తకంలో రెండు నవలలున్నాయి. జెగ్గని యిద్దె, సంఘము. వీటిని నవలికలు లేదా పెద్దకథలు అనవచ్చు. రెండూ రాసిన కాలం 1955. ‘పచ్చి పల్లెటూరు భాష’లో రాసిన జగ్గని విద్య వ్యవహారంలో జెగ్గని యిద్దె అయింది. ‘హరిజనులు కూడా చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలనేది జెగ్గని యిద్దె నవల పరమార్థం’. కథ మొదట్లోని జెగ్గడే కథ పూర్తయ్యేసరికి జగదీశ్‌ ఎం.ఎ., ఎల్‌.ఎల్‌.బి. అవుతాడు. గ్రామానికి తిరిగొచ్చి నిరక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేస్తాడు. ఇందులో వాడినదంతా నిజామాబాద్‌ గ్రామ్యభాష.

‘చేనేత జీవితాన్ని చిత్రించిన తొలి నవల’ సంఘము. జెగ్గని యిద్దె తర్వాత దీన్ని రాశాడు లోకమలహరి. ‘పద్మశాలీల దైనందిన జీవితంలోని కడగండ్లను, వాటికి ఊతమిచ్చే సమాజంలోని పెద్దమనుషుల నిజరూపాలను ‘సంఘము’ నవలలో బయటపెట్టాడు’. డాక్టర్‌ సరోజ వింజామర సంపాదకురాలిగా వ్యవహరించారు.

తెలుగు సాహిత్య చరిత్రలో 1960, 70 దశకాలు రచయిత్రుల యుగం. కోస్తా నుంచి చెప్పుకోదగినంత మంది  రచయిత్రులు ఈ కాలంలో విరివిగా రచనలు వెలువరించారు. అయితే ఉర్దూ రాజభాషగా ఉండటం వల్ల తెలుగు అక్షరాస్యత తక్కువగా ఉన్న తెలంగాణ నుంచి కూడా ఈ కాలంలో కొంతమంది రచయిత్రులు తలెత్తుకుని నిలబడటం విశేషం. ఇందులో మాదిరెడ్డి సులోచన ఒక్కరే 72 నవలలు, 100 పైగా కథలు వెలువరించడం గమనించాల్సిన విషయం. ఆమె రచనలు వెలువడిన కాలం 1965–83.

మాదిరెడ్డి సులోచన రచనలు పాఠకులకు అందుబాటులో లేకుండా పోయిన తరుణంలో సంగిశెట్టి శ్రీనివాస్‌ ఆమె కథలను సేకరించి, 2017లో తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రిఫరెల్‌ సెంటర్‌ తరఫున 20 కథలతో ఒక పుస్తకం వేశారు. ఆయన సేకరించిన మరో 32 కథలతో తెలంగాణ సాహిత్య అకాడమి ఈ పుస్తకాన్ని ప్రచురించింది. భార్యా కోపవతీ, పురుష లక్షణము, స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః, నేటి కథ, రంగప్రవేశం లాంటి కథలున్నాయిందులో.

 ‘మాదిరెడ్డి సులోచన కథల్లో శైలి సాఫీగా సాగుతుంది. మామూలు విషయమైనా ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా మార్చే నైపుణ్యం వుంది’ అంటారు ముందుమాటలో ముదిగంటి సుజాతారెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement