అపార్ట్‌మెంట్‌పైనే ‘అమృత్‌’ పంటలు!

'Amrut' crops on apartment - Sakshi

ఇంటి పంట

ముంబైలో ఇంటిపంటలు సాగు చేస్తున్న డా. మేథా

ఈ నెల 5న ప్రపంచ భూముల దినోత్సవం సందర్భంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించుకుంటూనే భూసారాన్ని పెంపొందించుకుంటున్న అన్నదాతలతోపాటు.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న డాక్టర్‌ మేధా శ్రీంగార్‌పురే అనే సిటీ ఫార్మర్‌కు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం.. ఎందుకంటే.. పంట భూములకు దూరంగా కాంక్రీటు అరణ్యంలో నివాసం ఉంటున్న ఆమె తమ వంటింటి వ్యర్థాలను, చెరకు పిప్పిని ఉపయోగించి తమ అపార్ట్‌మెంటు మేడ పైనే ఆమె ‘అమృత్‌ మిట్టి’ని తయారు చేస్తున్నారు. అత్యంత సారవంతమైన అమృత్‌ మిట్టితో అద్భుత పోషక విలువలున్న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అనేక ఏళ్లుగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా, మహానగర జీవులకు ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌పై చెత్త భారాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతున్నారు. అంతేకాదు, ఆవు పేడ – మూత్రంలతో ద్రవ రూప ఎరువు ‘అమృత్‌ జల్‌’ను తయారు చేసుకొని వాడుతూ అమృతాహారాన్ని పండించుకుంటున్నారు.

కూరగాయలు.. పండ్లు..
ముంబై నగరంలోని మాజ్‌గవ్‌ టెర్రస్‌ అనే సొసైటీలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో దంత వైద్యురాలు మేధా శ్రీంగార్‌పురే రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆమె తమ అపార్ట్‌మెంట్‌ భవనం టెర్రస్‌పైనే సిటీ ఫార్మింగ్‌ చేస్తున్నారు. తన ఇంట్లోని కిటికీలతోపాటు ముఖ్యంగా టెర్రస్‌ను 150 నుంచి 200 రకాల మొక్కలతో నందనవనంగా మార్చారు. ప్రస్తుతం పండ్లలో జామపండ్లు, సీతఫలం, చెర్రీ పండ్లు,  బత్తాయి పండ్లు ఇలా అనేక రకాల పండ్ల చెట్లతోపాటు ఆకు కూరలు,  సీజనల్‌ కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, మునగకాయలు, పలు రకాల మిరపకాయలు, పుష్పాలు ఇలా అనేక రకాలు ఆమె ఇంటిపంటల్లో కనిపిస్తున్నాయి.

ఇతర భవనాల టెర్రస్‌లపైనా...
మాజ్‌గావ్‌ టెర్రస్‌ సొసైటీలో అన్ని భవనాలూ నాలుగు అంతస్తులవే ఉన్నాయి. డా. మేధా ఉండే భవనం టెర్రస్‌పై ఇంటిపంటల సాగులో మంచి ఫలితాలు కన్పించడంతో ఇతర భవనాల వారు కూడా వారి వారి టెర్రస్‌లపైనా  మొక్కలు నాటేందుకు ఆసక్తిచూపారు. రసాయనాలు లేకుండా పండే కూరగాయలను తింటే ఎంతో రుచితోపాటు మాటల్లో చెప్పలేని ఆరోగ్యం, ఆనందం కలుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. శని, ఆదివారాలలో 4 గంటల సమయం కేటాయిస్తున్నా. ఇదంతా చేయడానికి శ్రద్ధ చాలా అవసరం అంటారు డా. మేధా.

అపార్ట్‌మెంట్‌లో అందరి అనుమతితోనే..
వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సహజ సేంద్రియ ఎరువు ‘అమృత మిట్టి’ మా ఇంట్లో చాలా పోగైంది. దీన్ని ఏమి చేయాలని ఆలోచించగా టెర్రస్‌పై కూరగాయ మొక్కలు పెంచవచ్చన్న ఆలోచన వచ్చింది. అంతే భవనంలోని అన్ని అంతస్తులలో నివసించే వారిని సంప్రదించి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నా. సొసైటీ బాధ్యులతో చర్చలు జరిపి అన్ని అనుమతులు పొంది టెర్రస్‌పై అయిదేళ్ల కిందట సేంద్రియ పంటలు పెంచడం ప్రారంభించా. ఆ కొత్తలోనే అర్బన్‌ లీవ్స్‌ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని అనేక మెళకువలు తెలుసుకున్నా. అర్బన్‌ లీవ్స్‌కు వాలంటీర్‌గా సేవలందించడంతో అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలిసివచ్చాయి. దీంతో రెండేళ్లలోనే టెర్రస్‌పై పెంచిన మొక్కలు చక్కని దిగుబడినివ్వటం ప్రారంభమైంది. .
– డా. మేధా శ్రీంగార్‌పురే (98695 48090), మాజ్‌గావ్‌ టెర్రస్‌ సొసైటీ, ముంబై


ముంబైలో అర్బన్‌ లీవ్స్‌ సంస్థ టెర్రస్‌పై నెలకొల్పిన ఒక కమ్యూనిటీ గార్డెన్‌

 – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top