నయాపైసా లేదు.. | Laborers, students in election contest | Sakshi
Sakshi News home page

నయాపైసా లేదు..

Apr 20 2014 11:12 PM | Updated on Sep 2 2017 6:17 AM

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా నిలుచున్నవారు నామినేషన్ల సమయంలో తమకు ఉన్న ఆస్తులు,అప్పుల వివరాలను అందజేశారు.

సాక్షి, ముంబై: సాధారణంగా రాజకీయ నాయకులంటే ఖద్దరు చొక్కా..శిల్కు ప్యాంట్.. చేతి నాలుగు వేళ్లకు ఉంగరాలు.. పక్కన ఇద్దరు పీఏలు.. ఇలా కనిపించేవారికే గౌరవం, మర్యాద, జేజేలు దక్కుతాయనేది జగమెరిగిన సత్యం.. దీంతోపాటు ఎన్నికలంటే వీరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.. కనీసం కోటీశ్వరుడై ఉండాలి.. డబ్బు మంచినీటిప్రాయంగా ఖర్చుపెట్టగలగాలి.. అప్పుడే మందీమార్బలం వారి వెంట ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా నిలుచున్నవారు నామినేషన్ల సమయంలో తమకు ఉన్న ఆస్తులు,అప్పుల వివరాలను అందజేశారు.

 వాటిలో కొంతమంది తమ ఆస్తులను రూ.వందల కోట్లలో చూపిస్తే.. మరి కొందరు కొంచెం తక్కువ మొత్తంలో చూపించారు. కాని రాష్ర్టవ్యాప్తం 19 మంది తమ పేరిట ఎలాంటి వాహనాలు, సొంత ఇల్లు, బంగళా, బంగారం, వెండి, భూములు, బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు, షేర్లు లేవని తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరు పోటీల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల వాళ్లు కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటుండగా, వీరు మాత్రం పైసా ఖర్చు పెట్టకుం డానే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

 ఇదివరకు నామినేషన్ పత్రాలు దాఖ లు చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఆస్తులు ఇంతా... అంటూ ఎంతో కొంత అందులో పొందుపర్చారు. అవన్ని నమ్మశక్యంగా లేవని, తప్పుల తడకగా చూపించారని అనేక మంది ఆరోపించారు. కాని తమవద్ద నయా పైసా లేదని పేర్కొన్న ఈ 19 మంది అభ్యర్థులను నిలదీయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాకపోవడం గమనార్హం. ఎన్నికల సమయంలో ప్రతీ అభ్యర్థి రూ.70 లక్షలలోపు ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. కాని చేతిలో చిల్లిగవ్వలేదని ప్రకటించిన ఈ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ ఎన్నికల ప్రచార ఖర్చు ఎంతమేర చూపిస్తారనేది ఆసక్తిగా మారింది. నాగపూర్‌కు చెందిన శశికళా అహ్మద్, రాజేశ్ సాధన్కర్, చందా మాన్వాత్కర్, ధీరజ్ గజబియే ఈ నలుగురు అభ్యర్థులు కూలి పనులు చేస్తూ ఒంటరిగానే సైకిల్‌పై సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు.

 విదర్భకు చెందిన పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన యావత్మాల్‌కు చెందిన ఉత్తం కాంబ్లే, చంద్రాపూర్‌కు చెందిన వినోద్ మేశ్రాం, అమరావతికి చెందిన కిరణతాయి కోకాటే, భండార-గోందియాకు చెందిన ధనంజయ్ రాజ్‌భోగే, అకోలాకు చెందిన సందీప్ వాంఖేడే తమవద్ద చిల్లిగవ్వలేదని అఫిడెవిట్‌లో స్పష్టం చేశారు. వీరితోపాటు బీడ్‌కు చెందిన హరి హర్ భగావత్, వీర్ శేష్‌రావ్ చోఖోబా, సుమిత్ర పవార్, ప్రశాంత్ ససాణే, అశోక్ సోనవ ణే కూడా తమ అఫిడవిట్‌లలో ఆస్తులు లేనట్లే చూపించారు. మావల్ నియోజక వర్గానికి చెందిన సీమా మాణిక్, సతారాకు చెందిన విజయ్ పాటిల్, జాల్నాకు చెంది న విఠల్ శేల్కే, ఔరంగాబాద్‌కు చెందిన భానుదాస్ సరోదే, జల్గావ్‌కు చెందిన సందీప్ పాటిల్, నాసిక్‌కు చెందిన మహేశ్ అవ్హాడ్ ఉన్నారు.

 వీరంతా నయాపైసా లేదని అఫిడవిట్‌లో స్పష్టం చేసినప్పటికీ ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం శోచనీయం. మరో విశేషమేమిటంటే ఇందులో బీడ్ నుంచి పోటీచేస్తున్న సుమిత్ర పవార్ నిరక్షరాస్యులు కాగా, యావత్మాల్ నుంచి పోటీచేస్తున్న హరిహర్ భాగవత్ పోస్టుగ్రాడ్యు యేట్. ఈ వివరాలను రాష్ట ఎన్నికల అధికారి మాధవి సర్‌దేశ్‌ముఖ్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement