వాయవ్య ఢిల్లీ బరిలో రాఖీ బిర్లా | Rakhi Birla will replace North West Delhi candidate | Sakshi
Sakshi News home page

వాయవ్య ఢిల్లీ బరిలో రాఖీ బిర్లా

Mar 18 2014 10:52 PM | Updated on Apr 4 2018 7:42 PM

వాయవ్య ఢిల్లీ రిజర్వ్‌డ్ ఎంపీ సీటు బరి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మహేంద్ర సింగ్ వైదొలిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి మాజీ మంత్రి రాఖీబిర్లా పోటీ చేస్తున్నట్టు సమాచారం.

 సాక్షి, న్యూఢిల్లీ: వాయవ్య ఢిల్లీ రిజర్వ్‌డ్ ఎంపీ సీటు బరి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మహేంద్ర సింగ్ వైదొలిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి మాజీ మంత్రి రాఖీబిర్లా పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఈమె కేజ్రీవాల్ సర్కారులో మహిళాశిశు అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. వాయవ్యఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరి నుంచి వైదొలగడానికి మహేంద్ర సింగ్ కారణాలు వెల్లడించలేదు.  సింగ్‌పై క్రిమినల్ కేసులున్న దృష్ట్యా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను కోరిందని,  అందుకు సింగ్ అంగీకరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  అన్నా హజారే ఆందోళనలు మొదలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న సింగ్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని సమాచారం. ఈ విషయం తమకు ఇటీవలే తెలిసిందని ఆప్ నేత ఒకరు చెప్పారు.
 
 నకిలీ నోట్ల చెలామణి కేసులో సింగ్ మూడు నెలలు జైలులో ఉన్నట్లు తేలడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు.  ఇప్పుడు ఈ స్థానం నుంచి రాఖీ బిర్లాను అభ్యర్థిగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ  నిర్ణయించింది. వాయవ్య ఢిల్లీ నుంచి రాఖీ బిర్లాను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీలో ఒక వర్గం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే శాసనసభ్యులకు టికెట్ ఇవ్వరాదని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ మొదట్లోనే ప్రకటించారు. ఇది వరకే ఎమ్మెల్యే అయిన రాఖీకి ఎలా టికెట్ ఇస్తారంటూ కొందరు కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు.  ఇప్పుడు మహేంద్ర సింగ్ అభ్యర్థిత్వం రద్దు కావడంతో రాఖీ బిర్లాను ఎన్నికల బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోంది.
 
 నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి  కేజ్రీవాల్‌ను బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించి కాబట్టి రాఖీని అభ్యర్థిగా ప్రకటించడం సులువుగా మారిందని పార్టీ నేత చెప్పారు. వాయవ్య ఢిల్లీకి ప్రస్తుతం   కృష్ణాతీరథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ ఇక్కడి నుంచి ఉదిత్‌రాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. రాఖీ బిర్లా ఆమ్ ఆద్మీ పార్టీలో దళిత నేతగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ దిగ్గజం రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించారు. ఇది వరకే కీలక దళిత నేతలుగా ముద్ర పడిన ఉదిత్ రాజ్‌ను, కృష్ణా తీరథ్‌ను ఎదుర్కోవడానికి రాఖీ బిర్లాయే తగిన అభ్యర్థని పార్టీ భావించినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement