జెయింట్ కిల్లర్... కొత్తపల్లి గీత!!

జెయింట్ కిల్లర్... కొత్తపల్లి గీత!! - Sakshi


వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్... ఐదుసార్లు లోక్సభకు ఎంపికై, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లాంటి అత్యున్నత నిర్ణాయక మండలిలో సభ్యత్వం ఉండి, కేంద్ర మంత్రిగా అపార అనుభవం సాధించిన నేత. జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి అన్నది ఎరుగని ధీరుడు. అలాంటి ఉద్దండుడితో ఢీకొన్నప్పుడు కొత్తపల్లి గీతను అంతా కొండ.. పొట్టేలుతో పోల్చారు. కానీ, అంతటి గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న కిశోర్ చంద్రదేవ్ను ఓడించి.. విశాఖ జిల్లా అరకు నుంచి లోక్సభలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొత్తపల్లి గీత. కురుపాం రాజా వైరిచర్ల దుర్గాప్రసాద దేవ్, రాజమాత శోభలతాదేవిల కుమారుడైన కిశోర్ చంద్రదేవ్ అంటే కాంగ్రెస్ అధిష్ఠానంలో కూడా మంచి పేరుంది. అలాంటి పెద్ద నాయకుడిని లోక్సభ ఎన్నికలలో ఓడించడం అంటే చిన్న విషయం కానే కాదు. కానీ, ఆ ఘనతను సాధించి చూపించి జెయింట్ కిల్లర్గా నిలిచారు.. కొత్తపల్లి గీత.గిరిజనులలో అట్టడుగు వర్గమైన వాల్మీక తెగకు చెందిన ఆమె కుటుంబం.. రాష్ట్రంలోనే మొట్టమొదటగా గ్రూప్-1 పట్టా పొందింది. గీత తండ్రి కొత్తపల్లి జాకోబ్ తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలానికి చెందినవారు. ఆయన బాటలోనే.. గీత కూడా గ్రూప్-1 సాధించారు. 2010 వరకు ప్రభుత్వ సర్వీసులలో ఉన్న ఆమె, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, సేవారంగంలోకి ప్రవేశించారు. గీతాస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా నాలుగు జిల్లాల్లో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారు.ఆమె సేవాభావాన్ని గుర్తించడంతో పాటు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ప్రజల అవసరాలు, సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కిశోర్ చంద్రదేవ్కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే అరకు వాసులు గీతను తమ ఎంపీగా ఎన్నుకున్నారు. ఆమెకు మొత్తం 2,17,637 ఓట్లు వచ్చాయి. కిశోర్ చంద్రదేవ్కు కేవలం 20,507 ఓట్లు మాత్రమే రావడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రెండోస్థానంలో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి నిలిచారు. ఆమెకు 2,00,094 ఓట్లు వచ్చాయి. దాంతో గీతకు 17,543 ఓట్ల మెజారిటీ వచ్చినట్లయింది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తన మనసును కలచివేసిందని, ప్రజాసేవ పుణ్యం వల్లే ఆయన మరణానంతరం కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గీత అన్నారు. అందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. నాలుగు జిల్లాల్లో 40 సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న అరకు నియోజకవర్గ అభివృద్ధికి కొత్త భాష్యం చెబుతానని, అన్నివేళలా అందుబాటులో ఉండి ప్రజాశ్రేయస్సుకు పాటు పడతానని హామీ ఇచ్చారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top