గ్రేట్‌ రైటర్‌.. డాంటే

Article On Great writer Dante - Sakshi

భాషలో గొప్ప విప్లవం తెచ్చాడు డాంటే (1265–1321). మధ్యయుగాల యూరప్‌ రచయితలు లాటిన్‌లో రాసేవారు. దానికి భిన్నంగా ప్రాంతీయ భాషలకు పట్టం కట్టాలన్న కవి డాంటే. డివైన్‌ కామెడీని తను మాట్లాడే తుస్కన్‌ మాండలీకంలో రాశాడు. డాంటే అడుగుజాడలో మరెందరో కవులు నడవడంతో ఈ భాషే తర్వాతర్వాత ఇటలీకి ప్రామాణిక భాష అయింది. డాంటేను సుప్రీమ్‌ పొయెట్‌ అంటారు. డివైన్‌ కామెడీ దీర్ఘకావ్యం ప్రపంచ సాహిత్యంలోనే ఎన్నదగిన రచనగా మన్నన పొందింది. స్వర్గం, నరకాల గురించిన ఆయన చిత్రణ పాశ్చాత్య కవులూ, కళాకారులూ ఎంతోమందిని ప్రభావితం చేసింది.

డాంటే జన్మించింది ఫ్లారెన్స్‌లో. ఇటలీలోని ఈ నగరం అప్పుడు స్వతంత్ర రిపబ్లిక్‌. పోప్‌ అధికారాలు నియంత్రించబడి, తమకు రోమ్‌ నుండి ఎక్కువ స్వేచ్ఛ కావాలని కోరుకున్న రాజకీయ వర్గం(వైట్‌ గెల్ఫ్స్‌)లో డాంటే ఉన్నాడు. పోప్‌కు మద్దతుగా ఉన్న వర్గం (బ్లాక్‌ గెల్ఫ్స్‌) పైచేయి సాధించినప్పుడు డాంటేకు దేశ బహిష్కార శిక్ష విధించబడింది. దీని ప్రకారం ఫ్లారెన్స్‌లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తారు. తర్వాతి రాజకీయ పరిణామాల్లో ఈ బహిష్కృతులకు కొందరికి క్షమాభిక్ష లభించినా షరతులకు అంగీకరించని కారణంగా డాంటే దానికి నోచుకోలేదు. తన జన్మభూమిలో అడుగు పెట్టకుండానే రవెన్నా (ఇటలీలోని మరో నగరం)లో మరణించాడు. ఆయన మరణానంతరం తప్పు తెలుసుకున్న పాలకులు ఫ్లారెన్స్‌లో ఒక సమాధి నిర్మించారు, డాంటే దేహం లేకుండానే. ‘మమ్మల్ని వదిలివెళ్లిన ఆయన ఆత్మ తిరిగొస్తుంది’ అని ఆయన వాక్యమే చెక్కించి. 700 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకు ఫ్లారెన్స్‌ మున్సిపాలిటీ 2008లో క్షమాపణ ప్రకటించింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top