అనుసరించడమంటే అది..!

అనుసరించడమంటే అది..! - Sakshi

బౌద్ధవాణి

బుద్ధుడు అనారోగ్యం పాలయ్యాక ‘ఇక నేను ఎక్కువకాలం జీవించలేను’ అని ప్రకటించాడు. దాంతో ధర్మంలో పరిపూర్ణత సాధించలేకపోయినవారు ఆవేదన చెందారు. ‘అంత గొప్ప మానవీయ ధర్మాన్ని ప్రబోధించిన బుద్ధుడు ఇక మనకు ఆట్టే కాలం కనిపించడా?’ అని కలవరపడ్డారు. ఇక తాము చేయాల్సిన విధులన్నీ దాదాపుగా మాని ఆయన వెంటే పడి తిరుగుతూ ఉండేవారు. ఆయనకు సేవ చేయడానికి పోటీపడేవారు. ఆ మహనీయుని సేవలో గడపడం గొప్ప కార్యంగా భావించేవారు. వారిలో అత్తదత్తుడు అనే వాడు మాత్రం బుద్ధుని చూడ్డానిరీ, సేవకూ ఎప్పుడూ రాలేదు. బుద్ధుని విషయం తెలిసినప్పటినుంచి బుద్ధుని దగ్గరకు రావడమే మానుకున్నాడు. నిరంతరం ధ్యాన సాధనలో లీనమై పోయి ఉండేవాడు. ఒకరోజున భిక్షువులందరూ అతని మీద నింద మోపి బుద్ధుని ముందుకు తీసుకొచ్చి– ‘భగవాన్‌! చూశారా! మేమందరం మీ చెంతే ఉంటున్నాం. ఈ అత్తదత్తుడు మాత్రం ఈ ఛాయలకే రావడం లేదు’’ అని చెప్పారు. 

‘‘భిక్షూ! వీరి ఆరోపణ నిజమేనా? నీవు ఏం చేస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వుతో.‘‘నిజమే భగవాన్‌! నేను ధ్యానంలో పరిపూర్ణత సాధించలేదు. అర్హంతుడను కాలేదు. మీరు జీవించి ఉండగానేనేను అర్హంతుడను కావాలని నిశ్చయించుకున్నాను. అందుకే నిరంతరం ఆ మార్గంలోనే ఉంటున్నాను’’ అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘భిక్షువులారా! అత్తదత్తుడు చెప్పిందే సత్యం. మీరు ధర్మాన్ని అనుసరించడమ అంటే నన్ను అనుసరించడం కాదు. నా మార్గాన్ని అనుసరించడం. అర్హంతులు కావడం ఇకనైనా మీరు అర్హంత సాధనకు మళ్లండి’’ అని ప్రబోధించాడు. మిగిలిను భిక్షువులు అత్తదత్తుణ్ణి అనుసరించారు. వ్యక్తి మీద గౌరవం చూపడం కంటే ఆ వ్యక్తి నిర్దేశించిన మార్గంలో పయనించడమే అసలౌన ఆదర్శం అని తెలియజెప్పే ఈ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినది, అనుసరించవలసిందీనూ. అర్హంతుడు –అర్హుడు, అర్హంత– అర్హత
– డా. బొర్రా గోవర్ధన్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top