breaking news
giant killer
-
జెయింట్ కిల్లర్... కొత్తపల్లి గీత!!
వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్... ఐదుసార్లు లోక్‌సభకు ఎంపికై, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లాంటి అత్యున్నత నిర్ణాయక మండలిలో సభ్యత్వం ఉండి, కేంద్ర మంత్రిగా అపార అనుభవం సాధించిన నేత. జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి అన్నది ఎరుగని ధీరుడు. అలాంటి ఉద్దండుడితో ఢీకొన్నప్పుడు కొత్తపల్లి గీతను అంతా కొండ.. పొట్టేలుతో పోల్చారు. కానీ, అంతటి గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న కిశోర్ చంద్రదేవ్‌ను ఓడించి.. విశాఖ జిల్లా అరకు నుంచి లోక్‌సభలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొత్తపల్లి గీత. కురుపాం రాజా వైరిచర్ల దుర్గాప్రసాద దేవ్, రాజమాత శోభలతాదేవిల కుమారుడైన కిశోర్ చంద్రదేవ్ అంటే కాంగ్రెస్ అధిష్ఠానంలో కూడా మంచి పేరుంది. అలాంటి పెద్ద నాయకుడిని లోక్‌సభ ఎన్నికలలో ఓడించడం అంటే చిన్న విషయం కానే కాదు. కానీ, ఆ ఘనతను సాధించి చూపించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.. కొత్తపల్లి గీత. గిరిజనులలో అట్టడుగు వర్గమైన వాల్మీక తెగకు చెందిన ఆమె కుటుంబం.. రాష్ట్రంలోనే మొట్టమొదటగా గ్రూప్-1 పట్టా పొందింది. గీత తండ్రి కొత్తపల్లి జాకోబ్ తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలానికి చెందినవారు. ఆయన బాటలోనే.. గీత కూడా గ్రూప్-1 సాధించారు. 2010 వరకు ప్రభుత్వ సర్వీసులలో ఉన్న ఆమె, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, సేవారంగంలోకి ప్రవేశించారు. గీతాస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా నాలుగు జిల్లాల్లో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారు. ఆమె సేవాభావాన్ని గుర్తించడంతో పాటు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ప్రజల అవసరాలు, సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కిశోర్ చంద్రదేవ్‌కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే అరకు వాసులు గీతను తమ ఎంపీగా ఎన్నుకున్నారు. ఆమెకు మొత్తం 2,17,637 ఓట్లు వచ్చాయి. కిశోర్ చంద్రదేవ్‌కు కేవలం 20,507 ఓట్లు మాత్రమే రావడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రెండోస్థానంలో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి నిలిచారు. ఆమెకు 2,00,094 ఓట్లు వచ్చాయి. దాంతో గీతకు 17,543 ఓట్ల మెజారిటీ వచ్చినట్లయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తన మనసును కలచివేసిందని, ప్రజాసేవ పుణ్యం వల్లే ఆయన మరణానంతరం కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గీత అన్నారు. అందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. నాలుగు జిల్లాల్లో 40 సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న అరకు నియోజకవర్గ అభివృద్ధికి కొత్త భాష్యం చెబుతానని, అన్నివేళలా అందుబాటులో ఉండి ప్రజాశ్రేయస్సుకు పాటు పడతానని హామీ ఇచ్చారు. -
నాడు జెయింట్ కిల్లర్.. నేడు?
అవి.. చిరంజీవి కొత్తగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజులు. చిరంజీవి సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కాగా, ఆయన అత్తవారి ఊరు ఆ పక్కనే ఉండే పాలకొల్లు. చిరంజీవి తన అత్తవారి ఊరైన పాలకొల్లుతో పాటు ఎందుకైనా మంచిదని తిరుపతి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేశారు. తాను పుట్టి పెరిగిన జిల్లా కావడం, అత్తవారి ఊళ్లో ముందునుంచి స్థానబలం ఉండటంతో పాలకొల్లులో సులభంగా గెలవగలనని భావించారు. ప్రచారం మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణిని అభ్యర్థినిగా రంగంలో నిలిచారు. ఆమె మీద అప్పట్లో అంతగా అంచనాలు కూడా లేవు. ఎన్నికలు జరిగాయి. చిరంజీవి రెండుచోట్లా బంపర్ మెజారిటీతో గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఫలితం తలకిందులైంది. తన సొంత ఊరి లాంటి పాలకొల్లులో చిరంజీవి ఓ మహిళ చేతిలో దారుణంగా ఓడిపోయారు. అది కూడా ఏదో అంతంత మాత్రం మెజారిటీ కాదు.. ఐదు వేలకు పైగా ఓట్ల తేడా! దాంతో ఒక్కసారిగా బంగారు ఉషారాణి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగిపోయింది. జెయింట్ కిల్లర్ ఉషారాణి అంటూ జాతీయ మీడియా కూడా అప్పట్లో ఆమె గురించి రాసింది. ఆ ఎన్నికల్లో ఉషారాణికి 49,720 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన చిరంజీవి 44,274 ఓట్లు మాత్రమే పొందగలిగారు. అంటే, వీరిద్దరి ఓట్ల మధ్య తేడా 5,446 అన్నమాట. మూడో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ)కి 29,371 ఓట్లు వచ్చాయి. తర్వాత క్రమంగా ఆమెకు ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి. పెద్దగా జనంలో తిరగలేదు. తనకు కావల్సిన వాళ్లకు పదవులు ఇప్పించుకోడానికి మాత్రం ప్రయత్నించారన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. తనకు సలహాదారుగా వ్యవహరించిన ఓ మాజీ పాత్రికేయుడికి నామినేటెడ్ పదవి ఇప్పించుకోవడంలో ఆమె సఫలీకృతులయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకవేళ ఉషారాణికి టికెట్ రాకపోతే తాను పోటీ చేస్తానంటూ అదే వ్యక్తి ఉత్సాహం చూపుతున్నారని వినికిడి. ఉషారాణి మాత్రం పోటీ చేసినా ఈసారి ఎన్నోస్థానంలో ఉంటారనేది అనుమానమేనని స్థానికులు అంటున్నారు. డిపాజిట్ దక్కకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. జెయింట్ కిల్లర్ కాస్తా.. ఈసారి నామమాత్రంగా మిగిలిపోతారని వినిపిస్తోంది.