అన్నీ ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి... ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, అభ్యర్థుల ప్రకటనలు, అలకలు, బుజ్జగింపులు, నామినేషన్ల దాఖలు, పరిశీలనలు, ఉపసంహరణలు...
అన్నీ ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి... ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, అభ్యర్థుల ప్రకటనలు, అలకలు, బుజ్జగింపులు, నామినేషన్ల దాఖలు, పరిశీలనలు, ఉపసంహరణలు... ఇలా సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో ఒక్కో అంకానికి తెరపడుతోంది. ఇక ఇప్పుడు మిగిలిందల్లా రెండే ప్రధాన ఘట్టాలు. ఈ పదిరోజుల పాటు విస్తృత ప్రచారం.. 30న పోలింగ్ కార్యక్రమం. ఈ రెండు పూర్తయితే సార్వత్రిక ఎన్నికలు దాదాపు అయిపోయినట్టే. ఒక్క ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలిపోతుంది. ఈ సమయంలో జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. డప్పుచప్పుళ్లలో, పూలవానలు కురిపించుకుంటూ ప్రజలను కలుస్తున్నారు.
ప్రచార పర్వంలో అభ్యర్థులు వెళ్లి ఓట్లడగడం ఒక ఎత్తయితే... ఆ అభ్యర్థుల తరఫున ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలు, ప్రచార తారలు వచ్చి ప్రచారం నిర్వహించడం మరో ఎత్తు. ఈ స్టార్ క్యాంపెయినర్ల కోసమే ఇప్పుడు జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఒక్క వైఎస్సార్‌సీపీ మినహా ఏ పార్టీకి ఇప్పటి వరకు ప్రచార క్యాంపెయినర్లు జిల్లాకు రాలేదు. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐలతో పాటు బీజేపీ నేతలు తమ పార్టీల అగ్రనేతలు వస్తారేమోనని ఎదురుచూస్తున్నా రు. అయితే, ప్రచారానికి ఇక పదిరోజులు మా త్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంకా అగ్రనేతల షెడ్యూల్ కూడా ఖరారు కాకపోవడంతో స్టార్ క్యాంపెయినర్లు ఈసారి జిల్లాకు రావడం అనుమానమేనని, ఎవరైనా వచ్చినా జిల్లాలో ఎక్కడోచోట బహిరంగ సభ నిర్వహించి వెళ్లిపోతా రే తప్ప రోజుల తరబడి ప్రచారం నిర్వహిం చే అవకాశం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి.
అమ్మ రాదు... యువరాజయినా వస్తారా?
కాంగ్రెస్ విషయానికి వస్తే.... తెలంగాణ తామే ఇచ్చామని చెప్పేందుకు కూడా అగ్రనేతలు జిల్లాకు రారేమోననే భయం స్థానిక నాయకత్వానికి పట్టుకుంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పటికే తెలంగాణలో ఓ దఫా పర్యటించారు. మరోమారు పర్యటించే అవకాశం ఉన్నా జిల్లాకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యువరాజు రాహుల్‌నయినా జిల్లాకు తీసుకురావాలని జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన పర్యటన తేలలేదు. రాహుల్ నల్లగొండ జిల్లాకు మాత్రమే వస్తారని టీపీసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరిని పక్కనపెడితే కనీసం రేణుకాచౌదరి కూడా ఇంకా ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొనడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక తమకు తామే స్టార్‌క్యాంపెయినర్లమనే భావనకు వచ్చారు స్థానిక కాంగ్రెస్ అభ్యర్థులు.
‘బాబు’ను తీసుకురావాలని...
మరో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఈసారి ఒక్కడే స్టార్‌క్యాంపెయినర్. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. గత ఎన్నికలలో పార్టీ తర ఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు కానీ ఈసారి ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక, లోకేశ్ బాబు కేవలం సీమాంధ్ర జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో మాత్రమే ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబును జిల్లాకు తీసుకురావాలని స్థానిక నాయకత్వం ప్రయత్నిస్తున్నా...వర్గపోరు నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో ఆయన సభ పెట్టాలనేది నిర్ణయించడం కష్టమవుతోందని తెలుగుతమ్ముళ్లు అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని జిల్లాలోని పినపాక ఒక్క స్థానంలోనే పోటీచేస్తున్న బీజేపీ తరఫున ఆ పార్టీ అగ్రనేతలెవరూ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానం కావడంతో పాటు హైదరాబాద్‌కు చాలా దూరంలో ఉండడంతో అక్కడకు వచ్చేందుకు అగ్రనేతలెవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లా పార్టీ నాయకత్వం కూడా పెద్దగా
సీరియస్‌గా తీసుకోవడం లేదు.
సీపీఐ విషయానికి వస్తే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శే ఇక్కడ స్వయంగా బరిలో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీచేస్తున్న నారాయణ తరఫున స్టార్‌క్యాంపెయినర్లు అవసరం లేదని, ఆయనే పెద్ద స్టార్‌క్యాంపెయినర్ అని ఆ పార్టీ శ్రేణులంటున్నాయి. అయితే, బర్ధన్ లేదా సురవరం సుధాకర్‌రెడ్డి ప్రచారానికి రావచ్చని చెపుతున్నారు కానీ తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు టీఆర్‌ఎస్ నుంచి కూడా ఇంతవరకూ పెద్దనేతలు ఎవరూ ప్రచారానికి జిల్లాకు రాలేదు. అయితే, పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 22నజిల్లాలోని పలుప్రాంతాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
షర్మిల రాకతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం
స్టార్‌క్యాంపెయినర్లు రాక పలు ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి అలా ఉంటే.... ఎన్నికల అవగాహన కుదుర్చుకుని వైఎస్సార్‌సీపీ, సీపీఎం అభ్యర్థులు మాత్రం ఫుల్‌జోష్‌తో ముందుకెళుతున్నారు. ఆ రెండు పార్టీల పక్షాన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విసృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని పది నియోజకవర్గాలను నాలుగు రోజుల్లో చుట్టొచ్చిన ఆమె పర్యటనకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అడుగడుగునా నీరాజనం పలికిన జనం వైఎస్సార్‌సీపీ, సీపీఎం అభ్యర్థులు గెలుపునకు భరోసా ఇచ్చారు. షర్మిల పర్యటనతో జిల్లాలోని రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఉత్సాహం తొణికిసలాడుతోంది. ముఖ్యంగా ఆమె పర్యటన ప్రారంభించిందీ... ముగించిందీ కూడా ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న సీపీఎం అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లోనే. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఇరుపార్టీల అభ్యర్థుల విజయం కోసం అలుపెరగని శ్రమ చేస్తున్నారు. కాగా, సీపీఎం అగ్రనేతలు కూడా జిల్లాలో పర్యటించి వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 24న సీతారాం ఏచూరి, 28న బృందాకారత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం జిల్లాకు రానున్నారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం శ్రేణులు మరింత ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాయి.