మంత్రి ముచ్చట మొదలైంది.. | Sakshi
Sakshi News home page

మంత్రి ముచ్చట మొదలైంది..

Published Sun, May 18 2014 2:07 AM

మంత్రి ముచ్చట మొదలైంది.. - Sakshi

  •   అమాత్య పదవి అదృష్టం ఎవరికో!
  •   రేసులో ఉమా, కాగిత, మండలి
  •   కొనకళ్లకు కేంద్రంలో ఛాన్స్ దొరికేనా!
  •  సాక్షి, మచిలీపట్నం : ఎన్నికల ఘట్టం ముగిసింది.. మంత్రి పదవుల ముచ్చట మొదలైంది. జిల్లాలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనన్న చర్చ సాగుతోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టనున్న తరుణంలో మంత్రి పదవులకోసం ప్రతిపాదనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ రేసులో టీడీపీ సీనియర్లు ముందున్నారు. జిల్లాలో ఎవరికి అమాత్య పదవులు ఇస్తారనే అంశంపై తర్జనభర్జన సాగుతోంది.

    జిల్లాకు ఒక్క మంత్రి పదవే ఇస్తే అది కచ్చితంగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకే దక్కుంతుందన్న ప్రచారం సాగుతోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమకు ఈసారి మంత్రి పదవి ఖాయంగా దక్కుతుందని భావిస్తున్నారు. సామాజికవర్గ సమీకరణల్లో ఉమకు కాకుంటే ఆయన తరువాత పెడన ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత వెంకట్రావుకు ఇస్తారని తెలుస్తోంది.

    ఆరుసార్లు పోటీ చేసిన కాగిత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ప్రభుత్వ చీఫ్ విప్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవులను నిర్వహించారు. నాలుగోసారి గెలిచిన కాగితకు కూడా ఈ సారి మంత్రి పదవి దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకు ఒకటి ఇస్తే ఉమా, కాగితలో ఒకరికి, రెండు మంత్రి పదవులు ఇస్తే వీరిద్దరికీ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. వీరితోపాటు మరో సీనియర్ నేతయిన మండలి బుద్ధప్రసాద్‌కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే విషయం పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

    అయితే కొత్తగా టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన బుద్ధప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కోస్తా తీరంలో మత్స్యకారవర్గానికి టీడీపీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే బందరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు.

    ఆయన మామ నడకుదుటి నరసింహారావు గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే కొల్లు రవీంద్ర తొలిసారిగా ఎమ్మెల్యే కావడంతో ఆయనకు అమాత్య పదవి ఇచ్చే అవకాశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీరితోపాటు జిల్లాలో మంత్రి పదవులపై ఆశలుపెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
     
    ఈ నేపథ్యంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందిన గద్దే రామ్మోహన్‌రావు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో రెండోసారి గెలిచిన శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకరరావు, గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ పేర్లు మంత్రి పదవి రేసులో ఉన్నాయన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.
     
    కేంద్రంలో కొనకళ్లకు చోటు...!
     
    జిల్లాలో బీసీ వర్గానికి చెందిన కొనకళ్ల నారాయణరావు రెండో పర్యాయం ఎంపీగా ఎన్నిక కావడంతో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంతి పదవి ఇవ్వాలని మోడీని చంద్రబాబు కోరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీకి సంబంధించి కోస్తా జిల్లాల్లో కీలక నేతగా ఎదిగిన బీసీ నేత కింజరపు ఎర్రన్నాయుడు లేని లోటును కొనకళ్లతో భర్తీ చేసేందుకు చంద్రబాబు ఇటీవల ప్రాధాన్యత ఇస్తున్నారు.

    ఈ నేపథ్యంలోనే ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన సుజనాచౌదరి తరువాత బీసీ నేత కొనకళ్లకు స్థానం కల్పించేలా ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్‌డీఏ కూటమితో పనిలేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో టీడీపీకి కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. అయినా కేంద్ర మంత్రి పదవుల కోసం అప్పుడే టీడీపీలో ప్రయత్నాలు మొదలుకావడం గమనార్హం.

Advertisement
Advertisement