మధుమేహంలో మరోరకం

 Another type of diabetes - Sakshi

సమ్‌థింగ్‌ స్పెషల్‌

మధుమేహంలోని ప్రధానమైన రెండు రకాలు... టైప్‌–1 డయాబెటిస్, టైప్‌–2 డయాబెటిస్‌ అని అందరికీ తెలిసిన సంగతే. ఇవే కాకుండా డయాబెటిస్‌లో మరికొన్ని అరుదైన రకాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి పాంక్రియోటోజెనిక్‌ డయాబెటిస్‌. దీనిని టైప్‌–3సీ డయాబెటిస్‌ అని కూడా అంటారు. ఈ డయాబెటిస్‌ను కొంతమంది వైద్యులు టైప్‌–2 డయాబెటిస్‌గానే గుర్తిస్తున్నారని, దీనివల్ల టైప్‌– 3సీ డయాబెటిస్‌ రోగులకు తగిన చికిత్స లభించక వారు ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారని ఇంగ్లాండ్‌లోని సర్రీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. పాంక్రియాస్‌ గ్రంథిలో వాపు, పాంక్రియాస్‌ కణజాలంలో అసాధారణమైన పెరుగుదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు టైప్‌–3సీ డయాబెటిస్‌ సోకుతుంది. దీని లక్షణాలు కూడా టైప్‌–2 డయాబెటిస్‌ మాదిరిగానే ఉంటాయని, రక్త పరీక్ష చేసినప్పుడు చక్కెర మోతాదు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది.

పాంక్రియాస్‌ నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు, పాంక్రియాస్‌ నుంచి ఉత్పత్తయ్యే ఇన్సులిన్‌కు శరీర కణజాలం స్పందిచనప్పుడు, స్థూలకాయం వంటి కారణాల వల్ల టైప్‌–2 డయాబెటిస్‌ తలెత్తుతుంది. టైప్‌–2 డయాబెటిస్‌లోను, టైప్‌–3సీ డయాబెటిస్‌లోను వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నా, కారణాలు మాత్రం వేర్వేరు. అందువల్ల అసలు కారణాలను గుర్తించి తగిన చికిత్స చేయకుంటే టైప్‌–3సీ రోగులు ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటారని సర్రీ వర్సిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే టైప్‌ 3íసీ డయాబెటిస్‌ పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top