
విద్యాబాలన్ ఫటాఫట్ చెప్పిన చిత్రేతర విషయాలు..
ఎప్పుడూ చిత్రాల గురించేనా? ఈసారి విద్యాబాలన్...
ఎప్పుడూ చిత్రాల గురించేనా? ఈసారి విద్యాబాలన్
ఫటాఫట్ చెప్పిన చిత్రేతర విషయాలు చదువుదాం...
1. కష్టం-తేలిక
ఒత్తిడికి గురవుతున్నాను...అని చెప్పడం తేలికే. ‘ఒత్తిడిని దూరంగా పెడతాను’ అని చెప్పడమే కష్టం. సాధన చేస్తే ఈ కష్టం తేలికవుతుంది.
2. నా శక్తి
‘వాళ్లు చేసారు కాబట్టి నేను చేస్తాను’ అనుకోను. ‘నేను ఇది చేయగలను. ఇది నా శక్తి’ అనుకుంటాను.
3. మన సైన్యం
కుటుంబమే మన సైన్యం. ఒంటరిగా ఉన్నప్పుడో, దూరంగా ఉన్నప్పుడో వారిని తలుచుకుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
4. ఆత్మవిమర్శ
పనికిమాలిన విమర్శకు దూరంగా ఉండడం ఎంత అవసరమో, ఆత్మవిమర్శకు అతి సమీపంగా ఉండడం కూడా అంతే అవసరం.
5. భయం భవంతి!
భయం అనే భవంతిలో నివసించకూడదు. అలా చేస్తే ఆరోగ్యానికి, ఆనందానికి దూరమవుతాం.
6. స్ట్రగుల్ తరువాతే...
శారీరక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు...దేనికీ నిమిషాల్లో రెడిమెడ్ సమాధానాలు ఉండవు. కొంత స్ట్రగుల్ తరువాతే జవాబు దొరుకుతుంది.
7. బాడీ చెబుతుంది
మనం ఏం తినాలో, తినకూడదో ఎవరో వచ్చి చెప్పనక్కర్లేదు. మన శరీరమే చెప్పగలదు. దాన్ని అనుసరిస్తే సరిపోతుంది.
8. నిద్రా నీళ్లు!
నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే... ఇప్పటికైనా ఇవ్వండి. నీళ్లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇవ్వండి. నేను రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగుతాను.
9. రూపమే నీ అందం
వేరే వ్యక్తితో పోల్చుకొని ‘నేను అందంగా లేను’ అనుకోవద్దు, ప్రతి వ్యక్తికి భిన్నమైన రూపం ఉంటుంది. అదే ఆ వ్యక్తికి అందం!
10. ఉద్యమం
‘నేను నల్లగా ఉన్నాను’ ‘నేను నలుపు కాబట్టి నన్ను చిన్న చూపుచూస్తున్నారు’ అని బాధ పడేవాళ్లను చూస్తే జాలేస్తుంది. ఇలాంటి వారి కోసం ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అనే ఉద్యమం ఒకటి మొదలు పెట్టాలనిపిస్తుంది.