ఇక్కడ గెలిస్తే ఢిల్లీలో కీలకం | here elections depends upon delhi politics | Sakshi
Sakshi News home page

ఇక్కడ గెలిస్తే ఢిల్లీలో కీలకం

Apr 4 2014 1:53 AM | Updated on Aug 29 2018 8:54 PM

హస్తినలో ఖమ్మం స్థానబలం దృఢంగానే ఉంది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎంపీలుగా గెలిచినవారు కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు.

ఖమ్మం, న్యూస్‌లైన్: హస్తినలో ఖమ్మం స్థానబలం దృఢంగానే ఉంది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎంపీలుగా గెలిచినవారు కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అయితే కేంద్రమంత్రులు..లేదంటే కీలకనేతలుగా వ్యవహరిస్తున్నారు. నాడు లక్ష్మీకాంతమ్మ మొద లు నేటి నామా నాగేశ్వరరావు వరకు ఇదే ఒరవడి కొనసాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీపై ప్రత్యేకమైన చర్చ సాగుతోంది. ఉద్యమాల ఖిల్లా, రాజ కీయ చైతన్యవంతమైనదిగా పేరుతెచ్చుకున్న జిల్లా నుంచి పార్లమెంట్‌కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఏ పార్టీ వారైనా.., ఏ నాయకుడైనా ఖమ్మం ఎంపీ అంటే పార్లమెంట్‌లో గుర్తింపు పొందిన వారుగా ఉండటం పరిపాటిగా మారింది. ఈ సారి ఎన్నికయ్యే ఎంపీ కూడా ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తారనే చర్చ కొనసాగుతోంది.

 కేంద్ర మంత్రులుగా ప్రత్యేక ముద్ర
 జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జలగం వెంగళరావు 1980లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా కొనసాగారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచిన రంగయ్యనాయుడుకి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. వీరిద్దరితో పాటు జిల్లా నుంచి ఎన్నికైన రేణుకాచౌదరికి కూడా కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడం గమనార్హం.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో కొంతభాగం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లింది. దీనికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో పోరిక బలరాంనాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా అనూహ్యంగా కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా ఆయన మన్మోహన్‌సింగ్ మంత్రి వర్గంలో పనిచేశారు.

 ఢిల్లీలో ‘కీ’రోల్...
 ఖమ్మం నుంచి ఎంపీలుగా గెలుపొందిన కొందరు కేంద్రమంత్రులైతే మరికొందరు ఢిల్లీస్థాయిలో కీలకభూమిక పోషిస్తున్నారు. లక్ష్మీకాంతమ్మ, జలగం కొండల్‌రావు పార్లమెంట్‌లో తమ వాణిని బలంగా వినిపించారు.
 సీపీఎం నుంచి ఎన్నికైన తమ్మినేని వీరభద్రం ఆ పార్టీ తరఫున తన మార్కును ప్రదర్శించారు. గత ఎన్నికల్లో గెలుపొందిన నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ పార్లమెంటరీ నేతగా కొనసాగడం విశేషం.
 
  అదే దారిలో పొంగులేటి శీనన్న..!
 లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదేబాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున లోక్‌సభ తొలి అభ్యర్థిగా మార్చి 5వ తేదీన ఖమ్మంలో జరిగిన సభలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ‘శీనన్నను కేంద్రమంత్రిని చేస్తాను’ అని ప్రకటించడం దీనికి సూచికగా చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement